Share News

కొల్లేరు వరద తగ్గుముఖం

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:48 AM

కొల్లేరు వరద ఉధృతి కొద్దిమేరకు తగ్గినా గ్రామాలను వరద చుట్టుముట్టే ఉంది. కొద్దిమేరకు ఉధృతి తగ్గడంతో కైకలూరు–ఏలూరు ఆర్‌అండ్‌బీ రహదారిలో రాకపోకలు పునరుద్ధరించారు. వరద తగ్గిన ప్రదేశాల్లో గ్రామాల్లో అధికారులు శానిటైజేషన్‌ పనులు చేపట్టారు.

కొల్లేరు వరద తగ్గుముఖం
కైకలూరు మండలం గోకర్ణపురం– పైడిచింతపాడు రోడ్డుపై కొల్లేరు ఉధృతి

ఇంకా జలదిగ్బంధంలోనే రహదారులు

కైకలూరు–ఏలూరు రాకపోకల పునరుద్ధరణ

కైకలూరు, మండవల్లి, సెప్టెంబరు 15 : కొల్లేరు వరద ఉధృతి కొద్దిమేరకు తగ్గినా గ్రామాలను వరద చుట్టుముట్టే ఉంది. కొద్దిమేరకు ఉధృతి తగ్గడంతో కైకలూరు–ఏలూరు ఆర్‌అండ్‌బీ రహదారిలో రాకపోకలు పునరుద్ధరించారు. వరద తగ్గిన ప్రదేశాల్లో గ్రామాల్లో అధికారులు శానిటైజేషన్‌ పనులు చేపట్టారు. అంటు వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలను చేపట్టారు. మండవల్లి మండలంలోని పెనుమాకలంక, పెద్దఎడ్లగాడి, ఇంగిలి పాకలంక, నందిగామలంక, చింతపాడు, మణుగులూరు, కొవ్వాడలంక గ్రామాలు ముంపు నుంచి బయట పడలేదు. కైకలూరు మండలంలో కొల్లేరు లంక గ్రామాల రహదారులు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఆయా గ్రామాల నుంచి ప్రజలు పడవల్లో ప్రయాణాలే కొన సాగిస్తున్నారు. వడ్లకూటితిప్ప, కొట్టాడ, జంగంపాడు, పల్లిపాలెం, పందిరిపల్లిగూడెం, శృంగ వరప్పాడు, చటకాయ, నత్తగుళ్లపాడు గ్రామాలను వరద చుట్ట ముట్టిఉంది. వడ్లకూటి తిప్ప, పెంచికలమర్రు మధ్యలో, సర్కారు కాల్వ వద్ద నుంచి పందిరిపల్లిగూడెం వరకు ఉన్న రహదారిలో వరద ఉధృతికి రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయి పెద్దపెద్ద గండ్లు ఏర్పడ్డాయి. గోకర్ణపురం– పైడిచింతపాడు రహదారిలోనూ గండ్లు ఏర్పడడంతో రెండు గ్రామాల మధ్యన ప్రజలు కొల్లేరులో నాటు పడవలపై ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

తగ్గుతున్న గోదావరి నీటిమట్టం

పోలవరం/బుట్టాయగూడెం, సెప్టెంబరు 15 : కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ దోబూచులాడిన గోదావరి నీటిమట్టం ఆదివారం నాటికి తగ్గుముఖం పట్టింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన గోదావరి నీటిమట్టం 31.510 మీటర్లు , దిగువన 22.800 మీటర్లు నమోదైనట్టు ఈఈ మల్లికార్జునరావు తెలిపారు. స్పిల్‌వే నుంచి 7,58,919 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు. గోదావరి నీటిమట్టం తగ్గి కడెమ్మ స్లూయిజ్‌ గేట్లు వరద నీటి నుంచి బయటపడడంతో ఏటిగట్టుకి కుడివైపున ఉన్న పంటపొలాలు వరద జలాల నుంచి బయటపడ్డాయి. రైతులు ఇతర ప్రాంతాల నుంచి వరి నారు తెచ్చి ఊడ్పు లకు సమాయత్తమవుతున్నారు. ఎల్‌ఎన్‌డీపేట కొవ్వాడ రిజర్వాయర్‌ వద్ద నీటిమట్టం 89.80 మీటర్లు నమోదు కాగా 120 క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల చేసినట్టు సిబ్బంది తెలిపారు.

జల్లేరు జలాశయం గేట్ల ఎత్తివేత

బుట్టాయగూడెం మండలంలోని శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జల్లేరు జలాశయం గేట్లను ఎత్తి ఆదివారం 110 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు ఇరిగేషన్‌ ఏఈ సురేష్‌ తెలిపారు. మూడు రోజులుగా ఏజెన్సీలో వర్షాలు కురవకపోయినా అటవీ ప్రాంతం లోని కొండవాగుల నుంచి ఊటనీరు 150 క్యూసెక్కుల వరకు జలాశయంలోకి వస్తున్నట్టు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 217.80 ఎంటీఎస్‌ కాగా ప్రస్తుతం 215 ఎంటీఎస్‌గా ఉందని ముందు జాగ్రత్త చర్యగా 110 నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. వాగుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:48 AM