ఎఫ్ అండ్ ఓ నిబంధనలు కఠినతరం
ABN , Publish Date - Oct 02 , 2024 | 01:20 AM
ఫ్యూచర్స్ అండ్ అప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను కట్టడి చేసేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్ నిబంధనలను...
నవంబరు 20 నుంచి దశలవారీగా అమలు
ఇండెక్స్ డెరివేటివ్స్ కనీస కాంట్రాక్ట్ సైజు
రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంపు
సర్క్యులర్ విడుదల చేసిన సెబీ
న్యూఢిల్లీ: ఫ్యూచర్స్ అండ్ అప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను కట్టడి చేసేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్ నిబంధనలను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా కనీస కాంట్రాక్ట్ సైజు పెంపుతో పాటు ఆప్షన్స్ ప్రీమియం అప్‌ఫ్రంట్ వసూలు తప్పనిసరి చేసింది. పొజిషన్స్ లిమిట్స్ ఇంట్రాడే మానిటరింగ్, కాంట్రాక్టుల గడువు ముగింపు తేదీన క్యాలెండర్ స్ర్పెడ్ రద్దు, వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్ హేతుబద్ధీకరణ, టెయిల్ రిస్క్ కవరేజీ పెంపు వంటి చర్యలను సైతం ప్రకటించింది. చిన్న మదుపరుల ప్రయోజనాలను, మార్కెట్ స్థిరత్వాన్ని రక్షించడమే ఈ చర్యల ముఖ్యోద్దేశం. తాజాగా ప్రకటించిన నిర్ణయాలు ఈ నవంబరు 20 నుంచి దశలవారీగా అమలులోకి రానున్నాయని మంగళవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది.
ఎఫ్ అండ్ ఓ విభాగ ట్రేడింగ్‌కు సంబంధించి సెబీ ఇటీవల ఒక అధ్యయన నివేదికను విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం మధ్యకాలంలో ఎఫ్ అండ్ ఓ విభాగంలో ట్రేడింగ్ నెరిపిన కోటి మందికి పైగా వ్యక్తిగత ఇన్వెస్టర్లలో 93 శాతం మంది సగటున రూ.2 లక్షల చొప్పున నష్టపోయినట్లు సెబీ అధ్యయనంలో వెల్లడైంది. వీరి మొత్తం నష్టం రూ.1.8 లక్షల కోట్ల పైమాటేనని తెలిపింది. అంతేకాదు, 2021-22లో నష్టపోయిన వ్యక్తిగత ఇన్వెస్టర్ల వాటా 89 శాతంగా ఉండగా.. 2023-24 నాటికి 93 శాతానికి పెరిగింది.
సెబీ తాజా చర్యల వివరాలు..
ఠ డెరివేటివ్స్ కనీస కాంట్రాక్ట్ సైజు రూ.5-10 లక్షల నుంచి రూ.15-20 లక్షల పెంపు. వచ్చేనెల 20 నుంచి ఇది అమలు కానుంది. మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుంది.
మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు 2025 ఏప్రిల్ నుంచి ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్‌లో పొజిషన్స్ లిమిట్‌పై ఇంట్రాడే మానిటరింగ్ అమలులోకి రానుంది. ఇందులో భాగంగా స్టాక్ ఎక్స్చేంజీలు ఈ విభాగంలో పొజిషన్స్ పరిమితికి లోబడి ఉన్నాయా లేదా అని తనిఖీ చేసేందుకు కనీసం నాలుగు పొజిషన్ స్నాప్షాట్స్ను యాధృచ్ఛికంగా ఎంపిక చేయనుంది.
కాంట్రాక్టుల ముగింపు తేదీ రోజున స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌ను నిరోధించడంతోపాటు మార్కెట్లో ఊగిసలాటలను తగ్గించేందుకు ఎక్స్ఛేంజీలు ఒక ప్రామాణిక సూచీలో (బెంచ్‌మార్క్ ఇండెక్స్)లో వారం రోజుల గడువుతో కూడిన డెరివేటివ్ కాంట్రాక్టులను ఆఫర్ చేసేందుకు మాత్రమే అనుమతించబడతాయి. అలాగే, గడువు ముగింపు రోజున షార్ట్ ఆప్షన్స్ కాంట్రాక్టులపై అదనంగా 2 శాతం మార్జిన్‌ను విధించడం జరుగుతుంది. ఈ నిబంధనలు కూడా వచ్చే నెల 20 నుంచి అమలులోకి రానున్నాయి.
అప్షన్స్ కొనుగోలుదారులు పూర్తి ప్రీమియంను ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఇన్వెస్టర్లు తమ ఆర్థిక పరపతి స్థాయికి మించి పొజిషన్స్ తీసుకోకుండా నిరోధించేందుకు ఇది దోహదపడనుంది. అలాగే, కాంట్రాక్టు గడువు ముగింపు రోజున క్యాలెండర్ స్ర్పెడ్ ప్రయోజనమూ అందుబాటులో ఉండవు. ఈ మార్పులు వచ్చే ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లో స్ర్టెస్ టెస్ట్‌కు కొత్త విధానం
ఈక్విటీ డెరివేటివ్ విభాగంలో ఒత్తిడిని మరింత మెరుగ్గా గుర్తించేందుకు సెబీ స్ర్టెస్డ్ వేల్యూ ఎట్ రిస్క్ (వీఏఆర్), ఎక్స్‌పోనెన్షియల్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ (ఈడబ్ల్యూఎంఏ) వంటి కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. మార్కెట్లో మారుతున్న స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు పొంచి ఉన్న ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఇవి దోహదపడనున్నాయి.