Share News

BJP: బీజేపీలో చేరిన అశోక్ చవాన్.. ఆ వెంటనే రాజ్యసభ టికెట్..!!

ABN , Publish Date - Feb 13 , 2024 | 02:44 PM

మహారాష్ట్ర మాజీ ముఖ్యంత్రి, సీనియర్ నేత అశోక్ చవాన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. అశోక్ చవాన్‌ను మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీలోకి ఆహ్వానించారు.

BJP: బీజేపీలో చేరిన అశోక్ చవాన్.. ఆ వెంటనే రాజ్యసభ టికెట్..!!

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యంత్రి, సీనియర్ నేత అశోక్ చవాన్ మంగళవారం నాడు భారతీయ జనతా పార్టీలో చేరారు. అశోక్ చవాన్‌ను (Ashok Chavan) మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీలోకి ఆహ్వానించారు. అశోక్ చవాన్‌కు రాజ్యసభ టికెట్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం బీజేపీ ప్రకటన చేయనుందని తెలిసింది.

కొత్త రాజకీయ జీవితం

‘ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరాను. నేటి నుంచి నా కొత్త రాజకీయ జీవితం ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మీకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోన్ చేశారా అని మీడియా ప్రతినిధులు చవాన్‌ను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానం దాట వేశారు. బీజేపీలో చేరడం మాత్రం సంతోషంగా ఉందని’ అశోక్ చవాన్ స్పష్టం చేశారు.

సంతోషంగా ఉంది

సీనియర్ నేత అశోక్ చవాన్ తమ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని దేవంద్ర ఫడ్నవీస్ అభిప్రాయ పడ్డారు. అశోక్ చవాన్ అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికయ్యారని గుర్తుచేశారు. రెండు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని వివరించారు. అశోక్ చవాన్‌ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అమిత్ దేశ్ ముఖ్, ధీరజ్ దేశ్ ముఖ్, జితేష్, కునాల్ పాటిల్, సంగ్రామ్, మాధవ రావు, విశ్వజిత్ బీజేపీలో చేరతారని సమాచారం.

నెక్ట్స్ ఎమ్మెల్యేలు

లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారు. బాబా సిద్దిఖీ, మిలింద్ దేవరా ఇప్పటికే పార్టీ వీడారు. అజిత్ పవార్ ఎన్సీపీలో బాబా సిద్దిఖీ చేరారు. ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీలో మిలింద్ దేవరా చేరారు. ఇప్పుడు అశోక్ చవాన్ బీజేపీలో చేరారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2024 | 02:44 PM