అవధులు లేని అసమానతలు
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:47 AM
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక అసమానతలు, అంతరాలు పెరుగుతున్నాయి. కార్పొరేట్ సంస్థల యజమానులు వేల కోట్ల రూపాయల ఖర్చుతో వివాహాది శుభకార్యాలు, సంబరాలు విదేశాల్లో నిర్వహిస్తున్నారు...
దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక అసమానతలు, అంతరాలు పెరుగుతున్నాయి. కార్పొరేట్ సంస్థల యజమానులు వేల కోట్ల రూపాయల ఖర్చుతో వివాహాది శుభకార్యాలు, సంబరాలు విదేశాల్లో నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రతి సంవత్సరం బిలియనీర్ల, కుబేరుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నది.
మన ఆర్థిక వ్యవస్థను సంపూర్ణంగా కార్పొరేటీకరణ చేయడమే ప్రధాన లక్ష్యంగా అభివృద్ధి సాగుతున్నదనేది నిర్వివాదాంశం. కేంద్ర ప్రభుత్వం కార్మికుల వేతనాల నియంత్రణ, కుదింపు, పని గంటల పెంపునకు సహకరిస్తూ, కార్పొరేట్ సంస్థల లాభాలపై పన్ను శాతం తగ్గిస్తూ ప్రతి సంవత్సరం వారి లాభాలను పెంచుతున్నది. లాభాల వెల్లువను, పెట్టుబడులను, ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను సంపూర్ణంగా కార్పొరేటీకరించడం జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 30 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉన్నాయి. దేశంలో ఒక పక్క పెట్రేగుతున్న నిరుద్యోగ సమస్య, మరో పక్క నిరంతరం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను గమనిస్తే ఆర్థిక వ్యవస్థలో పరస్పర వైరుధ్యాలు కలిగిన పరిస్థితులు ఎంతగా ఉన్నాయో అర్థమవుతుంది. ఆర్థిక వృద్ధిరేటు ఆరు శాతం, ఉపాధి–ఉద్యోగిత రేటు కేవలం రెండు శాతం మాత్రమే నమోదు అవుతున్న ఆర్థిక విధానంలో, దాదాపు ఉపాధి లేని అభివృద్ధి జరుగుతున్నదని ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ తిరోగమన ఆర్థిక విధానాల పుణ్యమా అని మధ్య, దిగువ స్థాయి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతున్న విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
పెట్రోల్, డీజిల్ పన్నులు, జీఎస్టీ పన్నుల భారం మధ్య, దిగువ తరగతి ప్రజలపై అధికంగా విధించడం వల్ల సగటు వినియోగదారుని నికర ఆదాయం కుదించుకుపోతోంది. నిత్యం పెరుగుతున్న ధరలతో అసంఘటిత, అనియత రంగంలోని ఉద్యోగుల, కార్మికుల వాస్తవ వేతనాలు రోజురోజుకూ కరిగిపోతున్నాయి.
ఎదుగుతున్న కోట్లాది విద్యావంతులైన యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో జి–20 దేశాలలో భారత్ వెనుకబడి ఉందని ఇటీవల ప్రపంచ బ్యాంకు అధికారి గోపీనాథ్ గుర్తుచేశారు. పేదలకు, ధనవంతులకు మధ్య సాపేక్ష పేదరికం మరింత పెరుగుతున్నది. డెబ్భై ఏడు సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ జరుగుతున్నది. ఆర్థికాభివృద్ధి ఫలితాలు కార్పొరేట్ సంస్థలకు, పేద వర్గాలకు ఉచితాలు పంపిణీ చేసి పాలకులు చేతులు దులుపుకుంటున్నారు.
51 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ రూ.100 నుండి రూ.150 దినసరి ఆదాయంతో బతుకుతున్నారు. నివాసయోగ్యమైన గృహ సదుపాయం లేక ఆదివాసులు, గిరిజనులు, ఇతర పేదలు కోట్లాదిగా నిరాశ, నిస్పృహలకు గురి అవుతున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ రంగాల ద్వారా ప్రజల సమగ్ర అభివృద్ధికి కావలసిన ఆర్థిక విధానాలు అమలు చేయాలి. దేశ సంపదలో ప్రజలందరికీ భాగస్వామ్యం లభించాలి.
18వ లోక్‌సభలో 400 సీట్లు ఇవ్వండని అడిగినా, ప్రజలు కేవలం 240 సీట్లు ఇచ్చి కేంద్ర ప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేశారు. ఇకనైనా ప్రజల ఎజెండాను పాలకులు గుర్తించడం ఎంతైనా అవసరం. మెజారిటీ ప్రజలకు అవసరమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధి విధానాలను రూపొందించాలి. పిడివాదపు ఆర్థిక విధానాలను విడనాడి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ, ఆదాయాలను కల్పించి నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం నుండి రక్షించవలసిన అవసరాన్ని గుర్తించాలి. యువతలో పెరుగుతున్న అశాంతి, అభద్రతాభావాన్ని తొలగించాలి. వెనిజులా, శ్రీలంక, బంగ్లాదేశ్ మొదలైన దేశాలలో యువతలో పెల్లుబికిన అశాంతి, జరిగిన పరిణామాలు రాజకీయ వ్యవస్థలనే సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. మన దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, సాపేక్ష పేదరికం, ఆర్థిక అసమానతల అంతరాలను తగ్గించడానికి తగిన ఆర్థిక, రాజకీయ, సామాజిక సంస్కరణలు ఆదాయ పంపిణీ విధానాలను ప్రవేశపెట్టి అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలకు తగిన భాగస్వామ్యం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం అర్థవంతమవుతుందని భావించాలి.
ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ