Share News

నేడు డిటిఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:58 AM

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం గద్దెనెక్కి మూడు నెలల గడిచిపోయాయి. ప్రభుత్వం వంద రోజుల సంబరాలు జరుపుకుంటోంది. కానీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు...

నేడు డిటిఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం గద్దెనెక్కి మూడు నెలల గడిచిపోయాయి. ప్రభుత్వం వంద రోజుల సంబరాలు జరుపుకుంటోంది. కానీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. ఎన్నికల ముందు ఎన్‌డీఏ కూటమి మ్యానిఫెస్టోలో భాగంగా విద్యాశాఖ జీవో 117 రద్దు చేస్తామని, మాతృభాషా మాధ్యమాలను కొనసాగిస్తామని, ఉద్యోగులతో సఖ్యతగా ఉంటామని, గత ఐదేళ్లుగా గాడి తప్పిన ఉద్యోగుల పాలనా వ్యవస్థను చక్కదిద్దుతామని, అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీలు ఇచ్చింది. జగన్‌ ప్రభుత్వంపై వ్యతిరేక ఓటుతో అధికారంలో వచ్చిన కూటమి ఎలాంటి వినూత్న చర్యలనూ తీసుకోలేదు. ఒకటవ తేదీ జీతాలు, పెన్షన్లు చెల్లించడం మినహా ఉద్యోగులకు మరేమీ చేయలేకపోయింది. ప్రైవేటీకరణ నేపథ్యంలో రూపొందించబడిన ‘జాతీయ విద్యా విధానం–2020’ పరిధి నుంచి బయటకు వచ్చి, విద్యారంగాన్ని సంస్కరించడం ఎంత కష్టమో ప్రభుత్వానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.


దేశ ఫెడరల్‌ వ్యవస్థకు భంగకరంగా ఉన్న సిబిఎస్‌ఇ సిలబస్‌లో సంస్కరణలు తీసుకురావడానికి నిర్ణయం తీసుకోలేకపోతున్నది. రాష్ట్ర హక్కులకు, విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేకపోతున్నది. ఎలాంటి స్వయం నిర్ణయాధికారం లేకుండా పాఠశాల విద్యను మొత్తంగా గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా పావులు కదుపుతోంది. ఇదే పరిస్థితి మునుముందు కొనసాగితే 3 నుంచి 10వ తరగతి వరకు, +2 తరగతులు మాత్రమే ప్రభుత్వంచే అందించబడతాయి. మిగతావి మార్కెట్‌కు వదిలివేస్తారు.


ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్యారంగానికి శాపంగా మారిన జీఓ 117 తక్షణమే రద్దుచేయాలని; ఆంగ్లభాషా మాధ్యమంతో పాటు మాతృభాషా మాధ్యమాలను యధావిధిగా కొనసాగించాలని; సీపీఎస్‌, జీపీఎస్‌లను రద్దు చేసి, ఓపీఎస్‌ (పాత పెన్షన్‌) కొనసాగించాలని; విద్యా హక్కు చట్టం–2009 ప్రకారం రాష్ట్రాల హక్కులకు భంగకరంగా ఉన్న విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని; రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు తక్షణమే మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించి, అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్‌ 2న జిల్లా కేంద్రాలలో గాంధీ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శన చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.

–డెమొక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌,

ఆంధ్రప్రదేశ్‌

Updated Date - Oct 02 , 2024 | 01:58 AM