తిరిగి వస్తామనుకోలేదు..!
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:37 AM
తిరిగి ఇంటికి వస్తామని అనుకోలేదు..కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ మాకు మరో జన్మనిచ్చారు..’’ అంటూ గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి కత్తార్ నుంచి నరసాపురం చేరుకున్న ఉండవల్లి రామలక్ష్మి, వాటాల ముత్యాల ఆరుణలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదు నెలలు గల్ఫ్‌లో నరకం చూశాం..
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దయతో ఇండియాకు వచ్చాం
నరసాపురం, సెప్టెంబరు 11: ‘‘మంచి ఉద్యోగం అంటే నమ్మి వెళ్లాం..తీరా ఆక్కడికి వెళ్లినతరువాత మోసపోయామని తెలిసింది..ఐదు నెలలు నరకం అనుభవించాం.. ఏజెంట్లను నమ్మి మోసపోవొద్దు..అన్నీ సక్రమంగా ఉంటేనే వెళ్లాలి..లేకపోతే మాలాంటి పరిస్థితే వస్తుంది.. తిరిగి ఇంటికి వస్తామని అనుకోలేదు..కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ మాకు మరో జన్మనిచ్చారు..’’ అంటూ గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి కత్తార్ నుంచి నరసాపురం చేరుకున్న ఉండవల్లి రామలక్ష్మి, వాటాల ముత్యాల ఆరుణలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కేంద్ర మంత్రి వ్యక్తిగత పీఏ పేరాల మోహన్ నివాసంలో వీరిద్దరూ విలేకర్లతో మాట్లాడారు. మా ఇంటి సమీపంలోని ఓ ఏజెంట్ కడపకు చెందిన ఇద్దరి ఏజెంట్లతో కలిసి మమ్మల్ని కత్తార్ పంపించింది. అక్కడ మంచి ఇంట్లో పని అని నమ్మించారు. తీరా వెళ్లిన తరువాత మాకు తిండీ తిప్పలు లేవు. నరకం చూపించారు. ఏజెంట్‌ను నిలదీస్తే మా ఇద్దరిని వేరే చోటకు తీసుకెళ్లి బంధిం చారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాం. జిల్లా కలెక్టర్‌తో పాటు ఆధికారులు మా సమస్యపై వెంటనే స్పందించారు. మోహన్ ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సీతారామన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపారు. కత్తార్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు, పోలీసులు వచ్చి మమ్మల్ని విడి పించి ఇండియా పంపారు. మేము మా పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని మళ్లీ చూశా మంటే నిర్మలమ్మ దయే కారణమని కన్నీరుమున్నీరయ్యారు. నిర్మలా సీతారామన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.