Share News

మద్యంపై రాబందులు

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:24 AM

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌ మద్యం విధానాన్ని అమలు చేసింది. వ్యాపారం కోసమని జిల్లాలో పెద్దగా పోటీ పడ్డారు. ఽకోట్ల రూపాయలు వెచ్చించి దరఖాస్తులు వేసుకు న్నారు. షాపులు దక్కించుకు న్నారు.

మద్యంపై రాబందులు

మద్యం షాపు లైసెన్స్‌దారులకు చుక్కలు

మద్యం షాపు లైసెన్స్‌దారులకు చుక్కలు

తీర ప్రాంతంలో షాడో ఎమ్మెల్యే

వాటర్‌, డ్రింక్‌ బాటిళ్లు తాము చెప్పిన వారి నుంచే కొనుగోలు చేయాలట

20 శాతానికి ఒప్పందం కుదుర్చుకున్న మరో ఎమ్మెల్యే

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌ మద్యం విధానాన్ని అమలు చేసింది. వ్యాపారం కోసమని జిల్లాలో పెద్దగా పోటీ పడ్డారు. ఽకోట్ల రూపాయలు వెచ్చించి దరఖాస్తులు వేసుకు న్నారు. షాపులు దక్కించుకు న్నారు. వ్యాపారం సవ్యంగా చేసుకోకపోతే నష్టాలు పాలవుతామంటూ లైసెన్స్‌దారుల్లో ఒకటే గుబులు. షాపుల అద్దెకూడా చాలా ఎక్కువ. ఒక్కో చోట నెలకు లక్ష రూపాయలు వెచ్చిస్తేగానీ షాపులు లభ్యం కావడం లేదు. పట్టణాల్లో తీవ్ర పోటీ నెలకొంది. రెండేళ్లపాటు షాపులకోసం లక్షలు రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో మద్యం షాపుల కోసం వ్యాపారులు అన్ని అవస్థలు పడుతూనే మరోవైపుం ప్రతిచోట ప్రజాప్రతినిధులను కలుసుకోవాల్సి వస్తోంది. కొందరు ప్రజాప్రతినిధులు మద్యం వ్యాపారులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని తీర ప్రాంతంలో షాడో ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధి సోదరుడు చలామణీ అవుతున్నారు. తన వద్దకు వెళ్లిన మద్యం లైసెన్స్‌దారులకు వంతు ఇవ్వాలంటూ పట్టు బడుతున్నారు. రెండు కోట్ల రూపాయలు వెచ్చించి దరఖాస్తు చేసుకుంటే రెండు షాపులు వచ్చాయని, నష్టపోతామని చెప్పినా వినిపించు కోలేదు. ఇతరులు ఎలా ఇస్తే తమకూ అలాగే లాభాలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. పైగా మద్యం విక్రయాల్లో అవసరమయ్యే వాటర్‌ బాటిళ్లు, డ్రింక్‌ బాటిళ్లు కూడా తాము సూచించే వ్యాపారుల నుంచే కొనుగోలు చేయాలంటూ స్పష్టం చేశారు. ఇది విని మద్యం లైసెన్స్‌ దారులు షాకయ్యారు. ఇప్పుడు షాడో ఎమ్మెల్యే గురించి నియోజకవర్గంలో అంతా చర్చించుకుంటున్నారు.

అందరి నోటా ఆ ఎమ్మెల్యే..

జిల్లాలో మరో ఎమ్మెల్యే అందరి నోటా నానారు. మద్యం షాపుల కోసం ధరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి వ్యాపారులు ముందుగా తనకు తెలియచేయాలంటూ ఆదేశించారు. ఎవరు వెళ్లి కలిసినా వ్యాపారంలో తమకు భాగస్వామ్యం ఇవ్వాలంటూ సూచించేవారంటూ జిల్లావ్యాప్తంగా ప్రచారమైంది. సదరు నియోజకవర్గంలో తక్కువగా దరఖాస్తులు వేయడానికి ఎమ్మెల్యే కారణమంటూ అంతా గుసగుసలాడుకుం టున్నారు. తీరా షాపులు లభించాక వెళ్లిన వ్యాపారులకు భాగస్వామ్యం ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశారంటూ అంతా ఘొల్లుమన్నారు. చివరకు అవేమీ లేకుండానే అందరూ షాపులు ప్రారంభించారు. అమ్మకాలు నిర్వహిస్తున్నారు. చివరకు వ్యాపారాలు ఎలా ఉంటాయంటూ అక్కడ ఆందోళన నెలకొంది. మొత్తంపైన సదరు ప్రజాప్రతినిధి మద్యం వ్యాపారంలో పెద్ద చర్చనీయాంశంగా మారారు. అయితే సదరు నియోజకవర్గంలో అందరూ లైసెన్స్‌దారులు షాపులు తెరవడంతోపాటు, అమ్మకాలు సజావుగా నిర్వహిస్తున్నారు.

20 శాతానికి ఒప్పందం కుదుర్చుకున్న ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లాకు సరిహద్దుగా ఉన్న మరో ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో షాపులన్నింటిలో 20శాతం భాగస్వామ్యం ఉండేలా ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగా పెట్టుబడి చేశారు. అయితే లైసెన్స్‌దారులు మాత్రం రూ.50 లక్షలు వెచ్చించి ఒక్కో షాపు దక్కించుకున్నారు. దాదాపు 25 దరఖాస్తులకు ఒక షాపు లభించింది. ఆ వ్యయం లేకుండానే ఎమ్మెల్యే 20శాతం వంతు తీసుకున్నారు. లైసెన్స్‌ ఫీజును మాత్రమే తన వంతుగా చెల్లించేలా వ్యాపారులతో సయోధ్య కుదిరింది. మద్యం వ్యాపారులు కూడా అందుకు అంగీకరించారు. దీంతో నియోజకవర్గంలో అందరు లైసెన్స్‌దారులు ఒక్క తాటిపైకి వచ్చారు. అనసవర పోటీ లేకుండా మద్యం విక్రయించుకోవాలని నిర్ణయించారు.

భీమవరంలో కుదరని సయోధ్య

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మద్యం వ్యాపారుల్లో సయోధ్య ఏర్పడింది. లేదంటే పీకల్లోతు నష్టపోతామంటూ ఆందోళన ఉంది. అదే ఇప్పుడు అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేలా చేసింది. కొందరు లైసెన్స్‌దారులు రెండేళ్లపాటు షాపులు నిర్వహించలేమంటూ అమ్మకానికి పెడు తున్నారు. గుడ్‌ విల్‌ తీసుకుని షాపులను ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వం 20 శాతం కమీషన్‌ ఇస్తామని ప్రకటించడంతో పోటీ పడి దరఖాస్తులు వేశారు. ఐదేళ్లపాటు వ్యాపారాలు లేవు. ఇప్పుడు మద్యం వ్యాపారంపై కొత్త వారు కూడా ఆసక్తి చూపారు. నేతలను సంప్రదింపులు జరిపి అన్ని నియోజకవర్గాల్లో ఒక్కటయ్యే ప్రయత్నం చేస్తున్నారు. భీమవరంలో మాత్రం ఇప్పటికీ ఒక తాటిపైకి రాలేదు. మంతనాలు సాగుతున్నాయి. మరోవైపు రూ.99లకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి వస్తోంది. జిల్లాలో 175 షాపులుంటే దాదాపు 100 షాపులకు తక్కువ ధర మద్యం అందుబాటులోకి తెచ్చారు. మున్ముందు అందరికీ అందుబాటులోకి రానుంది. అంతకంటే నాణ్యత తక్కువగా ఉండే మద్యం వైసీపీ హయాంలో రూ.150 వరకు విక్రయిం చారు. ఇప్పుడు ధర తగ్గడంతో వినియోగం పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఇదొక్కటే ఇప్పుడు మద్యం వ్యాపారుల్లో ఆశాదీపంగా ఉంది.

Updated Date - Oct 21 , 2024 | 12:24 AM