Share News

BJP MLAs: సభా సంప్రదాయాలను పాటించరా? స్పీకర్‌పై బీజేపీ ఎమ్మెల్యేల ఆగ్రహం

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:41 AM

బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజైన సోమవారం గవర్నర్‌ రవిని ఉద్దేశించి స్పీకర్‌ అప్పావు(Speaker Appau) చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ఖండించారు.

BJP MLAs: సభా సంప్రదాయాలను పాటించరా? స్పీకర్‌పై బీజేపీ ఎమ్మెల్యేల ఆగ్రహం

చెన్నై: బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజైన సోమవారం గవర్నర్‌ రవిని ఉద్దేశించి స్పీకర్‌ అప్పావు(Speaker Appau) చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ఖండించారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠాన్ని చదివేందుకు గవర్నర్‌ నిరాకరించగా, ఆ ప్రసంగ పాఠాన్ని స్పీకర్‌ అప్పావు చదవి సభ్యులకు వినిపించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ను ఉద్దేశించి స్పీకర్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటిని బీజేపీ ఎమ్మెల్యేలు నయినార్‌ నాగేంద్రన్‌, వానతి శ్రీనివాసన్‌, సరస్వతి ఖండించారు. అసెంబ్లీ వెలుపల వారు విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర శాసనసభలో గవర్నర్‌ సభా సంప్రదాయాల మేరకే నడుచుకున్నారని తెలిపారు. సభ ప్రారంభమైన తర్వాత జాతీయ గీతాలాపన చేయాలని గవర్నర్‌ ముందుగానే ఒక లేఖ ద్వారా కోరగా, దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అయినప్పటికీ గవర్నర్‌ సభలోనే కూర్చొని స్పీకర్‌ చదువుతున్న గవర్నర్‌ ప్రసంగాన్ని ఆలకించారన్నారు. తద్వారా గవర్నర్‌ ఏ కోణంలోనే సభా మర్యాదలను ఉల్లంఘించలేదన్నారు. ప్రభుత్వ ప్రసంగం పాఠం పూర్తిగా చదివిన తర్వాత స్పీకర్‌.. గవర్నర్‌ను ఉద్దేశించి గాడ్సే, సావర్కర్‌ మార్గంలో వచ్చిన వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారని, రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నడూ వినలేదన్నారు. స్పీకర్‌ సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

nani3.jpg

Updated Date - Feb 13 , 2024 | 11:41 AM