Share News

పట్టణాల్లో ఖాళీ స్థలాలు

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:48 AM

పట్టణాల్లో ఖాళీ స్థలాలు మునిసిపాల్టీకి గుదిబండగా మారాయి.

పట్టణాల్లో ఖాళీ స్థలాలు

మున్సిపాలిటీలకు గుదిబండ

ఆదాయం లేదు.. నిర్వహణ భారం

అందుబాటులో లేని స్థల యజమానులు

పారిశుధ్య సమస్య

పట్టణాల్లో ఖాళీ స్థలాలు మునిసిపాల్టీకి గుదిబండగా మారాయి. వర్షాకాలం మురుగునీరు చేరి దుర్గంధం వెదజల్లుతున్నాయి. చెత్తచెదారం పేరుకుపోయి పరిసర ప్రాంతాల వారికి ఇబ్బందిగా పరిణమించాయి. ఖాళీ స్థలాలపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించాలని ఆదేశాలు ఇచ్చినా ప్రయోజనం లేదు. స్థల యజమానులు అందుబాటులో లేకపోవడంతో అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేక పోతున్నారు. విదేశాల్లో ఉన్నవారు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేయడం, వారు ఇక్కడ లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఖాళీ స్థలాలతో స్థానిక సంస్థలకు ఆదాయం లేకపోగా పారిశుధ్య నిర్వహణ భారంగా మారింది.

భీమవరం టౌన్‌, సెప్టెంబరు 15: జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో వేల కొలది ఖాళీ స్థలాలు సమస్యాత్మకంగా మారాయి. వ్యర్థాలు పేరుకుపోయి, మురుగు నిల్వతో దోమలు వ్యాప్తిచెంది వ్యాధులు విజృంభిస్తున్నాయి. గతంలో ఖాళీ స్థలాలపై చర్యలు తీసుకోడానికి మునిసిపాలిటీ అధికారులు దృష్టి సారించారు. తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ పరిధిలోని పలు స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. స్థలాలను మెరక చేసుకోవాలని సం బంధిత యజమానులకు నోటీసులు ఇచ్చారు. కొంతవరకే ఫలితాలు సాధించినా తరువాత పరిస్థితి యథాతథం. ఖాళీస్థలాలు మురికి కూపాలుగా మారి పిచ్చి మొక్కలతో చిట్టి అడవులను తలపిస్తున్నాయి. రాత్రి వేళ పాముల సంచారంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురవుతున్నారు.

ఆదాయం పెంచాల్సిందే

కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఆదాయం పెంచే దిశ గా చర్యలు చేపట్టింది. పట్టణాల్లో పన్నులు సక్రమంగా వెయ్యాలని ఆదేశాలు వచ్చాయి. గతంలో సర్వేలు నిర్వహించి ఆస్థిపన్ను విధించినా ఖాళీస్థలాలపై మాత్రం చర్యలు తీసుకోలేకపోయారు. ఇప్పటికీ మునిసిపాల్టీలకు ఖాళీస్థలాలపై ఆశించన ఆదాయం రావడం లేదు. ఖాళీ స్థలాలు మెరక చేయాలని మునిసిపల్‌ అధికారులు ఆదేశించినా స్పందన లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఖాళీ స్థలాలన్నీ చెరువులను తలపించాయి. వాటి నుంచి మురుగు వెళ్లే మార్గం లేదు. వాతావరణం పొడిగా ఉన్నా పారిశుధ్య సమస్య సాధారణం. ఏమాత్రం వర్షాలు పడితే అనారోగ్య పరిస్థితులకు ఆలవాలం గా మారాయి. ఖాళీ స్థలాల్లో మురుగును పందులు ఆవాసాలుగా చేసుకుని మరింత దుర్గంధభరితం చేస్తున్నాయి.

పట్టణాల్లో సర్వే నిర్వహించి ఇప్పుడిప్పుడు ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. రీ సర్వే చేసిన మునిసిపాల్టీలల్లో యజమానులు ముందుకు వస్తున్నారు. జిల్లాలో తాడేపల్లిగూడెంలో పైలెట్‌ ప్రాజక్టుగా రీ సర్వే పూర్తిచేసారు. అక్కడ గడచిన రెండేళ్లుగా 800 స్థలాలపై పన్నులు వేశారు. దీనివల్ల మునిసిపాల్టీ ఆదాయం పెరిగింది. భీమవరంలో రీసర్వే పూర్తి చేశారు. ఇంకా పన్నులు నిర్ధారించలేదు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పన్నులు వేసే పక్రియను చేపట్టారు. జిల్లాలో మిగిలిన మునిసిపాల్టీలలో రీ సర్వే చేపట్టాల్సి ఉంది.

యజమానులు ఎక్కడ

ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయడం మునిసిపల్‌ అధికారులకు తలనొప్పిగా మారింది. రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ నుంచి సమాచారం తీసుకుని నోటీసు ఇవ్వాలని భావిస్తే కొంతమంది ఇతర దేశాల్లో ఉన్నట్లు తెలియడంతో ఇబ్బందికరంగా మారింది. అధికారులు పూర్తిస్థాయి సమాచారం తీసుకుని వారికి నోటీసులు జారీచేసే పనిలో ఉన్నారు.

బ్లాక్‌ స్పాట్‌ల గుర్తింపు

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పట్టణాలల్లో బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి చెత్త ఉన్న ప్రాంతాలను నమోదు చేశారు. ప్రస్తుతం ఖాళీస్థలాల్లో చెత్త వేస్తున్న నేపథ్యంలో వాటిని బ్లాక్‌స్పాట్‌లుగా అధికారులు గుర్తించి చర్యలు చేపడుతున్నారు. వాటికి జీపీఎస్‌ ఏర్పాటుచేసి చెత్తవెయ్యకుండా చర్యలు తీసుకున్నారు. తర్వాత వైసీపీ ప్రభుత్వ పాలనలో పారిశుధ్యం మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. పైగా చెత్త వాహనాలపేరుతో భారం మోపారే తప్ప చెత్త నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు.

Updated Date - Sep 16 , 2024 | 12:48 AM