Share News

ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:33 AM

ఏలూరులోని సీఆర్‌ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సీఎం చంద్రబాబు నాయుడు బాధితులతో ముఖాముఖి సంభాషించారు. ఉప్పుటేరులో రెగ్యులేటర్‌ నిర్మాణంపై సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తాం. కాల్వలు, డ్రెయిన్లలో తూడు, గుర్రపు డెక్కను తొలగిస్తామని సీఎం చంద్రబాబు బాధితుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌
సీఆర్‌ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సీఎం చంద్రబాబు నాయుడు బాధితులతో ముఖాముఖి

ఏ రైతుకు నష్టం కలుగనివ్వం

కాలువల్లో తూడు, గుర్రపుడెక్క తొలగిస్తాం

కొల్లేరుపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం

బాధితులతో సీఎం చంద్రబాబు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

భారీ వర్షాలు వరదల కారణంగా ఎంతో నష్టపోయాం. మీమీద ఎంతో నమ్మకం ఉంచాం. మాకు జరిగిన నష్టం, కష్టాన్ని మీరు కూడా చూశారు. అటువైపేమో నూజివీడులో పెద్ద చెరువుకు గండిపడి పెను నష్టమే జరిగింది. బుడమేరు నుంచి వచ్చిన వరద కొల్లేరును ముంచెత్తి ఎనలేని మానసిక వ్యథ మిగిల్చింది. భారీ వర్షాలు, వరదల సమయంలో అనేక కష్టనష్టాలు ఎదురైనా ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాల పైనే మేమంతా ఎదురు చూస్తున్నాం. న్యాయం జరుగుతుందనే ధీమాతో ఉన్నామని కొల్లేరు, రామిలేరు, బుడమేరు పరీవాహక ప్రాంతాలకు చెందిన వారంతా సీఎం చంద్రబాబుకు ఏకరువు పెట్టారు. ఏలూరులోని సీఆర్‌ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో సీఎం చంద్రబాబు నాయుడు బాధితులతో ముఖాముఖి సంభాషించారు. ఉప్పుటేరులో రెగ్యులేటర్‌ నిర్మాణంపై సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తాం. కాల్వలు, డ్రెయిన్లలో తూడు, గుర్రపు డెక్కను తొలగిస్తామని సీఎం చంద్రబాబు బాధితుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

సీఎం హెలికాప్టర్‌లో బుధవారం ఉదయం 11.47 గంటలకు ఏలూరు సీఆర్‌ఆర్‌ గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, కలెక్టర్‌ వెట్రిసెల్వి, జేసీ ధాత్రిరెడ్డి, ఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌, ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌, మేయర్‌ నూర్జహాన్‌, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్‌, కామినేని శ్రీనివాస్‌, పత్సమట్ల ధర్మరాజు, రఘురామకృష్ణంరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళి రామకృష్ణ, మంతెన రామరాజు, జనసేన నాయకులు రెడ్డి అప్పల నాయుడు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

హెలీప్యాడ్‌ లేక సీఎం పర్యటన రద్దు

ఆకివీడు రూరల్‌ : ఆకివీడు మండలం దుంపగడప సమీపంలోని ఉప్పుటేరు పరిశీలించేందుకు బుధవారం సీఎం చంద్రబాబు పర్యటన హెలీప్యాడ్‌ లేకపోవడంతో రద్దయింది. అయి భీమవరం రహదారిలోని గతంలో రాష్ట్రపతి వచ్చిన హెలిప్యాడ్‌ చుట్టూ నీరు నిలవడంతో వదిలేశారు. ఆకివీడు సీఎమ్‌ హైస్కూల్‌, ఏఎంసీని జిల్లా కలెక్టర్‌ నాగరాణి, ఎస్పీ నయీమ్‌ అస్మీ పరిశీలించి సంతృప్తి చెందలేదు. ఆలపాడు వద్ద ఉన్న ఫ్లైఓవర్‌ వద్ద పరిశీలించారు. కైకలూరులో కొన్నిస్థలాలు పరిశీలించి హెలీప్యాడ్‌ నిర్మించేందుకు అనువుగా లేకపోవడంతో రాత్రి 12 గంటల సమయంలో పర్యటన రద్దు చేశారు.

Updated Date - Sep 12 , 2024 | 12:33 AM