Share News

MBBS student: హార్ట్ సర్జరీ చేసిన ఎంబీబీఎస్ ఫెయిల్ అయిన విద్యార్థి.. పేషెంట్ పరిస్థితి ఏంటంటే..

ABN , Publish Date - Oct 01 , 2024 | 07:40 PM

ఒక్కోసారి ఎంతో అనుభవం ఉన్న వైద్యులు కూడా రోగుల ప్రాణాలను కాపాడలేరు. మరి ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం కూడా పూర్తి చేయలేని ఓ విద్యార్థి వైద్యుడిగా మారి.. గుండె సమస్యతో బాధపడుతున్న రోగికి వైద్యం అందిస్తే ఏంటి పరిస్థితి?.. అంటే విషాదమే సమాధానం అవుతుంది. కేరళలో జరిగిన ఓ ఘటన ఇదే విషయాన్ని నిరూపించింది.

MBBS student: హార్ట్ సర్జరీ చేసిన ఎంబీబీఎస్ ఫెయిల్ అయిన విద్యార్థి.. పేషెంట్ పరిస్థితి ఏంటంటే..

కోజికోడ్: ఒక్కోసారి ఎంతో అనుభవం ఉన్న వైద్యులు కూడా రోగుల ప్రాణాలను కాపాడలేరు. మరి ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం కూడా పూర్తి చేయలేని ఓ విద్యార్థి వైద్యుడిగా మారి.. గుండె సమస్యతో బాధపడుతున్న రోగికి వైద్యం అందిస్తే ఏంటి పరిస్థితి?.. అంటే విషాదమే సమాధానం అవుతుంది. కేరళలో జరిగిన ఓ ఘటన ఇదే విషయాన్ని నిరూపించింది. కేరళలో మెడికల్ నెగ్లిజెన్సి కేసు నమోదయింది. ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం కూడా పూర్తి చేయని ఓ విద్యార్థి.. గుండె రోగికి హార్ట్ సర్జరీ నిర్వహించాడు. దీంతో రోగి ప్రాణాలు పోయాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందిత విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్హత సాధించని ఆర్ఎంవోను (రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో జరిగిందని, నిందితుడు పేరు అబూ అబ్రహం ల్యూక్ అని, చనిపోయిన రోగి పేరు వినోద్ కుమార్ అని పోలీసులు వివరించారు. నిందితుడు అబూ అబ్రహం మెడికల్ విద్య పూర్తి చేయలేదని పోలీసులు వెల్లడించారు.


కాగా వినోద్ కుమార్‌కు ఛాతిలో విపరీతమైన నొప్పి, శ్వాస ఆడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఒక ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. అయితే చికిత్స తీసుకున్న కొద్దిసేపటికే అతడు చనిపోయాడు. చికిత్స కారణంగానే తన తండ్రి చనిపోయాడనే విషయం తెలిసి వినోద్ కుమార్ కొడుకు అశ్విన్ నిర్ఘాంతపోయాడు. బాధ్యుడైన ఆర్ఎంవో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం విద్యార్థి అని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోవడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


‘‘టీఎంహెచ్ హాస్పిటల్ తీవ్ర నిర్లక్ష్యం కారణంగా నేను నా తండ్రిని కోల్పోయాను. సెప్టెంబర్ 23న ఆర్ఎంవో డ్యూటీలో ఉన్న వ్యక్తి ఆర్ఎంవో కాదు. నేను కూడా ఒక రెసిడెంట్ డాక్టర్‌నే. ఆ సమయంలోనే నేను పీజీఐ చంఢీగడ్ వద్ద ఉన్నాను. ఫోన్ ద్వారా అబూ అబ్రహంతో మాట్లాడాను. ఛాతి నొప్పి, శ్వాస ఆడని పరిస్థితుల్లో మా నాన్న తీసుకొచ్చారని అతడు చెప్పాడు. మీ నాన్నని కొంచెం ఆలస్యంగా తీసుకొచ్చారు. ఆయన ప్రాణాలను కాపాడలేకపోయాం’’ అని అతడు సమాధానం ఇచ్చాడు.


నాన్న అంత్యక్రియల కోసం ఛండీగడ్ నుంచి కోజికోడ్ వెళ్లాను. ఆ తర్వాత వివరాలు తెలుసుకోగా అబూ అబ్రహం ఇంకా ఎంబీబీఎస్ పూర్తి చేయలేదని తేలింది. 2011లో అతడు ఒక ప్రైవేటు కాలేజీలో ఎంబీబీఎస్ చదివేందుకు జాయిన్ అయ్యాడని, గత 12 ఏళ్లలో అతడు ఎంబీబీఎస్ పరీక్షను పూర్తి చేయలేదని, సెకండ్ ఇయర్‌లో ఆగిన సబ్జెక్టుల్లో పాస్ కాలేదని అశ్విన్ చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని, సోషల్ మీడియా వేదికగా కూడా విషయాన్ని వెల్లడించానని అతడు పేర్కొన్నాడు. ‘‘నా తండ్రికి జరిగింది ఇంకెవరికీ జరగకూడదనేదే నా అంతిమ లక్ష్యం’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా తమ దగ్గర జాయిన్ కావడానికి ముందు కోజికోడ్, మలప్పురంలోని పలు హాస్పిటల్స్‌లో పనిచేశాడని సంబంధిత హాస్పిటల్ ప్రకటించింది.

Updated Date - Oct 01 , 2024 | 07:44 PM