Share News

చైనా హైపవర్‌ మైక్రోవేవ్‌ ఆయుధం

ABN , Publish Date - Feb 13 , 2024 | 04:47 AM

కదిలే ట్రక్కు నుంచి సైతం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉపయోగించగలిగే అత్యంత శక్తిమంతమైన మైక్రోవేవ్‌ (హెచ్‌పీఎం) ఆయుధాన్ని చైనా శాస్త్రజ్ఞులు తయారుచేయగలిగారు! ఈ తరహా ఆయుధాల తయారీలో ఎదురయ్యే

చైనా హైపవర్‌ మైక్రోవేవ్‌ ఆయుధం

కదిలే ట్రక్కులోంచి ఉపయోగించే వీలు

డ్రోన్లు, విమానాలు, శాటిలైట్లను సైతం నిర్వీర్యం చేయగలిగే సత్తా గల వెపన్‌!

అందుబాటులోకి వచ్చేది కొన్నాళ్లతర్వాతే

బీజింగ్‌, ఫిబ్రవరి 12: కదిలే ట్రక్కు నుంచి సైతం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉపయోగించగలిగే అత్యంత శక్తిమంతమైన మైక్రోవేవ్‌ (హెచ్‌పీఎం) ఆయుధాన్ని చైనా శాస్త్రజ్ఞులు తయారుచేయగలిగారు! ఈ తరహా ఆయుధాల తయారీలో ఎదురయ్యే ఇబ్బంది.. అత్యధిక ఉష్ణోగ్రతలు. ‘స్టిర్లింగ్‌ ఇంజన్‌’ల సాయంతో ఆ అడ్డంకిని కూడా వారు అధిగమించారు. మైక్రోవేవ్‌ వెపన్స్‌ను వినియోగించడానికి సాధారణంగా అయ్యే శక్తిలో ఐదు వంతు శక్తి చాలు దీన్ని వాడడానికి. అంతేకాదు.. నిరంతరాయంగా నాలుగు గంటలపాటు దాన్ని వినియోగించవచ్చని దాని రూపకర్తలు చెబుతున్నారు. అలాగే.. ప్రపంచంలోనే స్టిర్లింగ్‌ ఇంజన్‌ టెక్నాలజీతో పనిచేసే తొలి హెచ్‌పీఎం ఆయుధం ఇది. ఇంతకీ ఏమిటీ మైక్రోవేవ్‌ ఆయుధం? అంటే.. గత ఏడాది అక్టోబరులో హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌ సరిహద్దులోని వాచ్‌టవర్లపైన, సెక్యూరిటీ కెమెరాలపైన పెద్ద సంఖ్యలో డ్రోన్‌లతో దాడులు చేశారు గుర్తుందా? వాచ్‌టవర్లు కూలిపోయి, సెక్యూరిటీ కెమెరాలు ధ్వంసం కావడంతో అసలేం జరుగుతోందో తెలుసుకోవడానికే ఇజ్రాయెల్‌ సేనలకు చాలా సమయం పట్టింది. ఈలోగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటొచ్చి నరమేధం సాగించారు. ఇలాంటి డ్రోన్ల గుంపులను సమర్థంగా ఎదుర్కొని నాశనం చేసే సత్తా కలిగిన ఆయుధాలు.. హైపవర్‌ మైక్రోవేవ్‌ వెపన్స్‌. ఇలాంటి డ్రోన్లు పెద్ద సంఖ్యలో దూసుకొచ్చినప్పుడు.. శక్తిమంతమైన విద్యుదయస్కాంత తరంగాలను వాటిపైకి ప్రసరింపజేయడం ద్వారా వాటిలోని ఎలకా్ట్రనిక్‌ వ్యవస్థలు పనికిరాకుండా చేస్తాయి. దీంతో ఆ డ్రోన్లు వాటంతట అవే కింద పడి పాడైపోతాయి. ఇలాంటి ఆయుధాలను అమెరికా, చైనా, రష్యా సహా పలు దేశాలు ఈ ఆయుధాలను చాలాకాలంగా అభివృద్ధి చేస్తున్నాయి. అయితే చైనా ప్రస్తుతం తయారుచేసినట్టు చెబుతున్నది డ్రోన్లనే కాక.. శత్రువుల యుద్ధవిమానాలను, ఉపగ్రహాలను సైతం నిర్వీర్యం చేయగలదని చెబుతున్నారు. అయితే.. యుద్ధరంగంలో దాన్ని ఉపయోగించడానికి ఇంకా కొంత సమయం పడుతుందని రూపకర్తలు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ వెపన్‌ ప్రాథమిక స్థాయిలోనే ఉందని, దాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

ట్రక్కులో పట్టేస్తుంది..

సాధారణంగా హైపవర్‌ మైక్రోవేవ్‌ ఆయుధాలు పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయి. వాటిని పనిచేయించడానికి చాలా ఎక్కువ శక్తి కావాలి. అందుకు భారీగా ఖర్చవుతుంది. కానీ, తాము అభివృద్ధి చేసిన వెపన్‌కు అంత శక్తి అవసరం లేదని.. పైగా దాన్ని సులభంగా ఒక ట్రక్కులో పెట్టి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లి ఉపయోగించవచ్చని, ప్రయాణంలో కూడా ఉపయోగించవచ్చని చైనా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీని తయారీకి వారు వాడిన అత్యంత అధునాతనమైన సూపర్‌ కండక్టింగ్‌ టేప్‌ (రెబ్కో టేప్‌) కూడా చైనాలో తయారైనదే. చైనా ఆ రెబ్కో టేప్‌ తయారు చేయడానికి కారణమెవరో తెలుసా? అమెరికా. కరోనాను ప్రపంచం మీదకు వదిలిందన్న కోపంతో 2017లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాపై ఆంక్షలు విధించారు గుర్తుందా? అప్పుడు తనకు కలిగిన ఇబ్బందిని సవాల్‌గా తీసుకుని చైనా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

Updated Date - Feb 13 , 2024 | 04:47 AM