ఆదుకుంటా!
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:58 AM
వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని, అధైర్య పడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఎవరూ అధైర్యపడొద్దు.. 17లోగా బాధితులకు పరిహారం
ఏలేరు వరద ముంపు రైతులకు న్యాయం
హెక్టారుకు రూ. 25 వేలు అందిస్తాం
గతంలో నేనే రైతులకు 20 వేలిచ్చా
జగన్ మూడు వేలు తగ్గించి ఇచ్చేవాడు
కౌలు రైతుల ఖాతాలకే ఇన్‌పుట్ సబ్సిడీ
తోపుడుబండ్లు, ఆటోరిక్షాలకు 10 వేలు
దెబ్బతిన్న ఇంటి స్థానంలో కొత్తది కట్టిస్తాం
నేటి నుంచి బాధితులకు దుస్తుల పంపిణీ
కాకినాడ, ఏలూరు జిల్లాల్లో సీఎం పర్యటన
కొల్లేరు, తాండవ వరదపై ఏరియల్ సర్వే
(కాకినాడ, ఏలూరు - ఆంధ్రజ్యోతి)
వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని, అధైర్య పడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ నెల 17వ తేదీ లోపు వరద పరిహారం అందిస్తామని తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఏలేరు వరద ముంపుతో పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.25 వేలు, ప్రతి కుటుంబానికి రూ.10 వేల ఆర్థికసాయం, దుస్తులు అందిస్తామని ప్రకటించారు. బుధవారం ఆయన ఏలూరు జిల్లాలోని కొల్లేరు పరిధిలోని వరద ప్రాంతంలోను, కాకినాడ జిల్లాలో ఏలేరు వరద ప్రభావిత ప్రాంతంలోను పర్యటించారు. పంట నష్టాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. తీవ్రంగా పంటనష్టం వాటిల్లిన రైతుల్లో ధైర్యం నింపుతూ, వరదలకు ఇళ్లు దెబ్బతిన్నవారిని, తోపుడు బండ్ల వారిని పరామర్శిస్తూ ఈ రెండు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన సాగింది. మధ్యాహ్నం సామర్లకోటలో హెలికాప్టర్ దిగి అక్కడినుంచి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వడ్లమూరుకు చంద్రబాబు చేరుకున్నారు. ఓ రైతు ఆయనకు కొబ్బరి బొండం ఇవ్వగా, అది తీసుకుని తాగారు. వడ్లమూరు గ్రామంలో వంతెన వద్ద ఏలేరు కాల్వ వరద పరిస్థితిని అధికారులతో కలిసి పరిశీలించారు.
జేసీబీ యంత్రం ఎక్కి...
వరద ముంపునకు గురైన జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి సీఎం వెళ్లారు. ఏలేరు కాలువకు గండిపడి ఈ గ్రామంలో ఛాతీలోతు వరకు వరద నీరు ప్రవహిస్తోంది. ఇక్కడ బాధితులను పరామర్శించడానికి వచ్చిన సీఎం ఎక్స్‌కవేటర్ ఎక్కి గ్రామంలో తిరిగారు. ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వరదతో దెబ్బతిన్న కాకాడ వసంత్‌కుమార్‌కు చెందిన పెంకుటిల్లు లోపలకు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లారు. వరద తమ ఇంటిని ఎలా చుట్టుముట్టేసిందో ఓ బాధిత మహిళ.. బాబుకు వివరించారు. తమను ఆదుకోవాలని కోరారు. పక్కనే ఉన్న కలెక్టర్‌ను పిలిచి బాధిత కుటుంబానికి అన్నివిధాలా సాయం చేయాలని సీఎం ఆదేశించారు. అనంతరం మరో మహిళ...చంద్రబాబుకు తన కష్టాన్ని వివరించారు. వరద ఇంట్లోకి వచ్చేయడంతో ఇళ్లు దెబ్బతిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. రాజుపాలెం గ్రామం ప్రారంభంలో కొందరు రైతులు చంద్రబాబును కలిశారు. వరదలతో కుళ్లిపోయిన కంకులను చూపించి ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో పంట నష్టం వేగంగా పూర్తి చేసి పరిహారం ఇస్తామని వారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత రాజుపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు.
ఏలేరు వద్ద ఆధునికీకరణ పనులు
గురువారం నుంచి బాధితులకు దుస్తులు పంపిణీ చేస్తామని, వరదకు దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి పదివేల సాయం చేస్తామని రాజుపాలెం పంచాయతీ వద్ద ప్రకటించారు. దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు కట్టిం చి ఇస్తామని, తోపుడు బండ్లు దెబ్బతిన్న వారికి కొత్తవి ఇస్తామన్నారు. ఆటోరిక్షాలు, సైకిల్ రిక్షాలు పాడైతే పదివేలు సాయం చేస్తామని తెలిపారు. పంటలు దెబ్బతిన్న రైతులకు హెక్టారుకు రూ.25వేల సాయం అందిస్తామని వివరించారు. ఏలేరుకు వరద రాకుండా ఆధునికీకరణ పనులు చేపడతామని చెప్పారు. గతంలో తితలీ తుఫానుకు టీడీపీ ప్రభుత్వం హెక్టారుకు రూ.20వేలు సా యం చేసిన విషయం గుర్తుచేశారు. కానీ జగన్ వచ్చి రూ.20 వేలను రూ.16 వేలకు తగ్గించారని, తర్వాత వెయ్యి పెంచారన్నారు.
త్వరలో పోలవరం పనులు
వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పారదర్శకతతో, జవాబుదారీతనంతో లెక్కిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏలూరు నగరంలో తమ్మిలేరు ప్రవాహాన్ని పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా కొల్లేరు ప్రాంతంలోని వరద ప్రాంతాలను సీఎం చూశారు. అనంతరం సీఆర్‌ఆర్ కళాశాల ప్రాంగణం లో ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి, బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. త్వరలో పోలవరం పనులు తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. అదే సమయంలో చింతలపూడి లిఫ్ట్ పనులు పూర్తి చేయడమే కాకుండా ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాలు రెండింటికీ నీరందించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. తాను, తన మిత్రుడు పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తామని ముఖాముఖిలో పేర్కొన్నారు.
ప్రత్యేక యాప్ తయారుచేస్తున్నాం..
ప్రజల ఆశలకు అనుగుణంగా కూటమి ప్రభు త్వం పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు. ‘‘ఎన్నిక ల్లో ఓట్లేశాం.. ఇక మా బాధ్యత అయిపోయిందని ప్రజలు అనుకుంటే జగన్ లాంటి దుర్మార్గులు వచ్చి నాశనం చేస్తారు. ఏమైనా ఇబ్బందులుంటే ప్రజలు చెబితే, సరిదిద్దుకుంటాం. దీనికోసమే త్వరలో యాప్ అభివృద్ధి చేస్తున్నాం. దీనిద్వారా ప్రజల ఫోన్‌కు సం దేశం వస్తుంది. సమాధానం ఇచ్చినవారి అభిప్రా యం నేరుగా నాకు చేరుతుంది. ప్రజలకు, సీఎంకి మధ్య మధ్యవర్తులు ఉండబోరు’’ అని తెలిపారు.