ఆ మహిళల జీవితాల్లో వెలుగు కోసం...
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:12 AM
ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు తన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో భర్త చేతిలో శారీరక, మానసిక, లైంగిక హింసకు గురవుతున్నారు. చాలా మంది మహిళలు తమపట్ల అమానుషాన్ని బయటకు చెప్పడం లేదు.
ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు తన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో భర్త చేతిలో శారీరక, మానసిక, లైంగిక హింసకు గురవుతున్నారు. చాలా మంది మహిళలు తమపట్ల అమానుషాన్ని బయటకు చెప్పడం లేదు. అందులో 14 శాతం మంది మహిళలు మాత్రమే హింసను అరికట్టేందుకు సహాయం కోరుతూ బయటకు వస్తున్నారు. గృహహింసను ఎదుర్కొన్న మహిళలకు బాసటగా నిలుస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు డా.ప్రసన్న గెట్టు. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ విక్టిమ్ కేర్ అనే సంస్థను స్థాపించి గృహహింసను రూపుమాపేందుకు కృషిచేస్తున్నారు.
పద్దెనిమిది నుంచి ముప్ఫైతొమ్మిదేళ్ల మధ్య వయస్సున్న పెళ్లయిన ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు గృహహింసను ఎదుర్కొంటున్నట్టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు, గృహహింస బారినపడిన మహిళలకు ఆసరాగా నిలిచేందుకు కృషిచేస్తున్నారు డా.ప్రసన్న గెట్టు. ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ విక్టిమ్ కేర్ అనే సంస్థ ద్వారా ఆమె సేవలందిస్తున్నారు. క్రిమినాలజిస్టుగా, విక్టిమాలజిస్టుగా మహిళల కోసం అవిశ్రాంత కృషి చేస్తున్నారామె. 2001లో మహిళల రక్షణ కోసం ఆమె ఈ సంస్థను స్థాపించారు. ‘‘మద్రాసు యూనివర్సిటీలో క్రిమినాలజీ డిపార్టుమెంటులో పీహెచ్‌డీ చేశాను. ఆ తరువాత జపాన్‌లోని టొకివా యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ డిప్లొమా ఇన్ విక్టిమాలజీ కోర్సు పూర్తి చేశాను. దీన్ని వరల్డ్ సొసైటీ ఆఫ్ విక్టిమాలజీ నిర్వహించింది. మొదటి బ్యాచులో నాతోపాటు మరో ఇద్దరు భారతీయులు ఉన్నారు. కోర్సులో భాగంగా మేం విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్స్‌ను సందర్శించాం. అది నాకు చాలా ఆసక్తిని కలిగించింది. ఇండియాకు తిరిగొచ్చాక ప్రయోగాత్మకంగా చెన్నైలో విక్టిమ్ అసిస్టెన్స్ సెంటర్‌ను ప్రారంభించాం. మా దగ్గరకు వచ్చిన కేసులన్నీ గృహహింసకు సంబంధించినవే. ఆ సమయంలో గృహహింసను ఎదుర్కొన్న మహిళలకు ఆశ్రయం ఇచ్చేందుకు ఎక్కడా కూడా షెల్టర్ హోమ్స్, కమ్యునిటీ షెల్టర్స్ గానీ లేవు. అది గమనించిన మేం మా సేవలను ప్రారంభించాం. అమెరికాకు వెళ్లి అధ్యయనం చేశాం. షెల్టర్ హోమ్స్‌లో బస చేసి అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకున్నాం. శిక్షణ తీసుకున్నాం. ఆ తరువాతే హెల్ప్ లైన్ సెంటర్, షెల్టర్ సర్వీస్ ప్రారంభించాం’’ అని సంస్థను ప్రారంభించిన తీరును వివరిస్తారు డా. ప్రసన్న గెట్టు. ఏ రకమైన హింసను ఎదుర్కొంటున్న మహిళలైనా సరే ఈ సంస్థ సేవలను పొందవచ్చు. 23 ఏళ్ల క్రితం ప్రారంభమైన హెల్ప్‌లైన్, ఇప్పుడు ‘ధ్వని’ పేరుతో నేషనల్ డొమెస్టిక్ వయొలెన్స్ హాట్‌లైన్‌గా మారి సేవలందిస్తోంది. ‘‘మహిళలు, వారి బంధువులు, స్నేహితులు ఎవరైనాసరే 24/7 కాల్ చేసి వారి సమస్యలు చెప్పుకోవచ్చు. వారు చెప్పేది పూర్తి గోప్యంగా ఉంచుతాం. వారు మాతో స్వేచ్ఛగా సమస్యల గురించి చెప్పుకునే వాతావరణాన్ని కల్పిస్తాం. ఆ తరువాత కౌన్సెలింగ్ ఇస్తాం. వాళ్లను హింసకు గురి చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో వివరిస్తాం’’ అని అంటారు డా.గెట్టు.
అందరి బాధ్యత...
ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ విక్టిమ్ కేర్ సంస్థ ఎమర్జెన్సీ షెల్టర్, లాంగ్ టర్మ్ షెల్టర్, ట్రాన్సిషన్ షెల్టర్ పేరుతో మూడు రకాల ఆశ్రయాలను అందిస్తోంది. ‘‘గృహహింస మహిళలకు సంబంధించిన సమస్యగానే చూడకూడదు. పురుషులు కూడా ఈ సమస్యపై మాట్లాడాలి. కంపెనీలు, ఇనిస్టిట్యూషన్లు బాధ్యత తీసుకోవాలి. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. అందరిపై బాధ్యత ఉంది. గృహహింస బారినపడిన ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వాళ్లు ఒంటరి వాళ్లు కాదు. మంచి జీవితం గడిపేందుకు వాళ్లకూ అవకాశం ఉంది. వాళ్లకు సహాయసహకారాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి’’ అని భరోసా ఇస్తారు డా.గెట్టు. గృహహింసకు ఎలాంటి సరిహద్దులు లేవు. బీద, ధనిక తారతమ్యాలు లేవు. మనం ప్రేమించాల్సిన వ్యక్తులు చేస్తున్న హింస గురించి మాట్లాడుతున్నాం. గృహహింసను రూపుమాపేందుకు కొన్ని అంశాలను పాటించాలని ఆమె అంటున్నారు. ‘‘ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు వాదించుకోవడం ఆపేయాలి. లేదంటే ఈ హింస కొనసాగుతూనే ఉంటుంది.
ఆ చక్రాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పాఠశాల విద్యలో గృహహింస గురించి చెప్పాలి. పిల్లలను ఎడ్యుకేట్ చేయాలి. గృహహింసను సాధారణ నేరంగా పరిగణించకుండా వెంటనే చర్యలు తీసుకునేలా మార్పులు చేయాలి. గృహహింస జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్లు మాకెందుకు అని వదిలేయకుండా స్పందించాలి’’ అని అంటారు డా.గెట్టు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే గృహహింస కనుమరుగవుతుంది అనడంలో సందేహం లేదు.