తిరుమలలో వైసీపీ ఎమ్మెల్సీ దందా
ABN , Publish Date - Oct 21 , 2024 | 04:07 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ వైసీపీ నేతల అక్రమాలు మాత్రం ఆగడం లేదు. ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ తిరుమల వీఐపీ బ్రేక్ టికెట్లను రూ.1.5 లక్షలకు విక్రయించిన ఘటన ఆదివారం వెలుగుచూసింది.
9 వీఐపీ బ్రేక్ టికెట్లు రూ.1.5 లక్షలకు విక్రయం!
ఈ నెల 19న భక్తులతో దర్శనానికి వచ్చిన
శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్ జకియా ఖానం
క్యూలైన్‌లో డిక్లరేషన్‌పై సంతకం
భక్తుడి ఫిర్యాదుతో వెలుగుచూసిన బాగోతం
ఆమెతో పాటు ముగ్గురిపై కేసు నమోదు
తిరుమల/రాయచోటి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ వైసీపీ నేతల అక్రమాలు మాత్రం ఆగడం లేదు. ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ తిరుమల వీఐపీ బ్రేక్ టికెట్లను రూ.1.5 లక్షలకు విక్రయించిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన సాయికుమార్ తనతోపాటు తొమ్మిది మందికి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కావాలని చంద్రశేఖర్ అనే దళారీని సంప్రదించారు. ఈ క్రమంలో చంద్రశేఖర్.. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం పీఆర్వో కృష్ణతేజ ద్వారా తొమ్మిది వీఐపీ బ్రేక్ టికెట్లు, వేదాశీర్వచనంతో కలిపి రూ.1.5 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. అయితే తొమ్మిది మందికి ప్రొటోకాల్ దర్శనాలు చేయించేందుకు ఎమ్మెల్సీ జకియా ఖానం కూడా వారితో కలిసి ఈ నెల 19వ తేదీ ఉదయం దర్శనానికి వచ్చారు. క్యూలైన్‌లో డిక్లరేషన్‌పై సంతకం చేసి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో అధికంగా డబ్బులు తీసుకున్నారని గ్రహించిన సాయికుమార్.. చంద్రశేఖర్, కృష్ణతేజపై టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఎమ్మెల్సీ స్వయంగా దళారీలతో చేతులు కలిపి టికెట్లు విక్రయించినట్టు విచారణలో తేలింది. వెంటనే విజిలెన్స్ అధికారులు నివేదికను తిరుమల వన్‌టౌన్ పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా కృష్ణతేజను చేర్చారు. కాగా, ఎమ్మెల్సీ గతంలోనూ ఇదే విధంగా తనకు పరిచయం లేని వ్యక్తులను దర్శనాలకు తీసుకొచ్చినట్టు విజిలెన్స్ విచారణలో గుర్తించినట్టు సమాచారం.
ఆరోపణలు, కేసు వెనుక కుట్ర: జకియా ఖానం
ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని జకియా ఖానం తెలిపారు. తనకు ప్రస్తుతం పీఆర్వోలు లేరని, గతంలో ఉన్న పీఆర్వో సక్రమంగా స్పందించకపోవడంతో అతన్ని తొలగించినట్టు తెలిపారు. అప్పటి నుంచి తన వ్యక్తిగత సహాయకుడే ఈ వ్యవహారాలను చూసుకుంటున్నట్టు వెల్లడించారు. గత నాలుగేళ్లుగా తాను ఏనాడూ నిబంధనలు అతిక్రమించలేదన్నారు. తన పరిచయస్తులు, స్నేహితులకు మాత్రమే తిరుమల దర్శనానికి లేఖలు ఇస్తున్నానన్నారు. కృష్ణతేజ, చంద్రశేఖర్, సాయికుమార్ ఎవరో తనకు తెలియదన్నారు. తనపై ఈ ఆరోపణలు, కేసు నమోదు వెనుక ఏదో కుట్ర ఉందని ఆనుమానం వ్యక్తంచేశారు. ఓ మైనార్టీ మహిళ ఉన్నత స్థానంలో ఉండటం సహించలేకే తనపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏ పార్టీలో ఉన్నా.. నిజాయితీగా నడుచుకునే కుటుంబం తమదని జకియా ఖానం తెలిపారు.