Share News

‘తిరుమల లడ్డు’..ప్రజలది కాదా!?

ABN , Publish Date - Oct 02 , 2024 | 02:07 AM

ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్ర సమస్యపై ప్రజలతో మాట్లాడకూడదా? సదరు సమస్య లాజికల్‌గా పోలీసు, చట్టాలు, న్యాయస్థానాల ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని నిందితులకు శిక్షలు వగైరా పడేంతవరకు సీఎం నోరు విప్పకూడదా?...

‘తిరుమల లడ్డు’..ప్రజలది కాదా!?

ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్ర సమస్యపై ప్రజలతో మాట్లాడకూడదా? సదరు సమస్య లాజికల్‌గా పోలీసు, చట్టాలు, న్యాయస్థానాల ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని నిందితులకు శిక్షలు వగైరా పడేంతవరకు సీఎం నోరు విప్పకూడదా? ప్రజలచేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి తన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజల మనసులను గాయపరిచి, కోట్ల మంది కొలిచే దేవుడి విషయంలో జరిగిందని చెప్పబడుతున్న సమస్యని ప్రస్తావించే అధికారం ప్రజాస్వామ్యంలో ఉండదా? ఇది దేశ రాజ్యాంగంలో మనం ఏర్పరుచుకొన్న ఆదేశిక సూత్రాలనే కాకుండా, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేత అధికారాలను కూడా ప్రశ్నించే సందర్భం.


ఈ నేపథ్యంలో భక్తులకే కాదు, చట్టపరంగా కూడా అసలు ఈ నెయ్యిలో కల్తీ జరిగివుండవచ్చు అనే అనుమానం వచ్చిన సందర్భాన్ని, నెయ్యిలో కల్తీని కనిపెట్టిన విధానాన్ని, 2023 కంటే, 2024లో 40 శాతం తక్కువ ధరకు ఇచ్చిన వైనాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. 2024 మార్చిలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నెయ్యి సరఫరా కోసం టెండర్‌ని పిలిచింది. ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్, క్రిపారాం డైరీ, శ్రీ పరాగ్ మిల్క్, శ్రీ వైష్ణవి, ఎఆర్‌ డైరీ ఫుడ్స్ పాల్గొన్నాయి. దాదాపు అన్నీ మొదటిసారి నెయ్యి టెండర్లలో పాల్గొన్న ప్రైవేటు సంస్థలే. ఇవన్నీ నెయ్యి కేజీకి రూ.320 నుండి రూ.411 వరకూ టెండర్లు దాఖలు చేసాయి. బయట మార్కెట్లో అప్పుడున్న నెయ్యి ధర, వీళ్లు దాఖలు చేసిన ధరకు దరిదాపులో కూడా లేదు. అయినా ఏ మాత్రం ప్రశ్నించకుండా 2024 మార్చిలోనే అప్పటి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఈవోగా ఉన్న బోర్డు, తమిళనాడు, దిండిగల్ కేంద్రంగా ఉన్న ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్‌ని టెండర్‌లో ఎల్1 బిడ్డర్‌గా ఖరారు చేసింది. 2024 మే నెలలో, ఏఆర్ డైరీ పదిలక్షల కేజీల నెయ్యి ఆర్డర్ పొంది, జూన్‌లో సరఫరా మొదలెట్టింది.


ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి 2024 జూన్ 12, 20, 25, జూలై 4న నెయ్యి టాంకర్లు వచ్చాయి. వాటికి టీటీడీ తన దగ్గరున్న స్టాండర్డ్ ప్రమాణాల టెస్టింగ్ ప్రకారం పరీక్షలు చేసి లడ్డు తయారీలో ఆ నెయ్యిని వాడింది. స్టాండర్డ్ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అంతకంటే మించి వెజిటబుల్, జంతు సంబంధిత పదార్థాలు ఉన్నాయా అని పరీక్ష చేసే సౌకర్యాలు టీటీడీ దగ్గర లేవు. ఇప్పటి దాకా అలాంటి సౌకర్యం ఏర్పర్చుకోకపోవటం నిస్సందేహంగా వరుస ప్రభుత్వాల తప్పే. నాలుగు టాంకర్ల సరఫరా తర్వాత అప్పటికే లడ్డూల నాణ్యత, సువాసన, రుచి మీద ఆరోపణలు మరీ ఎక్కువ కావటంతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన టీటీడీ ఈవో, లడ్డు నాణ్యత మీద దృష్టి పెట్టారు.

2024 జూలై 6న, TN02BA 9459, AP26TC 4779 నెంబర్ గల ట్యాంకర్లలో; 12న TN02BB 2151, TN02BB 2070 నెంబర్ గల లారీలలో మొత్తంగా నాలుగు ట్యాంకర్లు వచ్చాయి. అప్పటికే నెయ్యి నాణ్యత మీద అనుమానాలు ఏర్పడిన నేపధ్యంలో, ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి శాంపిల్స్ తీసి ఎన్డీడీబీ–కాఫ్ ల్యాబ్‌కి పంపించారు. జూలై 18న ఎన్డీడీబీ నుంచి రిపోర్ట్ వచ్చింది. అప్పుడు రిపోర్ట్ వస్తే నెల పాటు ఎందుకు మాట్లాడలేదు అని ఇంకో ప్రశ్న వస్తోంది. తప్పు జరిగింది అనే పార్టీకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం, వారి జవాబు తీసుకోవడం అడ్మినిస్ట్రేషన్‌లో మొదటి భాగం. జూలై 22, 25, 27 తేదీలలో టీటీడీ... ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్‌కి మూడు షోకాజ్ నోటీసులు పంపింది. 2024 సెప్టెంబర్ 4న ఏఆర్ డైరీ ఫుడ్స్ వారు టీటీడీ అభియోగాలను తిరస్కరిస్తూ, నెయ్యిలో మేము ఎటువంటి కల్తీ చేయలేదు అని జవాబిచ్చారు.


ఈ విషయాలన్నీ టీటీడీ ఈవో ముఖ్యమంత్రికి వరుసగా వివరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి టీటీడీని సమస్యని ఇంకా లోతుగా పరిశీలించమని చెప్తూ వచ్చారు. అసలు ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎవరు, కేజీ రూ.320 లాంటి తక్కువ ధరకు టీటీడీకి ఎలా ఇచ్చారు; 2023, 2022 సంవత్సరాల్లో నెయ్యికి ప్రైవేట్ ట్రేడర్లకు ఇచ్చిన ధర ఎంత; బెంగళూరుకు చెందిన కోఆపరేటివ్, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌ని ఎందుకు ఆపేశారు; తదితర విషయాల లోతుల్లోకి వెళ్ళమని ఆదేశాలు ఇచ్చారు.

గత అయిదేళ్ళ విషయాల తవ్వకాల్లో చాలా వివరాలు బయటపడ్డాయి. కమీషన్ల కోసం, ఊరూ పేరు లేని సంస్థలని పట్టుకొని ఎక్కడెక్కడ నుంచో, 2019–24 మధ్యన టీటీడీ నెయ్యి సేకరించింది. 2023 ఫిబ్రవరిలో అప్పటి వరకు వున్న సరఫరాదార్లని కాదని ‘మల్టీ వెండర్ కాంట్రాక్ట్ సిస్టమ్’ ద్వారా నెయ్యి సేకరించాలని టీటీడీ నిర్ణయించింది. పదిహేను సంవత్సరాలుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నెయ్యి కొనుగోలు చేసే టీటీడీ, 2023 ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన ‘మల్ గంగ మిల్క్ అండ్ ఆగ్రో ప్రోడక్ట్స్’ నుంచి రూ.496.90కి పది లక్షల కేజీల ఆర్డర్ ఇచ్చిన విషయమూ బయటికొచ్చింది. 2023 మార్చిలోనే కేజీ రూ.496.90కి ఇచ్చిన టీటీడీ, 2024 మార్చ్‌లో ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్‌కి కేజీ రూ.320కి, అప్పటి ఈవో, టీటీడీ చైర్మెన్ ఎలా ఇవ్వగలిగారు అని ఆలోచిస్తే– సమాధానం నాణ్యతలో రాజీ పడడం, అందుకు కమీషన్లు కారణం అని స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర సంస్థలు నెయ్యి సరఫరా చేయడానికి ల్యాబ్ రిపోర్ట్ కావాలి కాబట్టి, థర్డ్ పార్టీ ప్రైవేటు ల్యాబ్‌ల నుంచి వారికి కావాల్సిన రిపోర్టులు తెచ్చి ఇచ్చారు. ఆ రిపోర్టులనే టీటీడీ మహాప్రసాదంగా స్వీకరించింది. అందుకే లడ్డూల్లోని నాణ్యత, రుచి మాయమయింది.


ఏ ట్యాంకర్ నుంచి అయితే నమూనాలు సేకరించి ఎన్డీడీబీ–కాఫ్ ల్యాబ్‌కి పంపించారో ఆ ట్యాంకర్లలోని నెయ్యిని ఆ తరువాత లడ్డు తయారీలో వాడలేదు. కానీ రెండవసారి వచ్చిన నాలుగు ట్యాంకర్లలో కల్తీ బయటపడింది కాబట్టి, అంతకు ముందు నెల, అదే సంస్థ నుంచి, అదే బ్యాచ్‌లో వచ్చిన నాలుగు ట్యాంకర్లు కూడా కల్తీ అయి ఉండవచ్చని టీటీడీ భావించింది. అదే విషయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఇంత పరిశీలన ఒకటి రెండు రోజుల్లో అయిపోదు కదా? అందుకే జూలై 24న ల్యాబ్‌ నుంచి రిపోర్ట్ వచ్చినా ముఖ్యమంత్రి లోతుగా పరిశీలన చేయించి, నెయ్యి కల్తీలో ప్రైమాఫేసీ ఎవిడెన్స్ ఉంది అని సంతృప్తి చెందిన తర్వాతే ప్రజలకు చెప్పారు. ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ వచ్చింది. ధర విషయంలో క్రితం సంవత్సరం కంటే నలభై శాతం శాతం తక్కువకి ఇచ్చిన వైనం తెలిసింది. ఏఆర్ డైరీకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. లడ్డు రుచి, వాసన బాగా లేదని ప్రజలు గోల పెడుతున్నారు. కళ్ళ ముందు నెయ్యిలో గందరగోళం జరిగిన విషయం తెలుస్తోంది. నెలపాటు టీటీడీ పరిశీలించింది. ఇంత ప్రక్రియ తర్వాత తనను ఎన్నుకున్న ప్రజలకి, అందులో భాగం అయిన భక్తులకి చెప్పకుండా ముఖ్యమంత్రి ఎవరికి చెప్పాలి? నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని రిపోర్ట్ వస్తే ఎలా దాచి పెడుతారు? దాని మీద మామూలు పోలీస్ విచారణ కాకుండా ఐజీ స్థాయి అధికారి నాయకత్వంలో సిట్ వేసారు. కారణం చెప్పకుండా సిట్ వేయలేరు కదా! ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు చివరికి ప్రజలకే జవాబుదారీ. అందుకే వాళ్ళకే చెప్పారు. దీంట్లో చంద్రబాబు చేసిన తప్పేముంది?


లడ్డూల తయారీలో ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందే కాకుండా, వెంకటేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి సిద్ధమైన వైకాపా నాయకులని చూస్తుంటే, వీళ్ళకు దేవుడంటే కూడా కించిత్తు భయం లేదని అర్ధమౌతోంది. అందుకే దేవస్థానంలో ఏ జంకూ లేకుండా అవి‘నేతి’ అయిదేళ్లూ తాండవమాడింది. ఇప్పుడు దేవస్థానంలో సంప్రోక్షణ, పవిత్రోత్సవాల దగ్గర నుంచి అన్నీ జరిగాయి. నెయ్యిలో ఏ రకమైన చెడు పదార్థాలు లేకుండా చూస్తున్నారు. భక్తులూ సంతోషంగా ఉన్నారు.

నీలాయపాలెం విజయ్‌కుమార్

అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ

Updated Date - Oct 02 , 2024 | 02:07 AM