జూనియర్ కళాశాలలకు ‘దసరా’ముసురు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:53 PM
విద్యాసంస్థలకు దసరా సెలవుల విషయంలో వివాదం నెలకొంది. ఇంటర్ విద్యను భోదించే జూనియర్ కళాశాలలకు ఈ నెల 3నుంచి 13 వరకు దసరా సెలవుల నిమిత్తం రాష్ట్రమంతటా ఒకే విధానం అమలు చేయాలని ఇంటర్‌బోర్డు ఆదేశాలు జారీచేయగా, జిల్లాలోమాత్రం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు వేర్వేరు పద్ధతులను పాటిస్తుండటమే దీనికి కారణం.
రేపటి నుంచి ప్రభుత్వ కళాశాలలకు సెలవులు
మూడు రోజులపాటు ప్రైవేటు కళాశాలలకు అనుమతులపై దుమారం
ఏలూరు అర్బన్, అక్టోబరు 1 : విద్యాసంస్థలకు దసరా సెలవుల విషయంలో వివాదం నెలకొంది. ఇంటర్ విద్యను భోదించే జూనియర్ కళాశాలలకు ఈ నెల 3నుంచి 13 వరకు దసరా సెలవుల నిమిత్తం రాష్ట్రమంతటా ఒకే విధానం అమలు చేయాలని ఇంటర్‌బోర్డు ఆదేశాలు జారీచేయగా, జిల్లాలోమాత్రం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు వేర్వేరు పద్ధతులను పాటిస్తుండటమే దీనికి కారణం. ఇంటర్‌బోర్డు నిర్ణయం ప్రకారమే గురువారం నుంచి 13 వరకు దసరా సెలవులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వర్తింప జేస్తుండగా, దీనికి భిన్నంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో తరగతులు నిర్వహించుకోవడానికి ప్రైవేటు కళా శాలల యాజమాన్యాలు చేసుకున్న అభ్యర్థనకు జిల్లా అధికారులు అంగీకారం తెలపడంపై అటు విద్యార్థుల్లోను, ఇటు జూనియర్ లెక్చరర్లలోను తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏలూరు జిల్లాలో ప్రభుత్వ ఆదీనంలోని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, కేజీబీవీ, హైస్కూల్ ప్లస్, ఎయిడెడ్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మొత్తం 64 ఉండగా, వీటిలో 7473 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ప్రైవేటు జూనియర్ కళాశాలలు మొత్తం 81 ఉండగా, వీటిలో 28,457 మంది విద్యనభ్యసిస్తున్నారు. వాస్తవానికి దసరా సెలవులను ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నీ పాటించాల్సిందే. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థుల పట్ల ఇంటర్‌బోర్డు వ్యత్యాసం చూపిస్తుందనడానికి దసరా సెలవులే నిదర్శ నమని ఏపీ ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు డి.అంబేడ్కర్ ధ్వజ మెత్తారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఇంటర్‌బోర్డు అమ్ముడుపోయిందని ఆరోపించారు. దసరా సెలవుల్లో ప్రైవేటు కళాశాలలు నిర్వహించుకోవడానికి ఇంటర్ బోర్డు ఇచ్చిన అనుమతులను రద్దుచేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
వరదలు, వర్షాల వల్ల కోల్పోయిన తరగతుల రికవరీ కోసమే..
జిల్లాలో ప్రైవేటు జూనియర్ కళాశాలలకు దసరా సెలవుల్లో మూడు రోజులపాటు తరగ తులు నిర్వహించుకోవడానికి అనుమతులి వ్వడంపై ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాంతీ య పర్యవేక్షణాధికారి చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు. ‘ ఇటీవల భారీవర్షాలు, వరదల వల్ల కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు కాంపన్సేటరీ సెలవులను ప్రకటించారు. ఈ సెల వులు ఆరువరకు ఉన్నాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వ సెలవుదినాల్లో పరిహారంగా విద్యాసంస్థలు పనిచేయాల్సిఉంటుంది. దీనికను గుణంగానే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇంటర్‌బోర్డు ఉన్నతాధికారులను అభ్యర్థించగా అంగీకరించారు. ఈ వెసులుబాటు కేవలం తుపాను లేదా భారీ వర్షాల ప్రభావిత జిల్లాలకు మాత్రమే వర్తించేలా అంగీకారం తెలిపారు.’ అని వివరించారు. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల విషయమై జిల్లా వృత్తి విద్యాశాఖాధి కారి (డీవీఈవో) ప్రభాకరరావు వివరణ ఇస్తూ ‘ ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసేలోగా మిగతా సెలవు దినాల్లో ప్రభుత్వ కళాశాలలు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వ షెడ్యూలు ప్రకారమే ఈ నెల 3నుంచి 13 వరకు అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశా లలకు దసరా సెలవులు వర్తిస్తాయి.’ అని తెలిపారు.