Share News

మెస్‌ చార్జీలు పెంచి.. మెరుగైన మెనూ అందిస్తాం

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:10 AM

మెస్‌ చార్జీలు పెంచి విద్యార్థులకు మెరుగైన ఆహారం అందిస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పాచిపెంటలో రూ.1.75 కోట్ల ఐటీడీఏ నిధులతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల వసతి అదనపు భవనాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు.

మెస్‌ చార్జీలు పెంచి.. మెరుగైన మెనూ అందిస్తాం
విద్యార్థినులతో కలిసి థింసా నృత్యం చేస్తున్న మంత్రి సంధ్యారాణి

పాచిపెంట, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మెస్‌ చార్జీలు పెంచి విద్యార్థులకు మెరుగైన ఆహారం అందిస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పాచిపెంటలో రూ.1.75 కోట్ల ఐటీడీఏ నిధులతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల వసతి అదనపు భవనాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్బులు, షాంపులు, తదితర కాస్మెటిక్‌ చార్జీలు ఇకపై విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమవుతాయని తెలిపారు. చలికాలంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న సీఎం చంద్రబాబు త్వరలో వారికి రగ్గులు, బెడ్‌ షీట్లు, కంచాలు, గ్లాసులు అందజేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో గిరిజన గ్రామాల్లో రెండు వేల రహదారుల నిర్మాణానికి రూ.2,500 కోట్లు మంజూరు చేశారన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి ఽథింసా నృత్యం చేశారు. తమ వసతిగృహంలో తగిన స్థాయిలో మరుగుదొడ్లు లేవని పదో తరగతి విద్యార్థిని కుమారి తెలియజేయగా.. అదనపు మరుగుదొడ్లు, క్రీడామైదానం , ప్రహరీ నిర్మాణాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి గిరిజన ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పి.ప్రసాద్‌బాబు, నాయకులు పోలినాయుడు, సురేష్‌, సూర్యనారాయణ, ఉమామహేశ్వరరావు, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:10 AM