అక్కడికి మేం రాం.. ?
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:21 AM
నరసాపురం పురపాలక సంఘంలోని టౌన్ ప్లానింగ్ అంటే చాలు.. ఉద్యోగులు హడలెత్తిపో తున్నారు. ఇక్కడికి వచ్చేందుకు ఎవరూ ఇష్ఠపడడం లేదు, కనీసం సస్పెండ్ అయిన ఉద్యోగులు కూడా మేం అక్కడికి వెళ్ళమంటూ దాటేస్తున్నారు.
‘నరసాపురం టౌన్ ప్లానింగ్’ అంటే ఉద్యోగులు హడల్
సెక్షన్‌లో ఉండాల్సింది ఆరుగురు
ఏడేళ్లుగా ఇద్దరు ముగ్గురుతోనే విధులు
అన్నీ నిబంధనలకు విరుద్దంగా పనులు
ప్రస్తుతం సూపర్‌వైజర్ ఒక్కరే, సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నాలు
నరసాపురం పురపాలక సంఘంలోని టౌన్ ప్లానింగ్ అంటే చాలు.. ఉద్యోగులు హడలెత్తిపో తున్నారు. ఇక్కడికి వచ్చేందుకు ఎవరూ ఇష్ఠపడడం లేదు, కనీసం సస్పెండ్ అయిన ఉద్యోగులు కూడా మేం అక్కడికి వెళ్ళమంటూ దాటేస్తున్నారు. ఫలితంగా ఏడేళ్ల నుంచి ఈ సెక్షన్‌లో చాలా పోస్టులు ఖాళీగా ఉంటున్న పరిస్థితి దాపురించింది.
నరసాపురం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నరసాపురం టౌనింగ్ సెక్షన్ ఇంకా దిగజారిపోయింది, కొంత మంది నేతల అండదండలతో నిర్మాణదారులు నిబంధనలన్నీ తుంగలోకి తొక్కి అడ్డగోలుగా భవనాలు కట్టారు. ఇరుకు సందుల్లో పెద్దపెద్ద భవనాలు వెలిశాయి. ఇక అపార్టుమెంట్లు కూడా నిబంధనలు పాటించలేదన్న వాదనలు లేకపో లేదు. ఈ నేపథ్యంలో గడిచిన ఐదేళ్లలో జరిగిన నిర్మాణాలను చూసి ప్రస్తుతం ఎవరూ మునిసిపాల్టీకి వచ్చేందుకు సాహసించడం లేదు. ఫలితంగా ప్రస్తుతం ఒక్కరు మాత్రమే ఈ సెక్షన్‌లో పని చేస్తున్నారు. ఆయన కూడా సూపర్‌వైజర్ కేడర్ అధికారి, ఇక్కడ పరిస్థితుల్ని గమనించిన ఆయన కూడా సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఈ సెక్షన్ అంతా ఖాళీ అవ్వడం ఖాయమన్న వాదనలు లేకపోలేదు.
12 కిలోమీటర్ల మేర పట్టణ విస్తరణ
పన్నెండు కిలోమీటర్ల మేర పట్టణ పరిధి విస్తరించింది. 31వార్డుల పరిధిలో సుమారు 18 వేల వరకు నివాసాలు ఉన్నాయి. ఏటా భవన నిర్మాణాలకు 140 దరఖాస్తులు వస్తాయి. వీటిలో 125 ఽమంది వరకు ఇళ్లు కడతారు. మునిసిపల్ స్థాయికి అనుగుణంగా ఇక్కడ ఇక టీపీవో, ఒక సూపర్‌వైజర్, నలుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. గత ఐదేళ్ళల్లో ఇక్కడ ఈ పోస్టులు ఒక్కసారి కూడా భర్తీ కాలేదు. కీలకమైన టీపీవో వచ్చినా.. ఒకటి రెండేళ్లు మించి ఉండడం లేదు. ఏడాదిక్రితం ఇక్కడికి వచ్చిన టీపీఎస్ రామచంద్రపురానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్టు ఖాళీగా ఉంది. గతంలో కూడా సూపర్‌వైజర్ ఇన్‌చార్జిలే కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఉన్న సూపర్‌వైజర్‌ను కూడా ఒక ప్రజాప్రతినిధి ఒప్పించి తీసుకొచ్చారన్న వాదనలు లేకపోలేదు.
అన్నీ ఫిర్యాదులే..
పట్టణ పరిధిలో ఇళ్ల నిర్మాణాలకు టౌన్‌ప్లానింగ్ కొన్ని నిబంధనలను నిర్ధేశిస్తుంది. దానికి అనుగుణంగా నివాసాలు చేపట్టాలి. ముందుగా ప్లాన్ అనుమతి తీసుకోవాలి. అయితే ఈ పురపాలకంలో తీసుకున్న ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టరనే వాదనలు ఉన్నాయి. వీటితోపాటు పెట్టిన ప్లాన్, కట్టే నిర్మాణానికి పొంతన ఉండదన్న ఆరోపణలు లేకపోలేదు. సాధారణంగా ఇరుకు రహదార్లలో మూడు నాలుగు అంతస్తులకు అనుమతి ఉండదు. కానీ ఇక్కడ ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక పెద్ద పెద్ద భవనాలు నిర్మించేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. కచ్చితంగా సెట్ బ్యాక్ ఉండాలి. కానీ ఇక్కడ చాలా ఇళ్లకు ఇది కనిపించదన్న వాదనలు కూడా ఉన్నాయి. ఈ నిబంధనలన్నీ ఇక్కడ పని చేసే ఆధికారులు ప్రశ్నించకూడదు. ఒకవేళ నిలదీస్తే ఆ ఉద్యోగిపై అన్నిశాఖలకు ఫిర్యాదులు పెడతారు. ఈ కారణంగా గతంలో ఇక్కడ పని చేసిన చాలామంది ఆధికారులు ఛార్జీ మెమోలు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే పోస్టింగ్‌లో ఇచ్చే డైరెక్టర్ కార్యాలయంలోనే నరసాపురం మునిసిపాల్టీ అంటేనే రాష్ట్రవ్యాప్తంగా ఓ ముద్రపడి పోయిందన్న వాదనలు ఆ ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. అందుకే ఇక్కడ పని చేసేందుకు ఎవరూ రావడం లేదని చెబతుంటారు.