పండుగ వేళ పట్టాలెక్కని స్పెషల్స్
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:10 AM
ముందుగానే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ప్రయత్నించినప్పటికి నిరాశే మిగిలింది. రెండు నెలల ముందుగానే టిక్కెట్‌లన్ని బుక్ అయిపోయాయి.
నరసాపురం, అక్టోబరు 1 : సాధారణంగా పెద్ద పండుగలు వస్తే ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే జిల్లావాసులంతా స్వగ్రామాలకు వచ్చేందుకు మక్కువ చూపుతారు. సంక్రాంతితోపాటు దసరా సెలవులకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈసారి పండగకు ఎక్కువ రోజులు సెలవులు రావడంతో అందరి చూపు స్వగ్రామాలపై పడింది. ముందుగానే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ప్రయత్నించినప్పటికి నిరాశే మిగిలింది. రెండు నెలల ముందుగానే టిక్కెట్‌లన్ని బుక్ అయిపోయాయి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చే లింగంపల్లి, నాగర్‌సోల్, భీమవరం మీదుగా వెళ్లే కోకనాడ, విశాఖ, ఎల్‌టీటీ, బెంగళూరు నుంచి నడిచే శేషాద్రి, చెన్నై నుంచి వచ్చే సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లు ఎప్పుడో ఫుల్ అయిపోయాయి. దీంతో ప్రయాణికులంతా స్పెషల్ రైళ్ల కోసం ఎదురు చూశారు. మూడు రోజుల క్రితం దక్షిణ మధ్య రైల్వే పెద్ద జాబితాను ప్రకటించింది. పేరుకు 600పైనే ప్రత్యేక రైళ్లు ఉన్నప్పటికీ వాటిలో జిల్లా మీదుగా వెళ్లే ఒక్క రైలు కూడా లేదు. మరోవైపు శని, ఆదివారాల్లో హైదరాబాద్, నరసాపురంల మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను కూడా రద్దు చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులంతా ఢీలా పడ్డారు. కనీసం ఒక్క రైలు కూడా జిల్లా మీదుగా నడపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే రైల్వే అధికారులు మాత్రం త్వరలో మరికొన్ని స్పెషల్ రైళ్లు ప్రకటించవచ్చుని చెప్పడం గమనార్హం. మరోవైపు ప్రైవేట్ టావెల్స్ బస్సులు కూడా ఇప్పటికే నిండుకున్నాయి.