Culture : కళా వారసత్వానికి కొత్త ఊపిరి
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:10 AM
అంతరించిపోతున్న జానపద సంగీతాన్ని సజీవంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. భర్త గోవింద్‌సింగ్ భాటీతో కలిసి... యువ కళాకారులను ప్రోత్సహిస్తూ... ఘురాలియో వంటి రాజస్థాన్ సంస్కృతితో ముడిపడిన
అంతరించిపోతున్న జానపద సంగీతాన్ని సజీవంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు ఆమె. భర్త గోవింద్‌సింగ్ భాటీతో కలిసి... యువ కళాకారులను ప్రోత్సహిస్తూ... ఘురాలియో వంటి రాజస్థాన్ సంస్కృతితో ముడిపడిన వాయిద్యాలను భావితరాలకు అందిస్తున్నారు. దాని కోసం ‘లోక్ సంగీత్ శాల’ నెలకొల్పి... నవతరం కళాకారులను తీర్చిదిద్దుతున్న షరాన్ జెనీవివ్ కథ ఇది.
‘‘శతృదుర్భేధ్యమైన కోటలు, కళ్లు తిప్పుకోనివ్వని సౌధాలకే కాదు... ఎన్నో అపురూప సంప్రదాయ, జానపద కళలకూ, కళాకారులకూ నిలయం మా రాజస్థాన్. కానీ క్రమంగా ఆ కళలు కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా పలు వాయిద్యాలను వారసత్వంగా కొనసాగించేవారు కరువై... వాటి ఉనికిని కోల్పోతున్నాయి. ఇది మమ్మల్ని తీవ్రంగా కలవరానికి గురి చేసింది. మాది తమిళనాడే అయినా పెళ్లి తరువాత రాజస్థాన్‌తో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా మావారు గోవింద్‌సింగ్ భట్‌ది రాజస్థాన్ కావడంతో... చిన్నప్పటి జానపద సంగీతం వింటూ పెరిగారు. ఆయన తండ్రి, తాతగారు మోర్చాంగ్, సారంగి తదితర వాయిద్యాలు వాయించేవారు. ఎంతోమంది కళాకారులు ఇంటికి వచ్చి వెళుతుండేవారు. అలాంటి వాతావరణంలో పెరిగిన ఎవరికైనా సహజంగానే కళలపై అమితమైన ప్రేమ ఏర్పడుతుంది కదా. ఆ ప్రేమతోనే మావారు రాజస్థానీ జానపద కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రదర్శనలు ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలు చూపించేందుకు ఎంతో కష్టపడ్డారు. దాని కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘మెహ్రాన్‌గఢ్ ట్రస్ట్, జైపూర్ విరాసత్ ఫౌండేషన్’ తదితర ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేశారు. అవి సత్ఫలితాలనిచ్చాయి. ఆ సంస్థల ఆధ్వర్యంలో జానపద కళాకారులు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.
ఉపాధి మార్గం...
2008లో ప్రారంభమైన ఆయన ప్రయాణంలో తరువాత నేను కూడా భాగమయ్యాను. పధ్నాలుగేళ్లుగా నేను కూడా సామాజిక సేవలో నిమగ్నమయ్యాను. మావారు ఎంచుకున్న మార్గం నాలో స్ఫూర్తి నింపింది. కళాకారుల కోసం ఆయన శ్రమించే తత్వం నన్ను ఆకట్టుకుంది. ఆయనతో కలిసి అడుగులు వేశాను. జానపద కళాకారుల అభ్యున్నతి కోసం, అరుదైన సంగీత వారసత్వాన్ని కొనసాగించడం కోసం మేమిద్దరం కలిసి 2014లో ‘బ్లూ సిటీ వాల్స్’ సంస్థను ప్రారంభించాం. కొందరు కళాకారుల సహకారంతో షోలు నిర్వహించాం. ‘జోధ్‌పూర్ ఓల్డ్ సిటీ’ పేరుతో పర్యటనలు ఏర్పాటు చేశాం. వీటన్నిటి నిర్వహణకు స్థానికంగా ఉన్న నిరుద్యోగులను నియమించడంవల్ల కళాకారులతో పాటు వారికీ ఉపాధి లభించింది.
యువతను ప్రోత్సహించేలా...
అయితే ఈ ప్రయాణంలో మాకు అర్థమైంది ఏమిటంటే... జానపద కళా వారసత్వాన్ని కొనసాగించాలంటే మా ప్రయత్నం సరిపోదని. మరింతమందికి చేయూత అందివ్వాలని. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని భావించాం. ప్రధానంగా పాత తరం కళాకారులు కాలం చేస్తుంటే... వారి వారసులు ఆ విద్యను అభ్యసించేందుకు ముందుకు రావడంలేదు. ఇది కలవర పెట్టే అంశం. దానికి ప్రధాన కారణం సంప్రదాయ కళలను నమ్ముకొంటే వారికి సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం. రెండోది... నేర్చుకోవాలనే ఉత్సాహం ఉన్నా ప్రోత్సాహం కరువవడం... తమ కళను ప్రదర్శించేందుకు సరైన వేదికంటూ లేకపోవడం. దీనంతటికి పరిష్కార మార్గంగా మా సంస్థ నిలబడాలనే లక్ష్యంతో అడుగులు వేశాం.
అద్భుత స్పందన...
యువ కళాకారులను తీర్చిదిద్దడం, వారికి మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు రాజస్థాన్ సంస్కృతిని నలుదిశలా విస్తరించే లక్ష్యంతో మా ‘బ్లూ సిటీ వాల్స్’ ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టులు చేపట్టాం. తొలి ప్రయత్నంలో భాగంగా ఎనిమిదిమంది యువ జానపద కళాకారులతో ‘రైతిలా రాజస్థాన్’ పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. ‘మెహమాన్’ అనే పాట రూపొందించాం. సంగీతం మావారే సమకూర్చారు. కళాకారులకు ఆరు నెలలపాటు మేమే శిక్షణ ఇచ్చాం. ఆ పాట ‘నెట్‌ఫ్లిక్స్’లో బాగా ప్రాచుర్యం పొందిన ‘మిస్‌మ్యాచ్’ షో రెండో సీజన్లో ప్రదర్శించారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. అన్నిటికీ మించి మా కళాకారులకు మంచి పేరు లభించింది.
ఆ ఆలోచన మారాలి...
మా తరువాతి ప్రాజెక్టులు కూడా విజయవంతమయ్యాయి. అయితే జానపద కళలు కలకాలం జీవించి ఉండాలంటే మా ఒక్కరి ప్రయత్నం సరిపోదు. ఇప్పటికీ చాలామందికి జానపద కళాకారులంటే చిన్నచూపు. ఎవరైనా ఈవెంట్ నిర్వాహకుల వద్దకు వెళ్లి ‘ఇలా జానపదాలు ప్రదర్శిస్తాం’ అని అడిగితే... వెంటనే పారితోషికం సగం తగ్గించి మాట్లాడతారు. ప్రభుత్వ కార్యక్రమాలకూ ఇదే పరిస్థితి. అదే ఏ సినీ గాయకులకో అయితే అడిగినంత ఇచ్చి తెచ్చుకొంటారు. ఈ ఆలోచన మారాలి. అలాంటివారందరికీ నేను ఒక్కటే చెబుతాను... జానపద కళారూపాలు, కళాకారులు దేనికీ తీసిపోరని. ఇది అర్థమయ్యేట్టు చెప్పేందుకు ‘లోక్ సంగీత్ శాల’ ప్రారంభించాం. దీని ద్వారా తరువాతి తరం కళాకారులను తయారు చేస్తు న్నాం. వారసత్వ కళను ఒక వృత్తిగా చేపట్టేలా ప్రోత్సహిస్తున్నాం. అందుకు ప్రదర్శనలు ఏర్పాటు చేసి, ఉపాధి మార్గాలు చూపి, ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం’.