వారాణసీలో అన్నదమ్ముల ఆత్మహత్య
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:35 AM
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు పెరుమాళ్ల లక్ష్మీనారాయణ (34), పెరుమాళ్ళ లోక్ వినోద్ (32) వరాణసిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అదృశ్యం అయినట్టు గత నెలలో చేబ్రోలులో ఫిర్యాదు
ఉంగుటూరు, సెప్టెంబరు 11 : ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు పెరుమాళ్ల లక్ష్మీనారాయణ (34), పెరుమాళ్ళ లోక్ వినోద్ (32) వరాణసిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భేల్‌పూరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోనాపూర్‌లోని మానస సరోవర్ ప్రాంతం లోని రామ్‌తారక్ ఆంధ్రా ఆశ్రమంలో మంగళవారం ఇరువురు సోదరుల మృతదేహాలు కుళ్లిపోయి ఉన్నా యని భేల్‌పూర్ ఏసీపీ ధనుంజయ్ మిశ్రా తెలిపారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారించారు. ఆశ్రమం ట్రస్టీ మేనేజర్ సుందర్ శాస్త్రి మాట్లాడుతూ వీరిద్దరూ తీర్ధయాత్రలకు వచ్చారని ఆగస్టు 28 నుంచి రూమ్ తీసుకున్నట్లు పోలీసులకు తెలిపారు.మంగళవారం మధ్యాహ్నం ఆశ్రమ సిబ్బందికి గది నుంచి దుర్వాసన రావడంతో భేల్‌పూరా ఇన్స్ పెక్టర్ విజయ్ శుక్లాకు సమాచారం అందించారు. కాగా ఈ అన్నదమ్ముల అదృశ్యం విషయమై ఏలూరు జిల్లా చేబ్రోలు పోలీస్టేషన్‌లో న్యాయవాది తల్లిబోయిన రాజేష్ ఈ యేడాది మేనెల 15వ తేదీన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. మే 12 సాయంత్రం అదృశ్యమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నలుగురు వ్యక్తుల వల్ల మానసికంగా ఆందోళన చెందుతున్నామని వాట్సప్ ద్వారా వీడియోను కుటుంబ సభ్యులకు పంపారు. వీరు క్రికెట్ బెట్టింగ్‌ల వల్ల బుకీలకు అప్పులు చెల్లించాలని తెలిసింది. దీంతో వారి ఒత్తిడి తట్టుకోలేక ఈపని చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.