Share News

బాబోయ్‌ బుస్‌..బుస్‌లు

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:59 AM

ఇటీవల జిల్లాలో వచ్చిన వర్షాలకు వరద ప్రవాహంతో అడవుల్లో ఉన్న పాములు వర దలకు కొట్టుకువచ్చి గ్రామాలపై పడ్డాయి. మరికొన్ని పాములు ఆ వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి సమీపం లోని పొలా ల్లోకి చేరాయి

బాబోయ్‌ బుస్‌..బుస్‌లు

వరదలతో అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న పాములు

కట్లపాము, రక్తపింజర, పొడ,తాచుపాములే ఎక్కువ

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రోజుకు నాలుగు నుంచి ఏడుగురు పాము కాటు బాధితులు

ఏలూరు క్రైం/ అత్తిలి, సెప్టెంబరు 15 : ఇటీవల జిల్లాలో వచ్చిన వర్షాలకు వరద ప్రవాహంతో అడవుల్లో ఉన్న పాములు వర దలకు కొట్టుకువచ్చి గ్రామాలపై పడ్డాయి. మరికొన్ని పాములు ఆ వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి సమీపం లోని పొలా ల్లోకి చేరాయి. కొల్లేరు, తమ్మిలేరు, బుడమేరు, రామి లేరు, ఏజెన్సీలో కొండవాగుల వరదలతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. వరద నీటిలో పాములు కొట్టుకువచ్చి ఊళ్ల మధ్యకు చేరాయి. ఇటీవల ఏలూరు ప్రభుత్వాస్పత్రికి రోజుకి నాలుగు నుంచి ఏడు కేసులు పాము కాటుకు గురైన వారు వస్తున్నారంటే ఈ పాములు ఏ విధంగా ప్రజల మధ్యలోకి వచ్చాయో అర్థం చేసుకోవచ్చు.పొలం పనులకు వెళ్లినవారు, పొలంలో గడ్డి కోసేవారు, గట్లపై నడిచేవారే ఎక్కువ పాముకాటుకు గురవుతున్నారు. వర్షాకాలం కావడంతో వర్షాలు పడేటప్పుడు కట్లపాములు ఇళ్లమెట్ల వద్ద పడుకుని ఉంటాయి.

రైతులు, కూలీలు.. జాగ్రత్త

వర్షాలు, వరదలతో కలుగుల్లో దాక్కున్న పాములు బయటకి వస్తున్నాయి. పొలం పనులకు వెళ్తున్న వారిని కాటేసి ప్రాణాలు బలిగొంటున్నాయి. రెండు నెలలుగా పాము కాటు బాధితులు పెరుగుతున్నారు.వరి పొలాల్లో ఎక్కువగా పాముల బెడద ఉంటుంది.రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలి.

అన్నీ విష కారకం కాదు

పాములన్నీ విషకారకం కావని వైద్య సిబ్బంది తెలిపారు. పాము కరిచిన చోట రెండు గాట్లు ఉంటే 90 శాతానికి పైబడి విషకారక పాము కాదని భావిస్తామన్నారు. పాముకాటు బాధితు లకు రక్తం వాంతులు, మలమూత్ర విసర్జన సమయంలో రక్తస్రావం, మగత ఉంటాయన్నారు. విషకారక పాము కాటుకు వెంటనే చికిత్స తీసుకోకుంటే కిడ్నీలతో పాటు శరీరంలోని ముఖ్య అవయవాలన్నీ పాడైపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందన్నారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితికి అను గుణంగా ఒకటి నుంచి నాలుగు వరకూ ఏఎస్‌వీ ఇంజక్షన్లు వేసి ప్రాణాలు కాపాడతామన్నారు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు

భూమిపైన వస్తువులను చప్పుడు చేస్తూ వెళ్ళితే ఏమైనా పాములు ఉన్నా ఆ శబ్దానికి పారిపోతాయి. సుమారు ఐదు అడుగుల పొడవు ఉన్న కర్ర ఎప్పుడూ చేతిలో ఉండాలి. పాము ఉన్న చోట చుట్టూ కందకం తవ్వాలి లేదా కళ్ల ఉప్పు మూడు రోజులకు ఒకసారి చల్లాలి. ఉప్పు పాము చర్మానికి అసౌ కర్యం కలిగిస్తుంది. తడి నేలమీద పాములు పాకిన గుర్తులు కనిపిస్తాయి. పాముల సంచారం కనిపిస్తే పక్షులు అరుస్తాయి. అలాగే కుక్కలు కూడా పాములు కనిపిస్తే సూచన చేస్తాయి. పాములు కేవలం మోకాలు ఎత్తు లేదా కొంచెం ఎక్కువ ఎత్తు వరకూ మాత్రమే చేరతాయి. పాములు తిరిగే చోట పనిచేసే వాళ్ళు మోకాళ్లపై వరకూ కప్పి ఉంచే గమ్‌షూట్‌తో పాటు మందంగా ఉండే జీన్స్‌ ధరిస్తే రక్షణ నిస్తాయి.

పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్లు ఉన్నాయి : డీఎంహెచ్‌వో

ఆకివీడు రూరల్‌ : పాముకాటుకు విరుగుడు వ్యాక్సిన్లు అన్ని ప్రాధమిక ఆసుపత్రులలో సిద్ధం ఉన్నాయని డీఎంహెచ్‌వో మహేశ్వరరావు అన్నారు. వరదల కారణంగా పాములు జనసంచారంలోనికి వస్తున్నాయి. పాము కరవ గానే కంగారు పడకుండా దగ్గరగా ఉండే ప్రాఽథమిక ఆసుపత్రికి తీసుకు వెళ్లాలి. పాము కరిచినచోట నోటితో రక్తం పీల్చడం, కాల్చడం వంటివి చెయ్యకూడదు. ఒత్తిడికి గురవ్వకుండా ప్రశాంతంగా ఉండి ప్రాఽథమిక చికిత్స పొందాలని సూచించారు. పంచాయతీలు గ్రామాలలో చెట్లు, పొదలు, తుప్పలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

గంట వ్యవధిలో తీసుకు వస్తే ప్రాణాలు కాపాడవచ్చు

– డాక్టర్‌ ఎం.సుమన్‌, అత్యవసర విభాగపు వైద్య నిపుణులు, ప్రభుత్వ ఆసుపత్రి, ఏలూరు

పాము కాటుకు గురైన వారిని నడవ నివ్వకూడదు. చేతులపైన భుజం పైన ఎత్తుకుని తీసుకురావాలి. కాటు జరిగిన ప్రదేశంలో ఎలాంటి కట్లు కట్టకూడదు. ఎన్ని గంటలకు కరిచిందో ఖచ్చితంగా సమాయాన్ని గుర్తుంచు కోవాలి. ఆస్పత్రికి రాగానే బ్లీడింగ్‌ టైమ్‌, క్లాటింగ్‌ టైమ్‌ (బీటీసీటీ) పరీక్ష నిర్వహిస్తాం.రక్తం ఎంత సమయంలో గడ్డ కడుతుందో నిముషాల్లో చూస్తాం. సాధారణంగా పది నిముషాల్లోపు గడ్డ కడితే విషం ప్రభావం అంతగా లేనట్టే. గడ్డ కట్టకుండా ఎక్కువ సమయం తీసుకుంటే విష ప్రభావం రక్తంలో కలిసి పోయిందని గుర్తించి యాంటీ స్నేక్‌ వీనమ్‌ (ఏఎస్‌వీ) వైల్స్‌ను సెలైన్‌లో కలిపి ఎక్కిస్తాం. సాధారణంగా బీటీసీటీ పరీక్ష ఆధారంగా రోజుకు పది నుంచి 20 వైల్స్‌ వరకు ఎక్కించి విషానికి విరుగుడు చేస్తాం. పాము కాటు వేసిన తర్వాత గంట వ్యవధిలోనే తీసుకొస్తే రక్తపరీక్షలు నిర్వహించి వైద్యం అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎక్కువగా కట్ల పాములు, రక్తపింజర, పొడపాములు కాటుకు గురైన వారు ఆస్పత్రికి వస్తున్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:59 AM