Share News

బాద్‌షా ఫిదా

ABN , Publish Date - Sep 12 , 2024 | 04:59 AM

కళాశాలలో ఉత్సవం. వందల్లో ఆహూతులు. వేదిక మీద ఆట పాట. బ్యాక్‌గ్రౌండ్‌లో హిట్‌ నంబర్‌ ‘కాలా చష్మా..’ వినిపిస్తుంటే... మాస్‌ స్టెప్పులతో కుర్రకారు తమను తాము మరిచిపోయారు.

బాద్‌షా ఫిదా

కళాశాలలో ఉత్సవం. వందల్లో ఆహూతులు. వేదిక మీద ఆట పాట. బ్యాక్‌గ్రౌండ్‌లో హిట్‌ నంబర్‌ ‘కాలా చష్మా..’ వినిపిస్తుంటే... మాస్‌ స్టెప్పులతో కుర్రకారు తమను తాము మరిచిపోయారు.

ఇంతలో ఓ అధ్యాపకురాలు... ఉన్నట్టుండి వేదిక ఎక్కి... మెరుపులా మెరిశారు. మరో ముగ్గురు ప్రొఫెసర్లు ఆమెకు తోడయ్యారు. విద్యార్థినులతో కలిసి కాలు కదిపి... వారిలో ఒకరయ్యారు.

ఇక చెప్పేదేముంది... ఒక్కసారిగా అక్కడున్నవారిలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఆనందం అంచులకు వెళ్లింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింటిని ఊపేస్తోంది.

ఇంతకీ ఈ వేడుక ఎక్కడనేగా! కేరళ రాష్ట్రం కొచ్చిలోని ‘సెయింట్‌ థెరెసా కాలేజీ’లో ఇటీవల ఓ ఉత్సవం జరిగింది. విద్యార్థుల్లోని కళాకారుల్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ షోకు రూపకర్త... భరతనాట్యం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అరుణిమా దేవశీష్‌. ఈ వీడియోలో చీర కట్టుతో కనిపించిన ఆమె... సంప్రదాయ నృత్యానికి పాశ్చాత్య హంగులు అద్ది... అదరహో అనిపించారు. దాన్ని ఎవరో వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. గంటల వ్యవధిలోనే లక్షల మంది వీక్షించారు.

Arunima-(8).jpg


విశేషమేమంటే... ‘కాలా చష్మా’ పాట పాడిన స్టార్‌ ర్యాపర్‌ బాద్‌షా కూడా అరుణిమా డ్యాన్స్‌కు ఫిదా అయ్యాడు. ఆమె వీడియోకు ఒక లైక్‌ వేసుకున్నాడు. దాంతో వీక్షకుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికి దాదాపు 1.2 కోట్లమంది వీక్షించారు. ఇన్‌స్టాలోనే కాకుండా ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ తదితర సామాజిక మాధ్యమాలన్నిటిలో అరుణిమా నాట్యం హాట్‌ ఫేవరెట్‌ అయింది.

‘బాద్‌షా కూడా మా వీడియోను మెచ్చుకున్నాడు’ అంటూ సంతోషం వ్యక్తం చేసిన ఈ ప్రొఫెసర్‌కు అసలు వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ అయిన విషయమే తెలియదట. ‘‘నా శిష్యుల్లో ఎవరో దాన్ని పోస్ట్‌ చేశారు. ఒక్కసారిగా వ్యూస్‌ పెరిగిపోవడంతో ‘నీ డ్యాన్స్‌ అద్భుతం’ అంటూ సన్నిహితులు, బంధువుల నుంచి నాకు ఫోన్లు రావడం మొదలయ్యాయి. మంచి బీట్‌ ఉన్న పాట... దానికి మా కాలేజీ అమ్మాయిల స్టెప్పులు చూసి... నాకు కూడా ఉత్సాహం వచ్చేసింది. అలా స్టేజీ మీదకు వెళ్లి, వారితో కలిసి ఆడేశాను. ఇంతలా నచ్చుతుందని అస్సలు ఊహించలేదు’ అంటారు అరుణిమా. ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. దాని కోసమే భరతనాట్యం నేర్చుకున్నారు. చివరకు ఇలా అధ్యాపకురాలిగా స్థిరపడ్డారు.

‘మా విద్యార్థినుల్లోని కళాత్మక కోణాన్ని వెలికి తీయడానికి ఏటా టాలెంట్‌ షోలు నిర్వహిస్తాం. గత ఏడాది కూడా ఇలానే వాళ్లతో కలిసి నేను చేసిన డ్యాన్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇన్‌స్టాలో ఆ వీడియోను ముప్ఫై లక్షల మందికి పైగా చూశారు. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొనే మళ్లీ నా వీడియోను నాకు తెలియకుండా పోస్ట్‌ చేసివుంటారు’ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు అరుణిమా. అయితే షోకి ముందు రిహార్సల్స్‌ లాంటివి ఏవీ ఉండవట. వేదిక ఎక్కిన తరువాత సంగీతానికి అనుగుణంగా ఎవరికి వారు లయబద్దంగా నర్తిస్తారని, అదే సహజసిద్ధంగా, చూడముచ్చటగా ఉంటుందని అంటారు ఆమె.

Updated Date - Sep 12 , 2024 | 04:59 AM