Share News

ఏ క్షణాన.. ఏం జరుగునో..?

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:47 AM

ఎగువ నుంచి వరద నీరు భారీగా రావడంతో పలు డ్రెయిన్లు పొంగిపొర్లుతూ కొల్లేరు సరస్సులో కలుస్తున్నాయి. కైకలూరు మండలం అటపాక పక్షుల కేంద్రం చెరువు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఏ క్షణాన.. ఏం జరుగునో..?
కైకలూరు–ఏలూరు ఆర్‌అండ్‌బీ రహదారిలో కొల్లేరు వరద

కొల్లేరుకు పొంచి ఉన్న వరద ముప్పు

అధికారుల పరిశీలన

ఇప్పటికే కైకలూరు ఆర్‌అండ్‌బీ రహదారిపై చేరిన వరద నీరు

అస్తవ్యస్త డ్రైన్లతో ఇళ్లలోకి విష సర్పాలు

వర్షాలు పడితే నూజివీడులో చెరువులకు గండ్ల ముప్పు

కైకలూరు, సెప్టెంబరు 4: ఎగువ నుంచి వరద నీరు భారీగా రావడంతో పలు డ్రెయిన్లు పొంగిపొర్లుతూ కొల్లేరు సరస్సులో కలుస్తున్నాయి. కైకలూరు మండలం అటపాక పక్షుల కేంద్రం చెరువు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. పక్షుల కేంద్రానికి ఆనుకొని ఉన్న పోల్‌రాజ్‌ డ్రెయిన్‌ ఉధృతంగా ప్రవహిస్తూ కొల్లేరు సరస్సులో కలుస్తోంది. దీంతో గట్టు అంచులను తాకుతూ నీరు ప్రవహిస్తోంది. దీంతో పక్షుల కేంద్రం చెరువు గట్లు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ముంపునకు గురైతే పక్షుల కేంద్రం చెరువులోని మత్స్య సంపద కొల్లేరులో కలిసిపోనుంది. అలాగే పందిరిపల్లిగూడెంలోని సర్కారు కాలువ కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొల్లేరు గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో మండవల్లి మండలం పెనుమాకలంక గ్రామ రహదారి, కైకలూరు–ఏలూరు ఆర్‌అండ్‌బీ రహదారిలో చిన ఎడ్లగాడి వద్ద రోడ్డుపై నుంచి రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో కైకలూరు రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించి పోలీస్‌ పికెట్‌ను ఏర్పాటుచేశారు. బుధవారం రాత్రి వాహన దారులను నీటి ప్రవాహాన్ని బట్టి అనుమతిస్తామన్నారు. ఉధృతంగా నీరు ప్రవహిస్తే రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తామని పేర్కొన్నారు. కైకలూరు మండలంలోని కొల్లేరు ప్రాంతాన్ని తహసీల్దార్‌ ఉదయ భాస్కరరావు, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ రవిశంకరరావు పరిశీలించారు. ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులకు గురైతే తక్షణమే అధికారుల దృష్టికి తేవాలన్నారు. కైకలూరు పట్టణంలో డ్రైన్లు అస్తవ్యస్తంగా ఉండడంతో పూర్తిగా వర్షపునీరు పారుదల లేక ఇళ్ళలోకి చేరుతోంది. కైకలూరు కుమ్మరి బజారు ఎదురుగా ఉన్న రోడ్డులో వర్షపునీరు ఇళ్ళల్లోకి చేరి రెండు విష సర్పాలు ఇళ్ళలోకి చొరబడడంతో ప్రజలు వాటిని హతమార్చారు. గత నాలుగు రోజులుగా నీరు నిల్వ ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయా ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కైకలూరు టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న రహదారిలోని నివాస గృహాల్లోకి నీరు చేరడంతో తహసీల్దార్‌ ఉదయ భాస్కర రావు ఆయా ప్రాంతాన్ని సందర్శించి డ్రైన్ల మరమ్మతులు నిర్వహించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.

మోగుతున్న ప్రమాద ఘంటికలు

నూజివీడు, సెప్టెంబరు 4: తెలుగు రాష్ర్టాలకు తుఫాను హెచ్చరికల నేపధ్యంలో నూజివీడు నియోజకవర్గంలో మరోసారి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నూజివీడు పెద్దచెరువుకు భారీ గండ్లుపడి, భారీ నష్టాన్ని మిగిల్చింది. అంతేకాక కేవలం మూడు గంటలపాటు పడిన వర్షానికి నియోజకవర్గంలో దాదాపు 99 శాతం చెరువులు నీటితో నిండి కళంగి పారుతోంది. దీంతో మరోసారి తుఫాన్‌ ప్రభావంతో బారీవర్షాలు పడితే మరికొన్ని చెరువులకు గండ్లుపడే అవకాశం ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. నూజివీడు మండలంలో ఇప్పటికే దాదాపు 12 చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ప్రధానంగా నూజివీడు మండలం బత్తులవారి గూడెం అప్పారావు చెరువు, కొత్త చెరువులకు గండ్లు పడటంతో ఆ నీరు ఒక్కసారిగా సుంకొల్లులోని చెరువులకు ప్రవహించింది. సుంకొల్లులో కూడా చెరువులకు గండ్లు పడటం, మరోవైపు నాగార్జున సాగర్‌ కాలువ యూటీ యనమదల గ్రామం వద్ద కుప్పకూలడంతో మొత్తం నీరు నూజివీడు పట్టణంలోని పెద్దచెరువుకు చేరింది. అదే సమయంలో భారీ వర్షాలతో దాదాపు తెలంగాణ నుంచి నీటిని తీసుకువచ్చే బిల్లుడు వాగు సైతం ఉధృతంగా ప్రవహించడంతో కేవలం రెండు గంటల్లోనే చెరువు నిండి కట్టలు కోతకు గురై గండ్లు పడటం, వరద నీటిలో నూజివీడు పట్టణం చిక్కుకున్న విషయం పాఠకులకు విదితమే. నియోజకవర్గంలో అప్పటి వరకు నీరు లేక ఖాళీగా ఉన్న చెరువులు దాదాపు 99 శాతం నీటితో నిండి అలుగులు పారాయి. వీటిలో యనమదల పెద్దచెరువు, నూజివీడు మొగల్‌ చెరువు, తూర్పు దిగవల్లిలోని మరో చెరువుకు, చెరువులు కట్టలు బలహీనమై ఇప్పటికే కోతకు గురయ్యాయి. వీటితో పాటు పలు చెరువు కట్టలు సైతం బలహీనంగా ఉండటంతో తుఫాను ప్రభావంతో పడే భారీ వర్షాలకు ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. నూజివీడు డివిజన్‌ పరిధిలో తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు బుధవారం నూజివీడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా డివిజన్‌ పరిధిలో కాజ్‌వేలు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ ముందు జాగ్రత్త చర్యలు, నిషేధాజ్ఞలు అమలు పరచాలనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. నూజివీడు పట్టణ సీఐ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి, డిప్యూటీ తహసీల్దార్‌ సింగ్‌, ఇరిగేషన్‌ ఏఈ అభినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బలహీనంగా ఉన్న కట్టల పటిష్ఠతేదీ..?

నూజివీడు నియోజకవర్గంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పలు చెరువుల కట్టలను పటిష్ఠం చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలు విఫలమయ్యాయని చెప్పవచ్చు. గత భారీ వర్షాలకు ముందే విపత్తుల నిర్వహణ సంస్థ కృష్ణా, ఎన్‌టీఆర్‌, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. అయితే నాడు బలహీనంగా ఉండే చెరువు కట్టలను బలపరిచేందుకు కావాల్సిన ఇసుక బస్తాలను సమకూర్చటంలో ప్రభుత్వ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. తిరిగి తుఫాన్‌ ప్రభావంతో కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంటూ ఆరెంజ్‌ అలర్ట్‌ను వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఇప్పటివరకు బలహీనంగా ఉన్న చెరువు కట్టలకు బలోపేతం చేసే విషయంలో కూడా ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచడంలో సంబంధిత శాఖలు పూర్తిగా విఫలమయ్యాయనే ఆరోపణలు గ్రామస్థుల నుంచి వినిపిస్తున్నాయి.

Updated Date - Sep 05 , 2024 | 12:48 AM