Share News

కల్తీ లేని నెయ్యి దొరుకుతుందా?

ABN , Publish Date - Oct 01 , 2024 | 05:36 AM

మంది ఎంత పెరిగినా, బజార్లో దొరికే నేతి మిఠాయిలకు కొదవుండదు. ఇక్కడే నెయ్యి తాజాదనం గురించి తార్కికంగా ఆలోచించాలి. స్వచ్ఛమైన నెయ్యిని పొందడం కోసం కల్తీలను పసిగట్టడంతో పాటు, ఇంట్లో స్వయంగా నేతిని తయారుచేసుకోగలిగే మెలకువల గురించి తెలుసుకోవాలి.

కల్తీ లేని నెయ్యి దొరుకుతుందా?

మంది ఎంత పెరిగినా, బజార్లో దొరికే నేతి మిఠాయిలకు కొదవుండదు. ఇక్కడే నెయ్యి తాజాదనం గురించి తార్కికంగా ఆలోచించాలి. స్వచ్ఛమైన నెయ్యిని పొందడం కోసం కల్తీలను పసిగట్టడంతో పాటు, ఇంట్లో స్వయంగా నేతిని తయారుచేసుకోగలిగే మెలకువల గురించి తెలుసుకోవాలి.

మనం కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు పెంచుకుంటాం. పప్పుధాన్యాలు పండించుకుంటాం. కోళ్లు, మేకలను పెంచుకుంటాం! తిరగళ్లతో పిండ్లు ఇసురుకుం టాం! కానీ ఘన, ద్రవ రూపాల్లోని కొవ్వులను మాత్రం బయటి నుంచే కొనుక్కుంటూ ఉంటాం! వంటల కోసం, రుచి కోసం ఉపయోగించే నూనెలు, నెయ్యిలను ఇళ్లలో తయారు చేసుకునే సంప్రదాయం క్రమేపీ అడుగంటింది. అవసరం పెరగడం, ఉత్పత్తులు తగ్గడం వల్ల కల్తీలు సర్వత్రా సర్వసామాన్యపోయాయి. నెయ్యిలోని పోషక విలువల గురించి అవగాహన పెరిగిన తర్వాత, తాజా నెయ్యి కోసం వెంపర్లాట ఊపందుకుంది. కానీ కల్తీ లేని నెయ్యి బజార్లో దొరుకుతుందా? నిజానికి ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, నూరు శాతం స్వచ్ఛమైన నెయ్యి దొరకని పరిస్థితి నెలకొని ఉంది. అయినా పిండి వంటల తయారీ కోసం, భోజనంలో రుచిని పెంచుకోవడం కోసం తరచూ నెయ్యి మీద ఆధారపడక తప్పడం లేదు. దాంతో మార్కెట్లో దొరికే బ్రాండెడ్‌ ఘీల మీద ఆధార పడుతున్నాం. లేదంటే గ్రామాల్లో గాలించి తెచ్చుకుంటు న్నాం. అయితే ఇలా మనం స్వచ్ఛమైన నెయ్యినే కొంటున్నామా?

కల్తీ నెయ్యిని ఇలా కనిపెట్టాలి

నెయ్యి విషయంలో కళ్లు, ముక్కు మనల్ని మోసం చేయలేవు. ఘుమఘుమలాడుతూ, లేత బంగారు రంగులో కనిపించేది మాత్రమే స్వచ్ఛమైన నెయ్యి. రంగు, వాసనలు, గాఢతలో తేడాలు కనిపిస్తే, కొన్ని తేలికపాటి పరీక్షలతో నెయ్యిలో జరిగిన కల్తీని సునాయాసంగా కనిపెట్టవచ్చు.

అదెలాగంటే...

పాల అవక్షేప పరీక్ష: తెల్ల పేపర్‌ లేదా ప్లేటు మీద ఒక స్పూను నెయ్యిని వేసి, కొన్ని గంటల పాటు అలాగే వదిలే యాలి. తర్వాత పేపర్‌, లేదా ప్లేటు మీద ఏవైనా మలినాలు, అవక్షేపాలు కనిపిస్తే ఆ నెయ్యి కల్తీదని అర్థం చేసుకోవాలి. స్వచ్ఛమైన నెయ్యితో ఎలాంటి మరకలు ఏర్పడవు.

స్పష్టత, ఆకృతి: స్వచ్ఛమైన నెయ్యి పారదర్శకంగా ఉంటుంది. నున్నని టెక్స్‌చర్‌ను కలిగి ఉంటుంది. మసకగా ఉన్నా, కణుపులు కనిపించినా, ముద్దగా ఉన్నా దాన్లో కల్తీ జరిగిందని అర్థం చేసుకోవాలి. స్వచ్ఛమైన నేయి, గది ఉష్ణోగ్రతలో ద్రవ రూపంలో ఉంటుంది.

బర్న్‌ టెస్ట్‌: ఒక టీ స్పూను నెయ్యిని ప్యాన్‌లో వేడి చేసి అది కల్తీదో కాదో కనిపెట్టవచ్చు. స్వచ్ఛమైన వేడి తగిలిన వెంటనే ఎలాంటి పొగలు, మాడు వాసనలను వెలువరించకుండా క్షణాల్లో కరిగిపోతుంది. మలినాలు కలిసిన నెయ్యి పొగలు, దుర్వాసనలను వెలువరిస్తుంది.

నీళ్ల పరీక్ష: గోరువెచ్చని నీళ్లలో కొద్ది పాటి నెయ్యిని వేయాలి. నెయ్యి స్వచ్ఛమైనదైతే వెంటనే నీళ్లలో కరిగిపోతుంది. నీళ్లు కూడా స్పష్టంగా ఉంటాయి. ఒకవేళ ఏదానా మడ్డి, మలినాలు నెయ్యి నుంచి వేరుపడితే, అది కల్తీదని అర్థం చేసుకోవాలి.

ఫ్రిజ్‌ పరీక్ష: నెయ్యిని కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. స్వచ్ఛమైన నెయ్యి హెచ్చుతగ్గులు లేకుండా సమంగా గడ్డకడుతుంది. దీన్లో వేర్వేరు పొరలు, స్ఫటికాలూ కనిపించవు. హెచ్చుతగ్గులతో కూడిన పొరలు, స్ఫటికాలూ కనిపిస్తే అది కల్తీ నెయ్యిని అర్థం.

రుచి పరీక్ష: స్వచ్ఛమైన నెయ్యి నోట్లో వేసుకున్నప్పుడు వెన్నలా తగులుతుంది. కల్తీ నెయ్యి తేలికగా గొంతులోకి జారకుండా, దంతాలకూ, నాలుకకూ అంటుకుంటుంది.

మరక పరీక్ష: స్వచ్ఛమైన నెయ్యి ఎలాంటి మరకలనూ ఏర్పరచదు. వస్త్రం మీద నెయ్యి మరక ఏర్పడినా, ఏవైనా అవక్షేపాలు మిగిలిపోయినా ఆ నెయ్యి కచ్చితంగా కల్తీదే!


టేబుల్‌ బటర్‌తో నెయ్యి

స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారుచేసుకోవాలో మనందరికీ తెలిసిందే! పాలు కాచి, తోడుకున్న పెరుగును చిలికితే, వెన్న తయారవుతుంది. ఈ వెన్నను వేడి చేసి నెయ్యి తయారుచేసుకోవచ్చు. కానీ కల్తీ లేని చిక్కని పాలు కరువైపోతున్న ఈ రోజుల్లో, రెడీమేడ్‌ వెన్న నుంచి నెయ్యినె లా తయారుచేసుకోవచ్చో తెలుసుకుందాం! నెయ్యి తయారీ కోసం సాల్టెడ్‌ బటర్‌కు బదులుగా అన్‌సాల్టెడ్‌/టేబుల్‌ బటర్‌ ఎంచుకోవాలి. ఈ వెన్నను ముక్కలు చేసి, పాత్రలో వేసి చిన్న మంట మీద కాచుకోవాలి. 5 నుంచి 8 నిమిషాల్లో వెన్న కరిగి, ఉడికి బంగారు రంగులోకి మారిపోతుంది. కమ్మని వాసన కూడా మొదలవుతుంది. చివర్లో గుప్పెడు కరివేపాకు చల్లి పొయ్యి నుంచి దించేసుకుని, చల్లారిన తర్వాత సీసాలో నిల్వ చేసుకుని వాడుకోవాలి. మిల్క్‌ క్రీమ్‌ నుంచి కొందరు నెయ్యి తయారుచేసుకుంటూ ఉంటారు. దీన్ని కూడా పాత్రలో వేసి, కాచి, నెయ్యి తయారు చేసుకోవచ్చు. అయితే నెయ్యి తయారు చేసుకునేటప్పుడు పొగలు వచ్చేవరకూ మరిగించుకోకూడదు. ఇలా చేస్తే నెయ్యి మాడిపోవడమే కాకుండా, పోషకాలన్నీ అడుగంటే ప్రమాదం ఉంటుంది.

నెయ్యి నిల్వ ఇలా...

నెయ్యి గది ఉష్ణోగ్రతలో 3 నుంచి 4 నెలల వరకూ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఫ్రిజ్‌లో ఏడాది వరకూ నిల్వ ఉంటుంది. ఒకవేళ గడ్డకట్టిపోకుండా ఉండాలనుకుంటే, నెయ్యి సీసాలో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి.

Updated Date - Oct 01 , 2024 | 05:36 AM