Share News

పరిహారం.. ఫలహారం

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:21 AM

ఐదేళ్లు ఎటు చూసినా అరాచకమే. ఉన్నోడైనా లేనోడైనా వారి చేతిలో నిలువు దోపిడీ. ఎక్కడ వీలైతే అక్కడ చేతికందినకాడికి నొక్కేశారు.

పరిహారం.. ఫలహారం

వైసీపీ ఐదేళ్ల అక్రమాలపై సీఎంకు జనసేన ఫిర్యాదు

నివేదిక ఇచ్చిన నేతలు

ప్రభుత్వ భూముల్లో లీజు బాగోతం

ఐటీడీఏలో అక్రమాల ప్రస్తావన

విచారించి నిగ్గు తేల్చాలని విన్నపం

త్వరలో సర్కారు నిర్ణయం

ఐదేళ్లు ఎటు చూసినా అరాచకమే. ఉన్నోడైనా లేనోడైనా వారి చేతిలో నిలువు దోపిడీ. ఎక్కడ వీలైతే అక్కడ చేతికందినకాడికి నొక్కేశారు. అధికారులను మీకింత మాకింత అంటూ దారికి తెచ్చుకుని మరీ ఇష్టానుసారం వ్యవహరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన వారినీ విడిచి పెట్టలేదు. అంతా మేమే చేస్తామని నమ్మబలికి సొమ్ములను అడ్డంగా కాజేశారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు సృష్టించారు. గిరిజన, గిరిజనేతర కుటుంబాలను వంచించిన తీరుపై ఐదేళ్లు కొనసాగిన దురాగతాలు, అక్రమాలు, అవినీతిపై నిగ్గు తేల్చాల్సిందిగా తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన నేతలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సర్కారు విచారణకు ఆదేశాలు జారీ చేయనుంది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

పోలవరం నిర్వాసిత కుటుంబాలకు ఉద్దేశించిన సహాయం, పునరావాసం(ఆర్‌అండ్‌ఆర్‌) కింద గడిచిన రెండున్నర దశాబ్దాలుగా గిరిజన, గిరిజనేతరులతో ఓ ఆటాడుకున్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసేందుకు నిర్దేశిత ముంపు గ్రామాల్లో కుటుంబాలను తరలించేందుకు సిద్ధపడ్డారు. 2006 నుంచే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎదురు తిరిగిన.. నిలదీసి ప్రశ్నించినా కేసులు పెట్టారు. రాజకీయాల్లో ఆరితేరిన వారు బీద బిక్కి జనాన్ని బెదిరించారు. వారికి తోడుగా నిలిచిన వామపక్ష నేతలను వదిలిపెట్టలేదు. ఆది నుంచి నిర్వాసిత కుటుంబాలన్నీ జీవనపోరాటం చేస్తూనే వచ్చాయి. పోలవరం కోసం త్యాగాలకు సిద్ధపడింది ఇందుకేనా అంటూ నిలదీసిన వారిలో అత్యధికులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఎక్కడిక క్కడ రాజకీయ దళారులు పుట్టుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లి, ఇతర మండలాల్లో గడిచిన ఐదేళ్ల పాటు జరిగిన అవకతవకలు లెక్కలేనన్ని. వీటిపైనే తాజాగా ఎన్నికైన పోలవరం ఎమ్మెల్యే సిర్రి బాలరాజు, జనసేన సీనియర్‌ నేత కరాటం రాంబాబు నేరుగా చంద్రబాబును కలిసి గడిచిన ఐదేళ్లలోనూ, అంతకు ముందు అధికారులే కాకుండా వైసీపీ నేతలు ఏ రూపంలో నిర్వాసితులకు చెందిన పరిహారాన్ని.. ఫలహారంగా మేసేశారో సవివరంగా సీఎంకు నివేదించారు.

అంతటా మోసం.. దగా..

కేఆర్‌ పురం ఐటీడీఏ పరిధిలోని మండలాల్లో సహాయ పునరావాస పథకం కింద ఆర్‌అండ్‌ఆర్‌ దశాబ్దాల క్రితమే నిర్వాసితులకు పూర్తిగా పరిహారం అందించేందుకు కేంద్ర, రాష్ట్రాలు నిధులు సమకూర్చాయి. 2019–24 మధ్య అధికారం లో వున్న వైసీపీ నేతలు నిర్వాసిత కుటుంబాలతో చెడుగుడు ఆడేందుకు ప్రయత్నించారు. పరిహారం రెట్టింపు చేసి ఇస్తామని, వివాహం కాని నిర్వాసితులను ఆదుకుంటామని నమ్మబలికారు. ప్రత్యేకించి జీవోలు జారీ చేశారు. వీటి అమలుకు పైసా రాలేదు గాని అందరికీ ఇచ్చేసినట్లు ఫోజు కొట్టారు. ఐటీడీఏ పరిధిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగా యని ఇంతకు ముందే అక్కడ పనిచేసిన పలువురు పీవోలు, కార్యాలయ సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణ పేరిట అప్పటికప్పడే స్పందించడం, తరువాత గాలికొదిలేయడం వంటి పరిణామాలు చోటు చేసు కున్నాయి. దర్భగూడెం గ్రామ పరిధిలో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు నమ్మించి కొందరి ఖాతాలకు నిధులు కేటాయించారు. తరువాత అక్కడికక్కడ డమ్మీ నోటీసులు ఇచ్చి ఆ సొమ్ము తమ ఖాతాల్లోకి చేర్చుకునేలా మరికొందరు అక్రమా లకు పాల్పడ్డారు. ఈ తరహాలో దాదాపు రూ.150 కోట్లు దారి మళ్లినట్లు అప్పట్లోనే విమర్శలు గుప్పుమన్నాయి. ఇంకొ వైపు చేతికందినంతా దోచుకునేందుకు వైసీపీ నేతలు అప్పట్లో తెగించి వ్యవహరించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా కాటంనేని భాస్కర్‌ అప్పట్లో ఆర్‌అండ్‌ఆర్‌ పనుల్లోకి రాని భూమి ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉందో తేల్చి నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. అయినా కొన్ని భూముల్లో అసలు యజమానులు వీరేనంటూ అప్పట్లోనే కొందరు డమ్మీలను రంగంలోకి దింపారు. అనంతరం జగన్‌ ప్రభుత్వ హయాంలో చేతికి అందినకాడికి నొక్కేసి అక్రమాలకు పాల్పడ్డారు. అక్రమాలపై పెద్దఎత్తున ఫిర్యాదులు అందినా విచారించి, నిర్ధారించే యంత్రాంగం లేక పెండింగ్‌లో పడేశారు. ఐటీడీఏ వ్యవహారం చెప్పలేనంతగా రచ్చకెక్కింది. వైసీపీ అనుకూలురకు ఒక విధంగా, వ్యతిరేకులుంటే మరో విధంగా వ్యవహరించారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు అందిన ఫిర్యాదులో జనసేన స్పష్టంగా పేర్కొంది. ప్రత్యేకించి దర్భగూడెం పరిధిలో అనేక అవకతవకలు బహిర్గతమయ్యా యి. అధికారుల మాయజాలంతో మాత్రం ఎక్కడికక్కడి విషయాన్ని నొక్కి పెట్టి ఉంచారు.

లీజులో లిటిగేషన్‌

ప్రాజెక్ట్‌ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో సాధ్యమైనంత మేర పరిహారం చెల్లించి ఆయా భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ భూముల్లో సాగు, ఇతరత్రా ఏవీ చేపట్టరాదని కచ్చితమైన ఆంక్షలు పెట్టారు. దాదాపు 3750 ఎకరాల్లో భూసేకరణ పూర్తయినా వైసీపీ ప్రభుత్వ హాయాంలో కొం దరు నేతలు దళారులుగా మారారు. ఆయా భూములను కొందరికి లీజుకు ఇచ్చి మరీ సొమ్ములు రాబట్టుకున్నారు. అధికారులెవరూ ఈ వైపు రాకుండా చూసుకుంటాం. మీరు పండించుకోండి, పంటను జాగ్రత్త చేసుకోండి, మాకైతే ఎకరానికి ఇంత చెల్లిస్తే ఇదంతా సాధ్యం అంటూ వల విసిరారు. మూడో కంటికి తెలీయ కూడదు. పేర్లు చెప్పకూడదంటూ రాజకీయ దళారులు నిర్వాసిత కుటుంబాలకు షరతు విధించారు. భూసేకరణ లో భూమి, ఊరిపై పూర్తి హక్కు కోల్పోయిన తరువాత వారందరికీ జీవనాధారం కోసం భూమికి భూమి, ఉండడానికి కాలనీలు నిర్మించారు. అయినా గ్రామాలను ఖాళీ చేయడానికి ఇష్టపడిన వారంతా కోల్పో యిన భూములనే లీజు తీసుకుని పంట వేయడానికి తలొగ్గారు. దీనితో దళారుల పంట పండింది. వేలాది ఎకరాల్లో ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల చొప్పున లీజు సొమ్ము రాబట్టి కోట్లాది రూపాయలు దండుకున్నారు. దీనిలో వైసీ పీ నేతలంతా భాగస్వామ్యం దక్కించుకున్నారు. లీజు రూపంలో అక్రమాలు వెలు గుచూసినా యంత్రాంగం మాత్రం మాకేం తెలియదు.. అన్నట్లు వ్యవహరించింది. ఈ విషయాలన్నింటి పైనా సీఎంకు ఇచ్చిన నివేదికలో పొందుపర్చారు.

విచారణ భయం

జనసేన నేతలు కోరినట్లు ఆర్‌అండ్‌ఆర్‌లో అక్రమాలు, లీజు వసూళ్లలో అవినీతి ఐటీడీఏ పరిధిలో ఐదేళ్ల పాటు సాగిన డమ్మీ వ్యవహారాలపై ప్రభుత్వ విచారణ జరుగుతుందని కొందరికి భయం పట్టుకుంది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. సహాయ, పునరావాస అక్రమాలపై వైసీపీ హయాంలో దళారుల చేతి వాటం, కొమ్ము కాసిన నాయకులపై విచారణకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు అందుతుండడంపై వైసీపీలో కొందరు బిక్కుబిక్కుమంటున్నారు.

Updated Date - Oct 02 , 2024 | 12:21 AM