Share News

వైసీపీ సర్కారు పాపం!

ABN , Publish Date - Oct 30 , 2024 | 12:17 AM

జిల్లా ప్రజలపై మరో బాదుడు తప్పేలా లేదు. వచ్చే నెల నుంచి విద్యుత్‌ చార్జీలు పెరగనున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఇప్పటికే చార్జీలతో ప్రజలు సతమతమవుతున్నారు.

వైసీపీ సర్కారు పాపం!

వైసీపీ సర్కారు పాపం!

పెరగనున్న విద్యుత్‌ చార్జీలు

అప్పటివి ఇప్పుడు సర్దుబాటు

జిల్లా ప్రజలపై రూ.5 కోట్ల భారం

విజయనగరం/ రింగురోడ్డు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):

జిల్లా ప్రజలపై మరో బాదుడు తప్పేలా లేదు. వచ్చే నెల నుంచి విద్యుత్‌ చార్జీలు పెరగనున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఇప్పటికే చార్జీలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పడేమో నవంబరు నుంచి విద్యుత్‌ చార్జీలు మరింత పెరగనున్నాయని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. 15 నెలల పాటు విద్యుత్‌ చార్జీల పెంపునకు డిస్కంలకు అనుమతి లభించింది. వాస్తవానికి విద్యుత్‌ చార్జీలు పెంచకూడదని కూటమి ప్రభుత్వం భావించింది. ఇదే విషయాన్ని చంద్రబాబు సైతం ఎన్నికల ముందు నుంచే చెబుతూ వచ్చారు. అయితే జగన్‌ సర్కారు నిర్వాకం పుణ్యమా అని పెంచక తప్పని పరిస్థితి కూటమి ప్రభుత్వానిది. జగన్‌ సర్కారు అనాలోచిత నిర్ణయాలు, నిర్లక్ష్యంతోనే చార్జీలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. గతంలో జగన్‌ సర్కారుకు డిస్కంలు ఎన్నోరకాల ప్రతిపాదనలు చేసినా బుట్టదాఖలు చేశారు. దీంతో రూ.6,072.86 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయి. వాటిని సర్దుబాటు చేయాల్సిన అనివార్య పరిస్థితి కూటమి ప్రభుత్వంపై పడింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అదనపు సర్దుబాటు చార్జీలను 15 నెలల పాటు వసూలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే 2026 జనవరి వరకూ విద్యుత్‌ చార్జీలతో పాటు అదనపు బాదుడు తప్పదేమో.

ప్రజలపై భారం..

ఉమ్మడి జిల్లాలో సుమారు 9 లక్షల వరకూ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. తాజాగా పెరిగిన చార్జీలతో జిల్లా ప్రజలపై రూ.5 కోట్ల అదనపు భారం పడుతుందని విద్యుత్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టీడీపీ హయాంలో తక్కువ మొత్తంలోనే విద్యుత్‌ చార్జీలు వసూలు చేసేవారు. చార్జీలు పెంచిన దాఖలాలు కూడా లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎడాపెడా చార్జీలు పెంచారు. విపక్షాలు, ప్రజాసంఘాలు పోరాటానికి సిద్ధమైనా ఉక్కుపాదం మోపారు. వైసీపీ హయాంలో విద్యుత్‌ వినియోగం, ఇతరత్రా అంశాలపై డిస్కంలు ప్రతిపాదించినా అప్పట్లో ప్రభుత్వం నుంచి స్పందన లేకుండా పోయింది. దీంతో అప్పటి సర్దుబాటు చార్జీలను ఇప్పుడు వసూలు చేయాల్సి వస్తోందని కూటమి ప్రభుత్వ చెబుతోంది.

ఇలా వసూలు చేస్తారు..

కొత్తచార్జీలతో యూనిట్‌ ధర రూ.1.50 పైసలు పెరిగే అవకాశముంది. 30 యూనిట్లలోపు వినియోగిస్తే యూనిట్‌కు రూ.1.90 వసూలు చేస్తుండగా తాజాగా సర్దుబాటు చార్జీలతో అది రూ.3.20కు పెరగనుంది. అలాగే 400 యూనిట్ల వరకూ ఖర్చుచేసే వినియోగదారుడికి ఇప్పటివరకూ యూనిట్‌కు రూ.9.75 వసూలు చేస్తుండగా ఇక నుంచి రూ.12.30 పైసల వరకూ పెరగనుంది. జిల్లాపై రూ.5 కోట్ల భారం పడనుందని విద్యుత్‌ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫ విద్యుత్‌ కొనుగోలుకు, విక్రయానికి మధ్య వ్యత్యాసపు ధరను సర్దుబాటు చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ఈ క్రమంలో 2022-23 సర్దుబాటు చార్జీల రూపంలో ఒక యూనిట్‌కు రూ.1.50 పైసలు చొప్పున వసూలు చేసుకోవడానికి డిస్కంలకు ఏపీఈఆర్‌సీ అనుమతిచ్చింది. జిల్లాలో 5,89,988 మంది గృహ విద్యుత్‌ సర్వీసులు వున్నాయి. నెలకు 268 కోట్ల యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఈ మొత్తం యూనిట్లపై 2022-23 సర్దుబాటు చార్జీల రూపంలో ఒక యూనిట్‌పై రూ.1.50 పైసలు అదనంగా వసూలు చేయనున్నారు.

------------------

Updated Date - Oct 30 , 2024 | 12:17 AM