Share News

మాకు ఆ గుర్తింపు చాలు

ABN , Publish Date - Sep 12 , 2024 | 05:07 AM

ధైర్య సాహసాలు, ధిక్కార స్వభావం, గొప్ప వ్యక్తిత్వం, సడలని ఆత్మస్థైర్యం, సమసమాజం రావాలన్న బలమైన ఆకాంక్ష... ఈ గుణాలన్నిటికీ ప్రతీక చాకలి ఐలమ్మ. ఆమె జీవితం

మాకు ఆ గుర్తింపు చాలు

ధైర్య సాహసాలు, ధిక్కార స్వభావం, గొప్ప వ్యక్తిత్వం, సడలని ఆత్మస్థైర్యం, సమసమాజం

రావాలన్న బలమైన ఆకాంక్ష... ఈ గుణాలన్నిటికీ ప్రతీక చాకలి ఐలమ్మ. ఆమె జీవితం

యువతరానికి స్ఫూర్తి పాఠం. ఎన్నడూ బడిముఖం కూడా ఎరుగని ఆ మహనీయురాలి పేరు... కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి అలంకారం కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె

మునిమనుమరాలు చిట్యాల శ్వేతా ఐలమ్మను ‘నవ్య’ పలకరించింది.

‘‘చాకలి ఐలమ్మ రక్తం పంచుకొని పుట్టినవారు మాత్రమే కాదు, అన్యాయాన్ని ధిక్కరించే వారంతా ఆ అమ్మకు వారసులే. చిట్యాల ఐలమ్మకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక కొడుకును రజాకార్లు పొట్టనపెట్టుకొన్నారు. మిగిలిన వారందరిలో.. ఆమె పెద్దకుమారుడు సోమయ్యకు చిన్న కొడుకైన రామచంద్రం ఒక్కరే తన నాయనమ్మ నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొన్నారు. అతను ఐలమ్మ దగ్గరే పెరిగి పెద్దయ్యారు. ఆమె ఆదర్శాలను అనుసరించారు. సీపీఎం స్థానిక నాయకుడిగా, 20 ఏళ్ళు పాలకుర్తి సర్పంచ్‌గా పుట్టినగడ్డకు మంచి పనులెన్నో చేశారు. గ్రంథాలయం కట్టించారు. పేదలకు ఇళ్ళు మంజూరు చేయించడం, ఊరుకు రోడ్లు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు సమకూర్చడం కోసం ఎంతో కష్టపడ్డారు. నేను ఆ రామచంద్రం గారి చిన్నకొడుకు సంపత్‌కుమార్‌ భార్యను. చిట్యాల వారింట 2007లో అడుగుపెట్టాను. గొప్ప చరిత్ర కలిగిన కుటుంబానికి కోడలిగా వచ్చానని అంతవరకూ నాకు తెలీదు. ఒకసారి ఐలమ్మ విగ్రహావిష్కరణకు మామయ్య వెంట నేనూ వెళ్లాను. అప్పుడు ఆ వీరనారి సాగించిన ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రజలంతా వేనోళ్లా కీర్తించడం విని పులకించిపోయాను. ‘‘ఈ భూమి నాది. పండించిన పంట నాది. తీసుకెళ్ళడానికి దొరెవ్వడు?’’ అని సివంగిలా గర్జించిన ఐలమ్మ జీవితం నన్ను కదిలించింది. ఆ స్ఫూర్తితోనే నా పేరును ‘శ్వేత ఐలమ్మ’గా మార్చుకున్నాను. నా వంతు సేవ చేయాలనే సంకల్పంతో ప్రజాజీవితంలోకి వచ్చాను. ప్రతి సంవత్సరం ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడంలో నా వంతు పాత్ర పోషిస్తున్నాను.

ఇన్నాళ్ళకు గుర్తింపు దక్కింది...

కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించడం... ఆ పోరాటయోధురాలికి దక్కిన ఘనమైన నివాళి. ఆమె చరిత్ర తరతరాలకు తెలిసేలా ఇలాంటిదేదైనా మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే బావుంటుందని కుటుంబ సభ్యులమంతా చాలారోజులుగా అనుకొంటున్నాం. నిజానికి ఐలమ్మకు వారసులు ఉన్నారని సమాజానికి తెలిసిందీ, ఐలమ్మ వారసులుగా మాకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించిందీ కూడా ఇప్పుడే. ఇంతకుముందు కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం ఐలమ్మ పేరును బాగా ఉపయోగించుకొన్నారు. ఆమె వారసులమైన మమ్మల్ని కావాలని విస్మరించారు. నాలుగేళ్ళ కిందట మంత్రిగా ఉన్న ఒక పెద్దమనిషి అయితే విగ్రహావిష్కరణ సభకు వచ్చి, మా ఊసే ఎత్తకుండా ఉపన్యాసాలిచ్చారు. మాకు కీర్తికిరీటాలు అక్కర్లేదు, కేవలం ఐలమ్మ వారసులుగా గుర్తింపు మాత్రమే ఆశించాం. అది ఇన్నాళ్ళకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. నన్ను తెలంగాణ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నియమిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనడం సంతోషం. దాన్ని పదవి లేదా హోదా అనుకోకుండా.. బాధ్యతగా భావించి నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తాను.

ఆమెకు భయమనేది తెలియదు

ఐలమ్మ తరతరాలుగా వస్తున్న వృత్తిచేయడం ఇష్టంలేకనే నాగలి పట్టింది. కౌలు రైతుగా మారింది. ఇది మా మామయ్య చెప్పగా విన్నాను. వందకుపైగా గొర్రెలు, యాభై పశువులు, ఐదు ఎడ్ల జతలతో చాలా పెద్ద వ్యవసాయమట. స్వాభిమానానికి ప్రతీకగా తలెత్తుకు బతుకుతున్న ఐలమ్మను చూసి విస్నూరు దొరకు కడుపు మండింది. దొరలకు వ్యతిరేకంగా గొంతెత్తిందని తెలిసి, 200మంది గూండాలను పంపాడు. వారంతా ఇంటి మీద పడి గొర్రెలు, మేకలు, పశువులు... అన్నిటినీ తోలుకెళ్లారు. అన్నం కుండలు, నీటి తొట్టెలతో సహా వస్తువులన్నిటినీ ధ్వంసం చేశారు. పచ్చిబాలింతగా ఉన్న ఆమె కూతురిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భర్తను, కొడుకును ఐలమ్మ కోల్పోయింది. అయినా, ఆ యోధురాలు అడుగు వెనక్కివేయలేదు. తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. రోకలి బండ చేతపట్టి దొరలు, దేశ్‌ముఖ్‌ల మోచేతినీళ్ళు తాగే గూండాలను పరుగులు తీయించింది. ఆమెకు భయమనేది తెలియదు. కోర్టు విచారణకు పాలకుర్తి నుంచి హైదరాబాద్‌ కాలినడకన వెళ్లి వచ్చేదని తెలిసి ఆశ్చర్యం కలిగింది. పోరాట పటిమ, తెగువ, ఆత్మస్థైర్యం, ధైర్యసాహసాల్లో మనమంతా ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి.


సాదాసీదా జీవితం...

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ముగిసిన తర్వాత ఐలమ్మ అత్యంత సాదాసీదా జీవితమే గడిపింది. ఒంట్లో ఒపిక ఉన్నంత కాలం వరినాట్లు లాంటి వ్యవసాయ పనులు చేసింది. నాట్ల పాటలు, బతుకమ్మ పాటలు చాలా బాగా పాడేదని మా మామయ్య చెబుతుంటారు. స్వాతంత్య్ర సమరయోధుల పింఛను కూడా ఆమెకు రాలేదు.

భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసయ్య, కమలాదేవి, మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు అప్పుడప్పుడు వస్తుండేవారట. వారిని ఆమె సొంత కొడుకులు, కూతుళ్ళలా అనుకొన్నది. వారందరూ ఆరుబయట నులకమంచం మీద కూర్చొని... పోరాటం తాలూకు జ్ఞాపకాలను గుర్తుచేసుకొనేవారు. ఐలమ్మ సాహసగాథను ఆమె ముందే ‘శారదకాండ్రు’ (జానపద గాయకులు) కథగా చెబుతుంటే, విని మురిసిపోయేది. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు అజ్ఞాతంలో ఉన్నసమయంలో ‘జనవాణి’ పత్రికను ఆమె చేతుల మీదుగా ఆవిష్కరించజేశారట. ఆనాటి కమ్యూనిస్టు యోధులందరికి ఆమె అంటే చాలా గౌరవమట. ఇవన్నీ మా రామచంద్రం మామయ్య ద్వారా విన్నాను. ఇంత గొప్ప ఇంటికి కోడలిగా వచ్చినందుకు, ఐలమ్మకు వరుసకు మునిమనుమరాలిని అయినందుకు గర్వపడుతున్నాను. సమాజం కోసం నిస్వార్థంగా పోరాడిన ఐలమ్మ కుటుంబ సభ్యురాలుగా నాకు ఈ గుర్తింపు, గౌరవం దక్కడం నా అదృష్టం. దీన్ని నిలబెట్టుకోవడమే నా ముందున్న బాధ్యత.

ఐలమ్మపై సమగ్ర గ్రంథం

చాకలి ఐలమ్మ పోరాట పటిమను పుచ్చలపల్లి సుందరయ్య గారు ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం - నా అనుభవాలు’ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితర పెద్దలంతా వారి ఆత్మకథల్లో ఆమె వీరత్వాన్ని ఘనంగా పరిచయం చేశారు. ఇప్పటివరకు ఐలమ్మ జీవితం మీద కొన్ని రచనలు వచ్చాయి. అయితే, అవన్నీ సమగ్రంగా లేవన్నది మా మామయ్య రామచంద్రం అభిప్రాయం. ఐలమ్మ ఉద్యమ జీవితంపై సమగ్ర గ్రంథాన్ని అతి త్వరలోనే తీసుకురాబోతున్నాం.

అక్కడా ఐలమ్మ విగ్రహాలు...

వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాలు తెలంగాణలోనే కాదు... ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల, కర్నూలు, విజయవాడ తదితర ప్రాంతాల్లో కూడా నెలకొల్పారు. ఆమెకు దేశమంతటా అభిమానులున్నారు.

ఇప్పటివరకు 290కుపైగా విగ్రహాలున్నాయి. పాలకుర్తిలో స్మారక స్థూపం, స్మారక భవనంతో పాటు 550 కిలోల కంచుతో చేసిన కాంస్య ప్రతిమ... ఇవన్నీ ఐలమ్మ వీరత్వానికి చిహ్నాలుగా మా ప్రాంత యువతను ఉత్తేజితులను చేస్తున్నాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ముందు చాకలి ఐలమ్మ శకటం ఊరేగించడం... అది సబ్బండ వర్గాలకు దక్కిన గౌరవం.

కేవీ

Updated Date - Sep 12 , 2024 | 05:07 AM