Share News

అందరిని ఆదుకుంటా..

ABN , Publish Date - Sep 12 , 2024 | 12:44 AM

‘మీ కష్టాలు చూశా. ప్రతీ ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటా. ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించడమే కాదు యంత్రాంగాన్ని ఆ దిశగా నడిపిస్తున్నా. మీకు ఏ లోటు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటా. ధైర్యంగా ఉండండి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.

అందరిని ఆదుకుంటా..
కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రులు పార్థసారఽథి, నిమ్మల, కలెక్టర్‌ వెట్రి సెల్వి, ఎంపీ పుట్టా, ఎమ్మెల్యేలు చింతమనేని, చంటి, కామినేని

వరదలో నష్టపోయిన ఏ ఒక్కరికి లోటు రానివ్వను : ఏలూరులో సీఎం చంద్రబాబు

కాలువలు, డ్రెయిన్లలో పూడిక తీయిస్తాం

మీరు ఇచ్చిన అధికారమే ఇది

మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధం

గత ప్రభుత్వ పాపాలు ప్రజలకు శాపాలు

రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

‘మీ కష్టాలు చూశా. ప్రతీ ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటా. ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించడమే కాదు యంత్రాంగాన్ని ఆ దిశగా నడిపిస్తున్నా. మీకు ఏ లోటు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటా. ధైర్యంగా ఉండండి’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. బుధవారం కొల్లేరు ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించి వరద ముంపును పరిశీలిం చారు. ఏలూరులో తమ్మిలేరును వీక్షించి సీఆర్‌ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో బాధిత రైతులు, ప్రజలతో సంభాషించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మారుతున్న పరిస్థితులతోపాటు వాతావరణ స్థితిగతులపై మనం కొంత అవగాహన పెంచుకోవాలి. క్లౌడ్‌ బరెస్ట్‌ జరుగుతోంది. మేఘాలు ఒక్కసారిగా ఉన్నఫలంగా ఒకేచోట వర్షిస్తాయి. అంతే అతి భారీ వర్షాలతో అంతా అల్లకల్లోలమే. విజయవాడ ఎగువున ఈ మధ్యన అదే జరిగింది. దాని ప్రభావమే ఎక్కడికక్కడ విధ్వంసం అని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థవంతంగా పనిచేసి ఎక్కడికక్కడ పరిస్థితిని అదుపులోకి తేగలిగామని, తాను వరద సహాయ చర్యల్లో స్వయంగా దిగితే ఐఏఎస్‌లు తన బాట పట్టా రని, ప్రజల కష్టాలను గుర్తించి సహాయం వేగవంతం చేయగలిగారని సీఎం కొనియాడారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ముందుగానే అవగాహన కోసం వరదలను సైతం మ్యాపింగ్‌ చేయదలిచామని, తద్వా రా ఎక్కడికక్కడ ముందస్తు చర్యలకు వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. బుడమేరు వరదకు రకరకాల వక్రభా ష్యాలు వల్లించడానికి జగన్‌ పత్రిక సాహసించిందంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇలాంటి సవాళ్లను తాము ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఒక్క వరదలే కాదు సమ స్య ఏదైనా దాని పరిష్కారం నిమిత్తం ముందు వరుసలో నిలిచేది మేమేనంటూ గత అనుభవాలను చెప్పుకొచ్చారు. తన హయాంలో రాయలసీమలో ముఠా నాయకులు లేకుం డా చేశామని, మత విద్వేషాలు లేకుండా మెరుగైన పాలన అందించామన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో తనపై బాంబుల దాడి చేసినా ప్రజల కోసం ప్రాణాలను సైతం పట్టించుకోకుండా ముందుకెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకప్పుడు హెలికాప్టర్ల ద్వారా సహాయ చర్యలు చేపట్టేవాళ్ళం. ఇప్పుడు సాంకేతికతను ఉపయోగించుకుని డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను ఎక్కడికక్కడ మిద్దెల మీద ఉన్న వారికి అందించామని, ఇక ముందు సాంకేతికతను మరింత మెరుగుపరిచి ఉపయో గించుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

రైతుల కోసం ఏమైనా చేస్తాం..

గోదావరి జిల్లా ప్రజలతో నాకు మంచి అనుబంధం ఉంది. మొదటి నుంచి ఈ జిల్లాలు తమకు మద్దతుగా ఉన్నాయి. పోలవరం రాష్ట్రానికి ఓ వరంగా రూపుదిద్దాం. రైతుల కోసం రెండు పంటలకు నీరు ఇవ్వడానికి తగిన కార్యాచరణ రూపొందించుకుని ముందడుగు వేశాం. కాని గడిచిన ఐదేళ్లల్లో పోలవరం పనులన్నీ సర్వనాశనమయ్యాయి. రైతులు ఇబ్బంది పడ్డారని సీఎం అన్నారు. తాము రైతుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగానే ఉన్నామని, గతం కంటే ఇప్పుడు మెరుగ్గా పరిహారం పెంచుతున్నట్టు ప్రకటించారు. వరి రైతులను ఆదుకునేందుకు విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఇవన్నీ మరో వారం తర్వాత కార్యరూపం దాలుస్తాయన్నారు. జిల్లా కలెక్టర్‌ వెట్రి సెల్వి జిల్లా తాజా పరిస్థితులను సీఎం చంద్రబాబుకు వివరించారు.

శభాష్‌.. మావాళ్లు గట్టోళ్లు

పార్థసారథి, నిమ్మల, రఘురామకు ప్రశంసలు

ఒకవైపు తన సొంత నియోజకవర్గంలో వరద సహాయ చర్యల్లో పాలుపంచుకుంటూనే ఇంకోవైపు రాత్రికి విజయవాడ చేరుకుని తిరిగి సహాయ చర్యలు కొనసాగించడంలో అద్భుతమైన ప్రతిభ చూపారని మంత్రి పార్థసారథిని సీఎం ప్రశంసలతో ముంచెత్తారు. ఏలూరు జిల్లాలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఎప్పుటికప్పుడు సహాయ చర్యలు ఎలా జరుగుతున్నాయో ఆరా తీస్తూ.. అవి క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయో, లేదో సరిచూసుకున్నారని అభినందిం చారు. మరో మంత్రి నిమ్మల రామానాయుడు ఐదు రోజుల పాటు బుడమేరు గండిని పూడ్చేం దుకు నిద్రాహారాలు మాని శ్రమించారంటూ స్వయంగా మంత్రిని చూస్తూ అభినందనలు తెలిపారు. అధికారులు, సిబ్బంది తమ వంతు సహకారం అందిం చారన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వరద ప్రాంతాల్లో తమ ను ఆదుకున్న తీరును బాధితులు తమ మాటల్లో చెప్పినప్పుడు ప్రభాకర్‌ను చూస్తూ పరోక్షంగా అభినందనలు తెలిపారు.

రఘురామ.. ది బెస్ట్‌

తన నియోజకవర్గంలో డ్రెయి న్లలో పూడికలు తీయించేందుకు, రైతులను ఆదుకునేందుకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అద్భుతంగా వ్యవహరించారంటూ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. రైతుల నుంచి తనంతట తానుగా విరాళాలు సేకరించి నియోజకవర్గంలో అందరినీ చైతన్య వంతులను చేయడమే కాకుండా తాను చైతన్యమై వ్యవహరించారంటూ కీర్తించారు.

యూత్‌ ఆఫీసర్స్‌.. వెరీగుడ్‌

జిల్లాలో సమస్యలు ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో ఉత్తేజపూరితంగా పని చేస్తున్నారు. తక్షణం స్పందించి వేగంగా క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. వరదల్లోను మీరంతా స్పందించిన తీరు బాగుంది. అంతా యూత్‌ కదా.. వెరీగుడ్‌ అంటూ సీఎం చంద్రబాబు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప శివకిశోర్‌తోపాటు మిగతా అధికారులు వరదల్లో విశేష కృషి చేయడమే కాకుండా కొల్లేరు అవుట్‌ఫాల్‌ డ్రెయిన్‌ అయిన ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద నీరు వెళ్లడానికి అవకాశంలేని తరుణంలోను కలెక్టర్‌, ఎస్పీలు స్వయంగా సాహసించి ఆ ప్రాంతానికి వెళ్లి తగు చర్యలు తీసుకోవడం సీఎం దృష్టికి వెళ్ళింది. యుద్ధ ప్రాతిపదికన వీరు స్పందించిన తీరును ముఖ్యమంత్రి పరోక్షంగా అభినందించారు. దీనికితోడు వరదలు వచ్చి నప్పుడు ఎవరైనా ప్రాణాంతక పరిస్థితులకు గురైనప్పుడు వారిని రక్షించేం దుకు వీలుగా తాము ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో ఎస్పీ శివకిశోర్‌ వీడి యో ద్వారా వివరించినప్పుడు ఎస్పీని స్వయంగా సీఎం అభినందనలతో ముంచెత్తారు.

ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించిన సీఎం

ఏలూరు సీఆర్‌ రెడ్డి కాలేజీలో వరదపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. తడిసి ముద్దయిన వరి కంకులను సీఎం స్వయంగా పరిశీ లించి ఎలాంటి నష్టం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేదికపై నుంచే పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ వెట్రిసెల్వి సీఎంకు పూర్తిగా వివరించారు. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు పార్థసారథి, రామా నాయు డు, ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు కె.రఘురామకృష్ణం రాజు, బడేటి చంటి, కామినేని శ్రీనివాస్‌, పత్సమట్ల ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు ఘంటా మురళి, గన్ని వీరాంజనేయులు, రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌ కిశోర్‌, జనసేన నేత రెడ్డిఅప్పలనాయుడు, మేయర్‌ నూర్జహాన్‌, ఎస్పీ ప్రతాప శివకిశోర్‌, జేసీ ధాత్రిరెడ్డి, సీఆర్‌ రెడ్డి కళాశాల చైర్మన్‌ అల్లూరి ఇంద్రకుమార్‌ పాల్గొన్నారు.

తమ్మిలేరు పరిశీలన

ఏలూరు క్రైం : సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం సీఆర్‌ఆర్‌ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన తమ్మిలేరు బ్రిడ్జి వద్దకు వచ్చి రెండువైపులా తమ్మిలేరు కాల్వను పరిశీలించారు. ఇరిగేషన్‌ ఎస్‌ఈ దేవ ప్రకాశ్‌ సీఎంకు జిల్లాలోని కాల్వల సమాచారం అందించారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి తమ్మిలేరు వరదల పరిస్థితిపై వివరించారు. ఆ కాల్వ వల్ల శనివారపుపేట కాజ్‌వే వద్ద ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జోక్యం చేసుకుని తమ్మిలేరు పరిస్థితులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు.

భారీ బందోబస్తు

సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు వస్తున్నారని ఈనెల 10వ తేదీ అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందింది. కలెక్టర్‌ వెట్రిసెల్వి, జేసీ ధాత్రి రెడ్డి, ఐజీ అశోక్‌కుమార్‌, ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌, సిబ్బంది కలిసి అర్ధరాత్రి నుంచి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో యుద్ధప్రా తిపది కన తెల్లవారేటప్పటికి సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లుచేశారు. ఉదయం 6 గంటలకల్లా ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. బందోబస్తులో అదనపు ఏస్పీ ఒకరు, ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 46 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 450 మంది, హోంగార్డులు 145 మంది, స్పెషల్‌పార్టీ బృందాలు 105 మంది మొత్తం 964 మంది పోలీసులను వినియోగించారు. ముఖ్య మంత్రి హెలికాప్టర్‌ దిగుతున్న సమయంలోనే ట్రాఫిక్‌ను నిలుపుదల చేశారు. ఆయన తిరిగి మీటింగ్‌ హాలులోకి వెళ్లగానే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ను విడిచిపెట్టారు.

Updated Date - Sep 12 , 2024 | 12:44 AM