Share News

దసరాకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీసులు

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:49 PM

దసరా పురస్కరించుకుని హైదరాబాద్‌ నుంచి జిల్లాకు ప్రయాణికులను తీసుకు వచ్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి 103 సర్వీసులను నడుపుతున్నారు.

దసరాకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీసులు

హైదరాబాద్‌ నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులు

పశ్చిమ నుంచి 4 రోజుల పాటు 40 సర్వీసులు

ఏలూరు జిల్లా నుంచి 63 స్పెషల్స్‌

రాను పోను టిక్కెట్టు బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ

భీమవరం టౌన్‌/ ఏలూరు క్రైం, అక్టోబరు 1 : దసరా పురస్కరించుకుని హైదరాబాద్‌ నుంచి జిల్లాకు ప్రయాణికులను తీసుకు వచ్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి 103 సర్వీసులను నడుపుతున్నారు.డిపోల వారీగా రోజుకు ఎన్ని బస్సులు పంపాలనే లక్ష్యాలను ఇప్పటికే నిర్థారించారు. పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులకు చర్యలు తీసుకున్నారు. అలాగే ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి 8,9,10,11 తేదీల్లో మొత్తం 63 సర్వీసులు నడపాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఏలూరు డిపోకు 26 సర్వీసులు, జంగారెడ్డిగూడెం 17, నూజువీడు డిపో నుంచి 20 సర్వీసులు నాలుగు రోజుల పాటు నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ప్రదేశాలకు ఏ విధమైన అధిక ఛార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. దసరా అయిన తర్వాత తిరుగు ప్రయాణానికి ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్‌కు వెళ్ళేందుకు ఆర్టీసీ అధికారులు 13,14 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు.

పశ్చిమ నుంచి 41 సర్వీసులు

హైదరాబాద్‌ నుంచి 41 సర్వీసులను ఏర్పాటు చేశారు. 8, 9 10, 11 తేదీత్లో డిపోల వారీగా లక్ష్యాలను నిర్ధారించారు. భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోలకు లక్ష్యాలను నిర్ణయించారు. భీమవరం డిపోకు 13, నరసాపురానికి 14, తణుకు 11, తాడేపల్లిగూడెం 3 సర్వీసులు నడపాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ వెళ్ళేందుకు కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నారు. డి పోల్లో రద్దీని బట్టి సర్వీసులను ఏర్పాటు చెయ్యనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్కింగ్‌ ఏర్పాటు చేశారు. విశాఖపట్నం నుంచి వచ్చేవారి కోసం కూడా భీమవరం, నరసాపురం డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులను నడిపేలా ఆలోచన చేశారు. రెగ్యులర్‌ సర్వీసులకు అదనంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఒకేసారి రానుపోను టికెట్లను బుక్‌ చేసుకుంటే 10 శాతం రాయితీ ఇస్తున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్ళే భక్తుల సౌకర్యార్థం మూలా నక్షత్రం నుంచి దసరా వరకు ఉమ్మడి జిల్లాలోని 7 డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపాలనే ఆలోచన చేస్తున్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:49 PM