వ్యవసాయ ఇంజనీరింగ్ డైరెక్టరేట్ ఏర్పాటెప్పుడు?
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:42 AM
రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రత్యేక ఇంజనీరింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు కార్యరూపం దాల్చడంలేదు.
ముసాయిదా సిద్ధం చేసిన గత టీడీపీ సర్కారు
ఐదేళ్లపాటు కనీసం పట్టించుకోని జగన్ ప్రభుత్వం
అప్పట్లోనే ఏర్పాటు చేసి ఉంటే 10 వేల మంది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రత్యేక ఇంజనీరింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు కార్యరూపం దాల్చడంలేదు. ‘డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్’ ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ 2017లోనే ఆదేశించింది. వివిధ శాఖల్లో పని చేస్తు న్న అగ్రికల్చర్ ఇంజనీర్లతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొం ది. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ముసాయిదాను రూపొందించింది. అయితే, 2019లో ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. దీంతో ‘సాయిల్ కన్జర్వేషన్’ విభాగంలో కొత్త పోస్టులు మంజూరు చేయాలన్న వ్యవసాయశాఖ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్-అగ్రికల్చర్ కోర్సులున్నాయి. ఏటా 80 నుంచి 100 మంది ఈ కోర్సులు పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్-అగ్రికల్చ ర్ కోర్సులు పూర్తి చేసిన 10 వేల మంది వరకు ఉన్నారని అంచనా. గతం లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన 56 మందిని వ్యవసాయశాఖలోని సాయిల్ కన్జర్వేషన్ విభాగంలో ఏవోలుగా తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం 22 మంది ఏడీఏలు, 6 డీడీఏలు పని చేస్తున్నారు. ఉద్యాన శాఖలోని సూక్ష్మసేద్య విభాగంలో 40 మంది హార్టీకల్చర్ ఇంజనీర్లుగా ఉన్నారు. డ్వామా, ఉపాధి హామీ పథకంలో పీవో, ఏపీవోలుగా 10 మంది, ఏపీ ఆగ్రో్‌సలో నలుగురు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. అయితే, వ్యవసాయశాఖలోని సాయిల్ కన్జర్వేషన్ విభాగంలో ప్రస్తుతం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల్లోకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ అగ్రికల్చర్ చేసిన వారితో కాకుండా, ఏజీ బీఎస్సీ చేసిన ఏవో, ఏఈవోలతో భర్తీ చేస్తున్నారు. దీనివల్ల తమకు అన్యాయం జరుగుతోందని అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ అగ్రికల్చర్ కోర్సులు చదివిన వారు వాపోతున్నారు.
సాంకేతికతకు అనుగుణంగా
ప్రస్తుతం వ్యవసాయరంగంలో యాంత్రీకరణ, డ్రోన్స్ వంటి కొత్త టెక్నాలజీ, విభిన్న ఇంజనీరింగ్ పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యం లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పట్టభద్రుల సేవలను ఉపయోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రం అనుమతి ఉన్నందున డైరెక్టరేట్ ఏర్పాటు చేసి, తమకు న్యాయం చేయాలని పట్టభద్రులు కోరుతున్నారు.