టెక్ వ్యూ : 25000 పైన నిలదొక్కుకోవడం కీలకం
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:35 AM
నిఫ్టీ గత వారం ప్రారంభంలో 25000 స్థాయిలో రికవరీ సాధించి మరింత పురోగమించింది. గురువారం ఏర్ప డిన ఆకస్మిక ర్యాలీలో 470 పాయింట్లకు పైగా లాభపడి 25000 కన్నా పైన క్లోజయింది...
టెక్ వ్యూ : 25000 పైన నిలదొక్కుకోవడం కీలకం
నిఫ్టీ గత వారం ప్రారంభంలో 25000 స్థాయిలో రికవరీ సాధించి మరింత పురోగమించింది. గురువారం ఏర్ప డిన ఆకస్మిక ర్యాలీలో 470 పాయింట్లకు పైగా లాభపడి 25000 కన్నా పైన క్లోజయింది. ముందు వారంతో పోల్చితే 500 పాయింట్ల మేరకు లాభపడి 25356 వద్ద జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో ముగిసింది. అలాగే మిడ్‌క్యాప్-100 ఇండెక్స్ 1500 పాయింట్లు, స్మాల్‌క్యాప్-100 ఇండెక్స్ 230 పాయింట్లు లాభపడి జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో ముగిశాయి. అయితే గత కొద్ది వారాల్లో పలు మధ్యస్థాయి, చిన్న స్థాయి షేర్లు కరెక్షన్ చవి చూశాయి. టెక్నికల్‌గా మార్కెట్ పటిష్ఠంగానే క్లోజయినప్పటికీ గరిష్ఠ స్థాయిల్లో కన్సాలిడేషన్ ఏర్పడాల్సి ఉంది. అమెరికన్ స్టాక్ మార్కెట్ సూచీ డో జోన్స్ కూడా 41,600 వద్ద నిలిచి ఉంది. గతంలో ఈ స్థాయిలోనే రెండు సార్లు కరెక్షన్ ఏర్పడింది. మార్కెట్ ఇప్పటికీ ఓవర్‌బాట్ స్థితిలో ఉన్నందు వల్ల అప్రమత్తత తప్పదు. గత వారంలో బ్రేకౌట్ ఏర్పడినందు వల్ల పుల్‌బ్యాక్ రియాక్షన్‌కు కూడా ఆస్కారం లేకపోలేదు.
బుల్లిష్ స్థాయిలు: పాజిటివ్ ట్రెండ్‌లో ట్రేడయితే తదుపరి నిరోధం 25440. ప్రధాన నిరోధ స్థాయిలు, మానసిక అవధులు 25500, 25550. ఈ స్థాయిలో కన్సాలిడేషన్ ఏర్పడవచ్చు. మరింత అప్‌ట్రెండ్‌లో పురోగమించేందుకు స్వల్పకాలిక నిరోధం 25500 కన్నా పైన నిలదొక్కుకోవాలి.
బేరిష్ స్థాయిలు: బలహీనత ప్రదర్శించినా మైనర్ మద్ద తు స్థాయి 25250 కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. విఫలమైతే మైనర్ బలహీనతలో పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 25000.భద్రత కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో ప్రవేశిస్తుంది.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం పునరుజ్జీవం సాధించిన ఈ సూచీ 1360 పాయింట్ల మేరకు లాభపడి 51940 వద్ద ముగిసింది. ఇప్పటికీ జీవితకాల గరిష్ఠ స్థాయి 53350 కన్నా దిగువనే ఉంది. మరింత పాజిటివ్ ట్రెండ్‌లో ట్రేడయితే ప్రధాన నిరోధం 52400 కన్నా పైన నిలదొక్కుకోవాలి. విఫలమై ప్రధాన మద్దతు స్థాయి 51500 కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు.
పాటర్న్: నిఫ్టీ 25000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ కన్నా దిగజారితే బలహీనత సంకేతం ఇస్తుంది. అయితే ఈ స్థాయి కొంత దూరంగానే ఉంది. అలాగే 25500 వద్ద ‘‘ఏటవాలుగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిరోధం ఎదుర్కొంటోంది. సానుకూలత కోసం ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం
స్థాయిలు నిరోధం : 25,440, 25,500
మద్దతు : 25,250, 25,170
వి. సుందర్ రాజా