Share News

రాష్ట్ర విద్యావ్యవస్థకు జీవం ఎన్ఈపీ!

ABN , Publish Date - Oct 02 , 2024 | 02:21 AM

ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెండు కార్యక్రమాలు అచేతన స్థితిలో ఉన్న తెలంగాణ విద్యావ్యవస్థకు అవసరమైన జీవం పోసేందుకు దోహదపడతాయి. సకల జనులతో పాటు ప్రధానంగా యూనివర్సిటీల వేదికగా...

రాష్ట్ర విద్యావ్యవస్థకు జీవం ఎన్ఈపీ!

ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెండు కార్యక్రమాలు అచేతన స్థితిలో ఉన్న తెలంగాణ విద్యావ్యవస్థకు అవసరమైన జీవం పోసేందుకు దోహదపడతాయి. సకల జనులతో పాటు ప్రధానంగా యూనివర్సిటీల వేదికగా విద్యార్థులు జరిపిన ఉద్యమాల కారణంగా అధికారంలోకి వచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దురదృష్టవశాత్తూ విద్యావ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా చేసిందేమీ లేదు. పైగా వారి చర్యలు విద్యారంగాన్ని మరింత అధోగతిపాలు చేశాయి. ఈ తరుణంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కన్సార్టియం) సూచించిన కోర్సులను ప్రవేశపెట్టడం ఒక ముందడుగుగా కనిపిస్తోంది.


భవిష్యత్‌లో ఉద్యోగాలకు సన్నద్ధంగా ఉండే విధంగా యువతను తీర్చిదిద్దడమే స్కిల్ యూనివర్సిటీ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తూ వస్తోంది. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 164 ఐటీఐలను సమన్వయం చేస్తూ, వాటిని అప్‌గ్రేడ్ చేసి నైపుణ్య కోర్సులు అందించే బాధ్యతను సైతం స్కిల్ యూనివర్సిటీ తీసుకుంటుంది. ఇది గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన విద్యార్థులకు సాధికారత కల్పిస్తుంది. దీనికితోడు బీఎఫ్ఎస్ఐ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన కోర్సును ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టారు. అన్ని విభాగాలు, సబ్జెక్టులకు చెందిన యూజీ విద్యార్థులందరికీ ఈ కోర్సును అందించనున్నారు. మూడు లేదా నాలుగు సంవత్సరాల తర్వాత కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ సబ్జెక్టుతో పాటు అదనపు నైపుణ్యాన్ని సొంతం చేసుకుంటారు. అందువల్ల ఈ కోర్సు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది.

ఈ కోర్సు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యర్థులపై సున్నితమైన విమర్శలు చేస్తూనే రాష్ట్రంలో విద్యావ్యవస్థను అభివృద్ధి చేసి, విద్యార్థులకు మేలు చేయాలన్న తలంపును వ్యక్తపర్చారు. విజ్ఞాన తృష్ణతో పాటు ఉద్యోగాలకు అవసరమయ్యే నైపుణ్యాలను పొందడానికి విద్యార్థులకు అవకాశం ఉండాలనేది ఈ రెండు కార్యక్రమాల ఉద్దేశ్యమని స్పష్టమవుతోంది.


నిజంగా విద్యార్థులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశ్యమైతే రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం–2020ను (ఎన్ఈపీ–2020) ఆచరణలో పెడితే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ విధానం విద్యార్థులు ఉద్యోగాలు, ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించడంతో పాటు... ఎంచుకున్న సబ్జెక్టులో విషయ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తుంది.

కేవలం 10,000 మంది విద్యార్థులకు మాత్రమే బీఎఫ్ఎస్ఐ కోర్సు పరిమితం, కానీ ఎన్ఈపీ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఎన్ఈపీలోని నాలుగు కీలక అంశాలు తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయి: 1) యూజీ, పీజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు బహుళ ఆప్షన్లు 2) మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆప్షన్లు 3) పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు విద్యను ఒకేషనల్ చేయడం 4) ఒకేసారి రెండు డిగ్రీలు చదివే అవకాశం.


ఎన్ఈపీ–2020 డిగ్రీ, పీజీ విద్యార్థులు తమకిష్టమైన సబ్జెక్టులను తీసుకునే అవకాశం ఇస్తుంది. ఆర్ట్స్, సైన్సు, వొకేషనల్ విద్య మధ్య హద్దులను చెరిపేస్తుంది. దీంతో విద్యార్థులు తమ అభిరుచులు, కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా వేరువేరు సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు సైన్స్, చరిత్ర రెండింటిపై ఆసక్తి ఉన్న విద్యార్థి ఇప్పుడు ఒకే స్ట్రీమ్‌కు పరిమితం కాకుండా రెండు సబ్జెక్టులను చదువుకోవచ్చు. ప్రస్తుత ప్రొటోకాల్ ప్రకారం బీఎస్సీ (బీజెడ్సీ) చదువుతున్న విద్యార్థికి మూడేళ్లు లేదా కోర్సు పూర్తయ్యే వరకు ఈ వెసులుబాటు లేదు. ఎన్ఈపీలో అయితే జంతుశాస్త్రం సబ్జెక్టు స్థానంలో చరిత్రను ఎంచుకోవచ్చు. మూడు సెమిస్టర్లకు చరిత్ర, మరో మూడు సెమిస్టర్లకు డిజిటల్ హ్యుమానిటీస్ ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సులతో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో స్కిల్ యూనివర్సిటీ అందించే కోర్సును కూడా ఒక సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు.

విద్యార్థి లైఫ్ సెన్సెస్‌లో కోర్సు చేస్తూనే, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే నైపుణ్యాలను సంపాదించడం అంతిమంగా అతనికి ప్రయోజనకరం. ఇది సజావుగా జరగాలంటే, ఉన్నత విద్యాసంస్థల అడ్మిషన్ ప్రొటోకాల్స్ సరళంగా ఉండాలి. ఇది ఎన్ఈపీలోని నేషనల్ క్రెడిట్ ఫ్రేంవర్క్ (ఎన్సీఆర్ఎఫ్) సాధ్యం చేస్తుంది.


ఎన్ఈపీ–2020లో ఎన్సీఆర్ఎఫ్ ముఖ్యమైన భాగం. పాఠశాల, ఉన్నత విద్య, వృత్తి విద్య, నైపుణ్య శిక్షణతో సహా అన్ని స్థాయిలలో అకడమిక్ క్రెడిట్లను సంపాదించడానికి, బదిలీ చేయడానికి సరళమైన, సమగ్రమైన వ్యవస్థను అందించడం ఎన్సీఆర్ఎఫ్ లక్ష్యం. ఇది వ్యవస్థలో సరళతను తీసుకొస్తుంది. విద్యార్థులు వివిధ కార్యకలాపాల నుండి క్రెడిట్లను సంపాదించవచ్చు. వారికి సమగ్ర విద్యను ప్రోత్సహించవచ్చు. అకడమిక్స్, వృత్తి నైపుణ్యాలు, క్రీడలు, కళలు, సమాజ సేవ, ఇంటర్న్‌షిప్ నుండి క్రెడిట్లను సంపాదించవచ్చు. ఉదాహరణకు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 18 క్రెడిట్ల జర్నలిజం కోర్సు కొనసాగించవచ్చు. విద్యార్థులు ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా ఆచరణాత్మక నైపుణ్యాలు, విజ్ఞానాన్ని పొందేలా ఎన్సీఆర్ఎఫ్ చేస్తుంది. ఇది విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది.


ఎన్ఈపీ 2020 అన్ని స్థాయిల్లో విద్యను ఒకేషనల్ చేయడంపై దృష్టి సారిస్తుంది. ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థుల్లో కనీసం 50 శాతం మందికి ఏదో ఒక నైపుణ్యం ఉండేలా 6వ తరగతి నుంచే నైపుణ్య విద్యను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఇంకా, ఎన్ఈపీలో మల్టీ ఎంట్రీ, ఎగ్జిట్ ఆప్షన్లు ఉంటాయి. ఇది విద్యార్థి ఒక కోర్సులో ఎన్నిసార్లయినా ప్రవేశించవచ్చు, నిష్క్రమించవచ్చు. తద్వారా కోర్సు మధ్యలో విద్యార్థి ప్రత్యక్ష అనుభవం సంపాదించవచ్చు లేదా సంగీతం, కళలు, క్రీడల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. మధ్యలో వదిలిపెట్టిన కోర్సును ఎప్పుడైనా తిరిగి వచ్చి పూర్తిచేయవచ్చు.

ఇప్పుడు ఎన్ఈపీలో భాగంగా ఒకేసారి రెండు డిగ్రీలు చేసేందుకు యూజీసీ అనుమతిస్తుంది. తద్వారా విద్యార్థి ఉన్నత విద్యలో విజ్ఞానాన్ని సముపార్జించవచ్చు, మరోవైపు ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యాధారిత డిగ్రీల్లో చేరవచ్చు. అంటే విజ్ఞానం పెంపొందించడానికి ఒక డిగ్రీ, నైపుణ్యం కోసం మరో డిగ్రీ ఒకేసారి చేయవచ్చు. ఇది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌ను ప్రోత్సహించే సమగ్ర విద్యకు దారితీస్తుంది. విద్యారంగాన్ని నైపుణ్య ఆధారిత విద్యతో మిళితం చేస్తుంది.


కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో విద్య ఉంది. ఎన్ఈపీపై కొన్ని రాష్ట్రాలు చేస్తున్న పస లేని విమర్శలు పట్టించుకోదగినవి కావు. తెలంగాణ తనకు మొదటి ప్రాధాన్యత అని రేవంత్‌రెడ్డి అనేకసార్లు చెప్పారు. తెలంగాణ విద్యార్థులను నైపుణ్యాలు, విజ్ఞానంతో శక్తిమంతం చేయాలనే తన లక్ష్యం చేరుకోవాలంటే అందుకు ఎన్ఈపీ ఎంతో ఉపయోగపడుతుంది. మన విద్యార్థులను రేపటి ఉద్యోగాలకు సన్నద్ధంగా ఉండేలా తీర్చిదిద్దాలనే రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు లక్ష్యాలను చేరుకోవాలంటే రాష్ట్రంలో ఎన్ఈపీ ఆచరణలో పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

డా. వై.ఎల్. శ్రీనివాస్

ప్రొ వైస్ ఛాన్సలర్, అరోరా విశ్వవిద్యాలయం

Updated Date - Oct 02 , 2024 | 02:21 AM