మార్కెట్లో రికవరీ ర్యాలీ
ABN , Publish Date - Aug 10 , 2024 | 06:03 AM
ఈ వారం ఆరంభ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకున్నాయి. వారాంతం ట్రేడింగ్‌లో ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ సూచీలూ ర్యాలీ తీశాయి. సెన్సెక్స్ ఒక దశలో 1,098 పాయింట్ల వరకు పెరిగి 79,984.24 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని
సెన్సెక్స్ 819 పాయింట్లు అప్
ముంబై: ఈ వారం ఆరంభ నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకున్నాయి. వారాంతం ట్రేడింగ్‌లో ప్రపంచ మార్కెట్లతో పాటు దేశీయ ఈక్విటీ సూచీలూ ర్యాలీ తీశాయి. సెన్సెక్స్ ఒక దశలో 1,098 పాయింట్ల వరకు పెరిగి 79,984.24 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 819 పాయింట్ల లాభంతో 79,705.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 302 పాయింట్లు ఎగబాకినప్పటికీ, చివర్లో 250.50 పాయింట్ల లాభంతో 24,367.50 వద్ద క్లోజైంది. అమెరికాలో నిరుద్యోగ భృతి క్లెయిమ్‌ల గణాంకాలు సానుకూలంగా నమోదు కావడంతో ఆర్థిక మాంద్యం భయాలు తగ్గుముఖం పట్టాయి. దాంతో అమెరికాతో పాటు ప్రపంచ మార్కెట్లో ట్రేడింగ్ సెంటిమెంట్ మెరుగుపడిందని ఈక్విటీ నిపుణులు పేర్కొన్నారు. మరిన్ని ముఖ్యాంశాలు..
ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.46 లక్షల కోట్లు పెరిగి రూ.450.21 లక్షల కోట్లకు (5.37 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది.
సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 28 లాభపడ్డాయి. టెక్ మహీంద్రా షేరు 2.74 శాతం ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, జేఎ్‌సడబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ షేర్లూ రెండు శాతానికి పైగా పెరిగాయి. మార్కెట్ దిగ్గజ షేర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.82 శాతం, ఇన్ఫోసిస్ 1.71 శాతం, టీసీఎస్ 1.42 శాతం రాణించాయి.
ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్ హిట్ .. తొలిరోజే 20 శాతం ఎగబాకిన షేరు
విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌కు మంచి స్పందన లభించింది. శుక్రవారం కంపెనీ తన షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.76తో పోలిస్తే, బీఎ్‌సఈలో కంపెనీ షేరు 0.01 శాతం డిస్కౌంట్‌తో రూ.75.99 వద్ద లిస్టయినప్పటికీ, ఇంట్రాడేలో క్రమంగా పుంజుకుంది. మధ్యాహ్నానికల్లా అప్పర్ సర్క్యూట్ లిమిట్ 19.97 శాతం పెరిగి రూ.91.18కి చేరుకున్న షేరు.. తొలిరోజు ట్రేడింగ్ ముగిసేసరికి అదే స్థాయి వద్ద ముగిసింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) రూ.40,217.95 కోట్లుగా నమోదైంది. మంగళవారంతో ముగిసిన ఈ రూ.6,145 కోట్ల ఐపీఓకు 4.27 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ లభించింది.