రైళ్లలో ఆహారం సరఫరాకు క్లౌడ్ కిచెన్లు
ABN , Publish Date - Sep 12 , 2024 | 05:26 AM
రైళ్లలో అందించే ఆహార నాణ్యతపై తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు క్లౌడ్ కిచెన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేయాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ప్రస్తుతం రైళ్లలో ఆహార సరఫరా కోసం పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ల దగ్గర బేస్ కిచెన్లు
ముంబై, సెప్టెంబరు 11: రైళ్లలో అందించే ఆహార నాణ్యతపై తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు క్లౌడ్ కిచెన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేయాలని ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ప్రస్తుతం రైళ్లలో ఆహార సరఫరా కోసం పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ల దగ్గర బేస్ కిచెన్లు ఉన్నాయి. వీటిల్లో వేలాది మంది కోసం ఆహారాన్ని వండి, ప్యాకింగ్ చేసి రైళ్లలో అందజేస్తున్నారు. వీటిని ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తోంది. అయితే, బేస్ స్టేషన్లలో పరిశుభ్రత పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో, ఐఆర్‌సీటీసీ క్లౌడ్ కిచెన్లపై దృష్టి సారించింది. ఇవి ప్రైవేటు ఆపరేటర్ల నియంత్రణలో ఒప్పందం ప్రకారం నడుస్తాయి. సాధారణంగా ఈ ఒప్పందం ఏడేళ్ల పాటు ఉంటుంది. ప్రైవేటు క్యాటరింగ్ సంస్థలు ఆహారాన్ని వండి రైళ్లలో అందజేయాల్సి ఉంటుంది. క్లౌడ్ కిచెన్ల పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయి. సైజును బట్టి కొన్నింటిలో వందల మందికి, మరికొన్నింటిలో మూడు నుంచి నాలుగు వేల మందికి ఆహార పదార్థాలను వండుతారు. క్లౌడ్ కిచెన్ వంటశాలల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి అధికారులు ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పర్యవేక్షిస్తారు. పరిశుభ్రత పాటించకపోతే జరిమానా విధిస్తారు. కాంట్రాక్టును రద్దు చేసే అధికారం కూడా రైల్వే అధికారులకు ఉంటుంది. ముంబైలో ఇప్పటికే క్లౌడ్ కిచెన్ సేవలు ప్రారంభమైనట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ‘‘ముంబైలో 90 క్లౌడ్ కిచెన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే 50 కిచెన్లను అందుబాటులోకి తెచ్చాం’’ అని ఐఆర్‌సీటీసీ అధికారి ఒకరు వివరించారు. ముంబైలో క్లౌడ్ కిచెన్ సేవలు అందుబాటులోకి వచ్చాక, ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు తగ్గాయని తెలిపారు. పశ్చిమ జోన్‌లోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దాదాపు 200క్లౌడ్ కిచెన్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవి రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి.