ట్రాఫిక్ కష్టాలు తీరేదెప్పుడో?
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:27 AM
జిల్లా కేంద్రం పార్వతీపురంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జటిలమవుతోంది. నిత్యం రద్దీగా ఉండే పట్టణం ప్రధాన రహదారి మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లా కేంద్రంలో జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్య
వాహనదారులు, ప్రజలకు తప్పని ఇక్కట్లు
బైపాస్ రోడ్డు నిర్మించాలని విన్నపం
బెలగాం/పార్వతీపురం టౌన్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జటిలమవుతోంది. నిత్యం రద్దీగా ఉండే పట్టణం ప్రధాన రహదారి మీదుగా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. బైపాస్ రోడ్డు నిర్మిస్తే ట్రాఫిక్ కష్టాలు తొలగే అవకాశం ఉన్నా.. గత వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో పట్టణవాసులు నరకం చూస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
పార్వతీపురం మున్సిపాల్టీలో సుమారు 70 వేల మంది ఉన్నట్లు అధికారుల అంచనా. అయితే జిల్లాకేంద్రంగా ఏర్పాటైన తర్వాత పట్టణ జనాభా, వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు జిల్లా నలుమూలల నుంచి రోజూ వర్తకులు, విద్యార్థులు, వివిధ రకాల పనులపై పట్టణానికి వస్తుంటారు. దీంతో జిల్లాకేంద్రం నిత్యం రద్దీగా ఉంటుంది. పార్వతీపురం పట్టణం మధ్య నుంచి చిలకపాలెం, రామభద్రపురం, కూనేరు పోయే ప్రధాన రహదారి ఉండడం వల్ల విశాఖ నుంచి ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్ తదితర రాష్ర్టాలకు రోజూ భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుం టాయి. దీంతో శబ్ద, వాయు కాలుష్యంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. ఇదిలా ఉండగా స్థానిక దీప్తి లాడ్జింగ్ నుంచి పాతబస్టాండ్ కూడలి వరకు రహదారి ఇరుకుగా ఉండడంతో పాదచారులు, వాహనచోదకులు నానా అవస్థలు పడుతున్నారు. ఎంతోమంది ప్రమాదాలకు గురువుతున్నారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు కత్తిమీద సాములా మారింది. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే బైపాస్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అటకెక్కించిందని సంబంధిత అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏదేమైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి.. బైపాస్ రోడ్డు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్య పరిష్కరించాలి..
పార్వతీపురం పట్టణం ఆనుకుని ఉన్న వెంకంపేట గ్రామ గోలీల నుంచి చెరువు గట్టు మీదుగా రాయగడ రోడ్డులోని సూర్యపీఠం వరకు బైపాస్ నిర్మిస్తే ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. వ్యాపారులు, విద్యార్థులు, వివిధ పనులపై పట్టణానికి వచ్చిన ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు చొరవ చూపి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
- రామారావు , రిటైర్డ్ టీచర్, పార్వతీపురం
=====================================
పాలకులు దృష్టి సారించాలి..
పట్టణం మధ్య నుంచి భారీ వాహనాలు వెళ్లడం వల్ల విద్యార్థులు, ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైపాస్ రోడ్డు నిర్మిస్తే ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రమాదాలు నివారించొచ్చు. పాలకులు దృష్టి సారించి బైపాస్ రోడ్డు నిర్మించాలి.
- ఆర్వీఎస్ కుమార్, పార్వతీపురం