Share News

India-China: భారత్, చైనా మధ్య కీలక అంగీకారం.. నాలుగేళ్ల ప్రతిష్ఠంభనకు తెర

ABN , Publish Date - Oct 21 , 2024 | 05:11 PM

గత నాలుగేళ్ల ప్రతిష్ఠంభనకు ముగింపు పడింది. తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి పెట్రోలింగ్‌పై భారత్, చైనాల అంగీకారం కుదిరింది. ఈ మేరకు సోమవారం కీలకమైన ఒప్పందం కుదిరింది. ఎల్ఏసీ వెంబడి పెట్రోలింగ్‌పై ఇరు దేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.

India-China: భారత్, చైనా మధ్య కీలక అంగీకారం.. నాలుగేళ్ల ప్రతిష్ఠంభనకు తెర

గత నాలుగేళ్ల ప్రతిష్ఠంభనకు ముగింపు పడింది. తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి పెట్రోలింగ్‌పై భారత్, చైనాల అంగీకారం కుదిరింది. ఈ మేరకు సోమవారం కీలకమైన ఒప్పందం కుదిరింది. ఎల్ఏసీ వెంబడి పెట్రోలింగ్‌పై ఇరు దేశాలు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. కీలకమైన ఈ పురోగతితో ఎల్ఏసీ వెంబడి తన బలగాలను చైనా సంపూర్ణంగా ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.


ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ‘‘గత కొన్ని వారాలుగా భారత్, చైనా దేశాలకు చెందిన దౌత్య, సైనిక సంధానకర్తలు పరస్పర చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా సరిహద్దులో ఎల్ఏసీ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒక ఒప్పందం కుదిరింది. 2020లో సమస్యలు తలెత్తిన ప్రాంతాల్లో పరిష్కారానికి ఈ అంగీకారం దారి తీస్తుంది’’ అని విలేకరులతో ఆయన వివరించారు.


కాగా లఢఖ్‌లోని దేప్‌సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదిరిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సు కోసం రష్యాలోని కజాన్ నగరానికి పర్యటనకు వెళ్లడానికి ఒకరోజు ముందు ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. కాగా ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా హాజరుకానున్నారు.


కాగా 2020లో గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరుదేశాలకు భారీ ప్రాణనష్టం జరిగింది. ఆ నాటి నుంచి తూర్పు లడఖ్‌ సరిహద్దులో భారత్, చైనాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం భారత్-చైనా మధ్య గత నాలుగేళ్లుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలావుంచితే ఎల్ఏసీతో పాటు వివిధ సమస్యల పరిష్కారానికి భారత్, చైనాలు గణనీయమైన పురోగతి సాధించాయని గత నెలలో కథనాలు వెలువడ్డాయి. కొన్ని పెట్రోలింగ్ పాయింట్ల వరకు భారత దళాలకు చైనా అనుమతి ఇస్తుందని కథనాలు పేర్కొన్నాయి. కాగా ఎల్ఏసీ వెంబడి నిర్దిష్ట పెట్రోలింగ్ పాయింట్లను సందర్శించడానికి భారతీయ దళాలకు చైనా అనుమతి ఇవ్వడం లేదు.

Updated Date - Oct 21 , 2024 | 08:31 PM