వంట గ్యాస్‌కు వరద దెబ్బ
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:36 AM
వంట గ్యాస్‌పైనా వరద ప్రభావం పడింది. ఇండేన్ గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతోంది. విజయవాడ వరదల కారణంగా కొండపల్లి యూనిట్ నుంచి రావాల్సిన గ్యాస్ నిలిచిపోయింది. ఒకరోజు ప్లాంట్‌ను మూసివేశారు. ప్రస్తుతం కొండపల్లి నుంచి ఏలూరు వరకు సరఫరా చేస్తున్నారు.
ఇండేన్ గ్యాస్ సరఫరాలో అంతరాయం
కొండపల్లి నుంచి నిలిచిన రాకపోకలు
పరవాడ నుంచి జిల్లాకు గ్యాస్ పంపిణీ
మూడు రోజుల్లో సమస్యకు చెక్
(భీమవరం–ఆంధ్రజ్యోతి):
వంట గ్యాస్‌పైనా వరద ప్రభావం పడింది. ఇండేన్ గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతోంది. విజయవాడ వరదల కారణంగా కొండపల్లి యూనిట్ నుంచి రావాల్సిన గ్యాస్ నిలిచిపోయింది. ఒకరోజు ప్లాంట్‌ను మూసివేశారు. ప్రస్తుతం కొండపల్లి నుంచి ఏలూరు వరకు సరఫరా చేస్తున్నారు. మన జిల్లాకు విశాఖలోని పరవాడ నుంచి సరఫరా చేసే లా కంపెనీ చర్యలు తీసుకుంది. భీమవరంలో బుక్ చేసిన మూడు రోజులకు గ్యాస్ అందిస్తున్నారు. తాడేపల్లిగూ డెం పరిధిలో కొన్ని ఏజన్సీల్లో మరికాస్త ఆలస్యమవుతోంది. సెప్టెంబరు 15 వరకు ఈ సమస్య ఉంటుంది. ఆ తర్వాత యథావిధిగా కొండపల్లి నుంచి సరఫరా అవుతుంది. ఎప్పటిలానే బ్యాక్‌లాగ్ లేకుండా గ్యాస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇండేన్ గ్యాస్ కాస్త ఆలస్యం కావడంతో ప్రజల్లో ఆందోళన ఏర్పడింది. జనం ఒకేసారి గ్యాస్ బుకింగ్‌కు ఎగబడుతున్నారు. ఆ కారణంగా బ్యాక్‌లాగ్ ఏర్పడుతోంది. విజయవాడ వరదల కారణంగా కొండపల్లి నుంచి రవాణా లేక లారీలు తిరగలేదు. దీంతో ఇబ్బందులు తలెత్తాయి. తాజాగా పరవాడ నుంచి గ్యాస్ రప్పిస్తున్నారు. మరో మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు జిల్లా అధికారులకు తేల్చి చెప్పారు. జిల్లాలో 42 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా, ఇందులో 20 ఇండేన్ కంపెనీవి. వీటికి 2,82,175 కనెక్షన్‌లు వున్నాయి. హెపీసీఎల్ కంపెనీ పరిధిలో 18 ఏజన్సీలకు 2,72,318 కనెక్షన్‌లు, బీపీసీఎల్‌కు నాలుగు ఏజెన్సీలకు 67,133 కనెక్షన్‌లు ఉన్నాయి. ప్రతిరోజు జిల్లాకు 15 వేలు గ్యాస్ సిలెండర్‌లు అవసరం. కొంత మంది గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. ఇంటికి గ్యాస్ పంపితే ఖాళీ సిలెండర్ లేదంటూ తిప్పి పంపుతున్నారు. ఇలా అన్ని రకాల సమస్యలు ఒకేసారి డీలర్లు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ కొరత లేదు. కేవలం వరద కారణంగానే సమస్య ఏర్పడింది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు.