Share News

గోడల్ని పెంచుతున్న ‘కుల’ గురుకులాలు!

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:56 AM

1973లో నేను ఒకటో తరగతిలో ఉన్నప్పుడు మా ఊరిలో ఒక ఆధిపత్య కుల కుటుంబంలో జరిగిన బాల్యవివాహా విందు భోజనానికి మా తాతగారిని ఆహ్వానిస్తే నన్ను కూడా వెంట తీసుకెళ్లాడు...

గోడల్ని పెంచుతున్న ‘కుల’ గురుకులాలు!

1973లో నేను ఒకటో తరగతిలో ఉన్నప్పుడు మా ఊరిలో ఒక ఆధిపత్య కుల కుటుంబంలో జరిగిన బాల్యవివాహా విందు భోజనానికి మా తాతగారిని ఆహ్వానిస్తే నన్ను కూడా వెంట తీసుకెళ్లాడు మమ్మల్ని వారి ఇంటి బయట రోడ్డుపై కూర్చోబెట్టి మాకు తగలకుండా భోజనం వడ్డించారు. నా ప్రశ్నలకు జవాబిస్తూ మా తాతగారు తక్కువ కులం వారిని ఇంట్లోకి రానివ్వరు అన్నాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. నేను పదవ తరగతికి వచ్చేలోపు నా సహ విద్యార్థుల ఇండ్లలో కులంతో సంబంధం లేకుండా విందులకు వెళ్లేవారం. నేను డిగ్రీ చదివే సమయానికి కులాంతర వివాహాలు జరిగాయి. ఆ పదిహేను సంవత్సరాలలో మార్పు గురించి నేడు ఆలోచిస్తే ఆ ఆలోచనలన్నీ నేను చదివిన ‘జిల్లా పరిషత్ హైస్కూల్’ అనే మూలం దగ్గర ఆగినవి. గ్రామీణ పాఠశాలలు గొప్ప సామాజిక విప్లవ కేంద్రాలని అర్థం చేసుకున్నాను.

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్య సంక్షేమ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మండల స్థాయిలో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుకు పూనుకోవడం ఒక మంచి అడుగు. ఈ సందర్భంలో ప్రస్తుత గురుకులాల అంతిమ లక్ష్యాల సాధనపై కూడా ఒక సమీక్ష జరగాలి.

ఇదే నేపథ్యంలో నేటి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మంథని మధుకర్, మిర్యాలగూడ ప్రణయ్, సరూర్ నగర్ నాగరాజు పరువు హత్యలను కూడా ప్రస్తావించాల్సిందే. కులాల పుట్టుక, వాటి మధ్యఉన్న అంతరాలపై అవగాహనా కల్పించే విద్యా బోధన లోపించటమే ఈ ఘటనల వెనుక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సరళీకృత ఆర్థిక విధానాలతో పుంజుకున్న ప్రైవేటు రంగ విస్తరణ విద్యారంగాన్ని సైతం లాభాల సరుకుగా మార్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత క్రమంగా కుచించుకుపోయింది.

హైదరాబాద్ దక్కన్ నిజాం రాజ్యం భారతదేశంలో విలీనం అయిన తర్వాత ఆధునిక విద్యాలోపం వల్ల పరిపాలనలో అనేక సమస్యలు వచ్చాయి. పరిపాలన నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను తీర్చడానికి అందుబాటులో ఉన్న విద్యాసౌకర్యాలతో గ్రామీణ ప్రాంతంలోని మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలికితీయడానికి పీవీ నరసింహారావు విద్యాశాఖ మంత్రిగా ఉన్నపుడు ఒక ఆలోచన చేశారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాకా 1971 నవంబర్ 23న దేశంలోనే తొలిసారి నల్గొండ జిల్లా సర్వేల్ నందు గురుకుల విద్యాబోధన ఏర్పాటు చేశారు. ప్రాచీన విద్యా బోధన సంస్కృతిని ప్రతిబింబించేలా ఉపాధ్యాయులూ విద్యార్థులూ ఒకే చోట ఉంటూ, ఉచిత భోజన వసతితో కూడిన ఆ గురుకుల విద్యాలయాలే నేడు మనం చూస్తున్న గురుకులాలు. అవి రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంక్‌కు పోటీపడి ఎన్నో ఉత్తమ ఫలితాలు సాధించాయి. ప్రస్తుత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఇక్కడి నుండి వచ్చినవారే. కాలక్రమంలో మారిన ప్రభుత్వాలు కులాలకు మతాలకు వేర్వేరు గురుకులాలను ఏర్పాటు చేశాయి. అయితే కులాల మతాల గురుకులాలను ఏ లక్ష్యాల కోసం ఏర్పాటు చేసారో, ఆ లక్ష్యాలకు భిన్నమైన ప్రతికూల ఫలితాలు రావటం ఎవరూ గుర్తించడం లేదు. విద్యావేత్తలు ఎవ్వరూ ఈ అంశంపై మాట్లాడటానికి సాహసించడం లేదు. కారణం ఇది ఒక ఓటు బ్యాంకు ‘కుల’ రాజకీయ సరుకుగా మారడమే.

మరొకవైపు సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మాధ్యమాలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో నిజాలకంటే అబద్ధాలే ఎక్కువగా, వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కులచైతన్యం పేరుతో కులసంఘాల ‘ఉపాధి ఉద్యమాలు’ విరివిగా పెరిగాయి. పైకి కనిపించని రీతిలో కులవైషమ్యాలు స్థిరపడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో సోదర భావం పెరగాల్సిన చోట కూడా కులాల పేరుతో వాట్సాప్ గ్రూపులు ఏర్పడి కులాల మధ్య అగాధం మరింత పెరుగుతున్నది. గ్రామాలలో అన్ని వాడలు తిరగగలం అనుకునే వారికీ అగుపించని అదృశ్యపు కులగోడలు అడ్డుతగులుతున్నాయి. ఈ దూరాల్ని కులాల వారీ గురుకులాలు ఏ మాత్రం పూరించలేకపోవడమే కాకుండా వాటిని మరింత స్థిరపడేలా చేస్తున్నాయి.

ఆధునిక విద్యావిధానం అంతిమలక్ష్యం విద్యార్థి సమగ్ర మానసిక, సామజిక వికాసాభివృద్ధిని పెంపొందించడంగా ఉండాలి. కాని తెలంగాణ గురుకులాల్లో విద్యార్థిని తన కులానికే పరిమితం చేస్తున్నారు. ఒక విద్యార్థి 11ఏళ్ళ వయసులో ఐదవ తరగతిలో గురుకుల పాఠశాలలో చేరితే 22ఏళ్ళ వరకు, అనగా డిగ్రీ వరకు, గురుకులాల్లో చదివే అవకాశాలు ఉన్నాయి. సౌకర్యాల గురించి పక్కన పెడితే, ప్రస్తుత ‘కుల’ గురుకుల వ్యవస్థ ఎంతవరకు విద్యార్థి సమగ్ర వికాసాభివృద్ధికి దోహదపడుతుందన్నదే పెద్ద ప్రశ్న. విద్యార్థి జీవితంలో ఎంతో కీలక దశగా విద్యావేత్తలు గుర్తించిన కౌమార దశ అనగా టీనేజ్‌లో విద్యార్థి భవిష్యత్తు నిర్ధారణ అవుతుంది. ఆ కాలంలో ఒక విద్యార్థి తన ‘కులం’ విద్యార్థులతోనే ఎక్కువ కాలం గడిపితే సామాజిక వైవిధ్యాలను ఎలా అర్థం చేసుకుంటాడు? సామజిక సవాళ్ళను ఎలా ఎదుర్కోగలడు? సమాజంలో ఇతర విద్యార్థులతో పోటీ పడే అవకాశం, ఇతరుల సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం కోల్పోతాడు కదా? తన ‘కులం’ వారే తనకు పోటీ అనే గిరిలో చిక్కుకుపోయి, రిజర్వేషన్ పరిధి దాటలేని పరిస్థితి కల్పించబడి, విద్యార్థి సమగ్ర ఎదుగుదల కుంటుపడుతుంది. దేన్ని ఆశించి ఈ ‘కుల’ గురుకులాల వ్యవస్థను పటిష్టం చేశారో ఇప్పుడు చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ‘కుల’ గురుకులాల్లో చదివే విద్యార్థులు ‘బిస్కెట్’ బ్యాచ్‌గా తయారై తమ కులానికి కేటాయించిన ‘పరిమిత’ రిజర్వేషన్‍లోనే పోటీపడే వ్యవస్థను నిర్మించడం ఏ విధంగా సమంజసం?

ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ‘ఎడ్యుకేషన్ హబ్’లలో కుల గురుకులాలు వేటికవే వేర్వేరుగా ఉండాలా, లేక ఒకే గురుకులంగా ఉండాలా అనే స్పష్టత కోసం విద్య, సామాజిక రంగాలపై పరిశోధనలు చేస్తున్న మేధావులను చర్చలో విస్తృతంగా భాగస్వాములు చేయాలి.

నేటి గురుకులాల్లో ఒక్కోదానిలో ఒక్కో రకమైన సదుపాయాలు ఉన్నవి. ఎడ్యుకేషన్ హబ్‌లో కుల గురుకులాలు వేరువేరుగా ఉన్నట్లయితే ఒక కుల గురుకులంలో కల్పిస్తున్న సౌకర్యాలు, మరో కుల గురుకులంలో లేకపోవడం వల్ల విద్యార్థుల మధ్య అసూయా ద్వేషాలు పెంపొందడానికి కారణమౌతాయి. ఇప్పటికే మైనారిటీ గురుకులాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు ఇతర గురుకులాల్లో కల్పించడం లేదనే విమర్శ ఉంది. అంతేగాకుండా వేర్వేరు శాఖల, అధికారుల పర్యవేక్షణవల్ల ఒక్కోఅధికారి తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నిస్తూ చేసిన ప్రయోగాలు ఆయా అధికారులు బదిలీ కాగానే కుంటుపడి మరో కొత్త విధానానికి తెరలేపడం వల్ల గురుకుల స్ఫూర్తికి స్థానం లేకుండా పోతున్నది. ఫలితాలివ్వని ప్రయోగశాలలుగా వెక్కిరిస్తున్నాయి. గతంలో పనిచేసిన ఒక అధికారి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏకంగా ఒక ప్రవేటు సైన్యాన్నే తయారు చేసుకొని దాని ఆధారంగా రాజకీయాల్లోకి వెళ్ళి విఫలమయ్యాడు. ఈ కుల గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు నీట్, ఐఐటీ లాంటి ప్రవేశ పరీక్షల్లో తమ కులరిజర్వేషన్ పరిధి దాటి ఓపెన్ కేటగిరిలో రాణించకపోవడమే వీటి వైఫల్యానికి సజీవసాక్ష్యం.

దేశం గర్వించదగ్గ రాజనీతిజ్ఞుడు, బహుభాషాకోవిదుడు, సాహితీవేత్త, దక్షిణాదికి చెందిన మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు కలలుగన్న గురుకుల విద్యను సాకారం చేయాలంటే ముందుగా నేటి కుల గురుకులాలను సమూలంగా ప్రక్షాళన చేయాలి. అణగారిన వర్గాల రిజర్వ్‌డ్‌ కోటాకు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా కుల మత రహిత గురుకులాల హబ్ ఏర్పాటే వీటి సఫలతకు మేలైన మార్గం.

మామిడి నారాయణ

సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్

Updated Date - Feb 13 , 2024 | 12:56 AM