ఆర్‌బీఐ నగదు నిర్వహణ మరింత పటిష్ఠం
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:28 AM
వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఏర్పడే నగదు అవసరాలు తీర్చేందుకు ఆర్‌బీఐ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కొత్త నగదు నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, వేర్‌హౌస్‌ల...
న్యూఢిల్లీ: వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఏర్పడే నగదు అవసరాలు తీర్చేందుకు ఆర్‌బీఐ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కొత్త నగదు నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, వేర్‌హౌస్‌ల ఆటోమేషన్, నగదు నిల్వ కేంద్రాల వద్ద గట్టి నిఘా, భద్రత పటిష్ఠత, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్ వ్యవస్థల ఏర్పాటు, కేంద్రీకృత కమాండ్ కేంద్రం ఏర్పాటు, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను మరింత పటిష్ఠం చేయడం వంటి చర్యలకు సిద్ధమైంది. ఈ ఏర్పాట్ల కోసం ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది.
ఇంకా పెరుగుడే: నిజానికి డిజిటల్ చెల్లింపుల విస్తరణతో గత మూడేళ్లలో చలామణిలో ఉన్న నగదు (ఎన్‌ఐసీ) వృద్ధిరేటు తగ్గింది. అయినా ఆర్థిక వృద్ధితో పాటు నోట్ల గిరాకీ కూడా వచ్చే పదేళ్లలో మరింత పెరగుతుందని నిపుణుల అంచనా. నిజానికి చలామణిలో ఉన్న నోట్ల పరిమాణం, విలువ రెండూ గత ఏడాది కాలంగా బాగా పెరిగాయి. గత ఏడాది మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న నోట్ల పరిమాణం 13,621 కోట్ల నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి 14,687 కోట్లకు చేరింది. ఇదే సమయంలో చలామణిలో ఉన్న నాణేల పరిమాణం 12,792 కోట్ల నుంచి 13,235 కోట్లకు చేరింది. ఇది చాలదన్నట్టు పాడైపోయిన నోట్ల పరిమాణం కూడా పెరిగిపోతోంది. దీంతో కరెన్సీ నోట్ల నిర్వహణ మరింత కట్టుదిట్టంగా చేపట్టాల్సిన అవసరం ఏర్పడుతోంది.