నాడు వద్దు.. నేడు ముద్దు
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:08 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలతో అంటకాగుతూ ప్రతిఫక్షాలను వేధించిన అధికారులకు జిల్లాలో పెద్దపీట వేస్తున్నారు. బదిలీల్లో ప్రాధాన్యత కల్పించారు.
వైసీపీలో అంటకాగిన అధికారులకు పెద్దపీట
లాఠీచార్జీలు, కేసులతో ఇబ్బందులు పెట్టిన అధికారులు
బదిలీల్లో మళ్ళీ జిల్లాలోనే పోస్టింగ్‌లు
కినుకు వహిస్తున్న టీడీపీ నాయకులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలతో అంటకాగుతూ ప్రతిఫక్షాలను వేధించిన అధికారులకు జిల్లాలో పెద్దపీట వేస్తున్నారు. బదిలీల్లో ప్రాధాన్యత కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులకు గురిచేసిన అధికారుల పేర్ల జాబితాను అధిష్ఠానానికి జార వేశారు. తెలుగుదేశం యువనేత రెడ్‌బుక్‌లోను జిల్లా అధికారుల పేర్లు నమోదు అయ్యాయి. ప్రధానంగా పోలీసుశాఖలోనే కొందరు సీఐలు, ఎస్‌ఐలు తెలుగుదేశం నాయకులను ఇబ్బంది పెట్టారు. నరసాపురం ప్రాంతంలో నేతలపై లాఠీచార్జి చేశారు. కేసులు బనాయించారు. మాజీ ఎమ్మెల్యేలు అని చూడకుండా రోడ్డుపైకి ఈడ్చేశారు. ఆనాడు అధికారపార్టీ అండదండలు ఉన్నాయన్న ఉద్దేశంతో పోలీసులు చెలరేగారు. దీనిపై అధిష్ఠానానికి జిల్లాని టీడీనీ ఇన్‌చార్జిలు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా నరసాపురంలో నియోజకవర్గ ఇన్‌చార్జిలు పొత్తూరి రామరాజు, మాజీ ఎమ్మెల్యే మధవనాయుడు పోలీస్ బాధితుల్లో ఉన్నారు. వారంతా పోలీసు, రెవెన్యూ అధికారులపై ఫిర్యాదులు చేశారు. లాఠీచార్జికి పాల్పడిన ఎస్‌ఐ పోలీస్ అఽధికారి మళ్లీ జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్నారు ఇటీవల బదిలీల్లో సదరు అధికారికి కీలకమైన మండలంలోనే పోస్టింగ్ లభించింది. తాడేపల్లిగూడెంలో ఉన్నప్పుడు కూడా అదే అధికారి తెలుగు దేశం నాయకులను ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆయనకే మళ్ళీ జిల్లాలోనే పోస్టింగ్ దక్కటంతో టీడీపీ నాయకులు కంగుతిన్నారు. పోలీస్ అధికారి దగ్గర బంధువు టీడీపీలో నియోజకవర్గంలో కీలక నేతగా ఉండటం వల్లనే పోస్టింగ్ వచ్చిందని చెబుతున్నారు. వైసీపీ కక్ష సాధింపుల్లో భాగంగా సదరు పోలీస్ అఽధికారితో తీవ్ర ఇబ్బందులు పడ్డ తెలుగు దేశం నాయకులు తాజా బదిలీలపై పెదవి విరుస్తున్నారు. నరసాపురంలో పనిచేసిన తహసీల్దార్ కూడా వైసీపీ ప్రభుత్వంలో అంటకాగారు. ఇష్టవచ్చిన రీతిలో వ్యవహరించారు. అదే తహసీల్దార్‌కు మళ్ళీ జిల్లాలో పోస్టింగ్ లభించింది. తెలుగుదేశం నాయకులు ఫిర్యాదులను పక్కన పెట్టి పోస్టింగ్‌లు ఇవ్వటంపై అదే పార్టీకి చెందిన నాయకుల్లో అసంతృప్తి నెలకొంది. వైసీపీ హయాంలో పనిచేసిన పోలీస్ అధికారులు అదే స్టేషన్‌లో ఇప్పటికీ పని చేస్తున్న సందర్భాలు ఉన్నాయి.
బదిలీల్లో లుకలుకలు
తహసీల్దార్, ఎంపీడీవో మొదలుకుని కిందిస్థాయి అధికారులు, సిబ్బంది విషయంలో ప్రజాప్రతినిధుల సిఫార్సుల కోసం వెంపర్లాడారు. లేఖలు తీసుకుని ఎవరి అధికారులు వారి శాఖల్లో సమర్పించుకున్నారు. అయితే కొందరి విషయంలో ప్రజాప్రతినిధులను కాదని పోస్టింగ్‌లు పడ్డాయి. దాంతో కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చారు. డిప్యూటీ తహసీల్దార్ల విషయంలో ఇటువంటి లుకలుకలు నెలకొన్నాయి. రాష్ట్రస్థాయి అధికారులను ప్రసన్నం చేసుకుని జిల్లాలో తాము కోరుకున్న చోట డిప్యూటీ తహసీల్దార్లుగా పోస్టింగ్‌లు వేసుకున్నారు. ఇద్దరు డీపీల విషయంలో శాసన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో కలెక్టర్ మార్పులు చేశారు. ఉండి నియోజకవర్గంలోని ఒక మండలానికి బదిలీ అయిన ఉద్యోగిని వేరే మండలాని బదిలీ చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని డి ప్యూటీ తహసీల్దార్ పోస్టింగ్ నిలిపి వేశారు. కొత్తవారి కోసం ఎదురు చూస్తున్నారు. బదిలీల విషయంలో జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కూడా తప్పటడుగులు వేశారు. ఆచంట నియోజకవర్గంలో వైసీపీకి పూర్తిగా అంటకాగిన తహసీల్దార్‌కు తీర ప్రాంతంలోని ఒక ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇచ్చారు. తన నియోజకవర్గంలోని ఒక మండలానికి రప్పించుకున్నారు. పోస్టింగ్ వచ్చింది. అదే తహసిల్ధార్ వస్తారని సిబ్బంది స్వాగతం ఏర్పాటుచేసుకున్నారు. అయితే ఆ స్థానంలో మహిళా తహసీల్దార్ చేరటంతో సిబ్బంది కంగుతిన్నారు. ఈ మార్పు రాష్ట్ర స్థాయిలోనే జరిగింది. ఆ మహిళా తహసీల్దార్‌ను వేరే చోటుకి బదిలీ చేసేందకు ఒత్తిడి చేస్తున్నారు బదిలీల్లోను ప్రజాప్రతినిధుల తప్పటగులు పైనే ప్రజల్లో చర్చసాగుతోంది.