Share News

తుఫాన్‌ అలజడి

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:15 AM

జిల్లాలో తుఫాన్‌ ప్రభావం కారణంగా శుక్రవారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఇప్పటికే సగం వరికోతలు పూర్తయ్యాయి. ఇంతలో ఈనెల 26 నుంచి వాయగుండం ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించడంతో రైతులు అప్రమత్తమయ్యారు.

తుఫాన్‌ అలజడి
ముక్కాం వద్ద ముందుకొచ్చిన సముద్రం

-రైతులను భయపెడుతున్న జల్లులు

-ధాన్యం తడుస్తాయని ఆందోళన

జిల్లాలో తుఫాన్‌ ప్రభావం కారణంగా శుక్రవారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఇప్పటికే సగం వరికోతలు పూర్తయ్యాయి. ఇంతలో ఈనెల 26 నుంచి వాయగుండం ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించడంతో రైతులు అప్రమత్తమయ్యారు. పండిన చేనును కోతపట్టడం మానేశారు. అప్పటి వరకు కోతపట్టిన వరిని గాలిబడిపెలు పెట్టుకున్నారు. అయితే 26, 27 తేదీల్లో చినుకులు పడకపోవడంతో గురువారం నుంచి తిరిగి కోతకు సిద్ధపడ్డారు. ఈ రెండు రోజులు కోసిన వరి చేను ఇప్పుడు పొలంలో ఉంది. కోతకు సిద్ధంగా ఉన్న పంట కూడా బాగా పండి ఉంది. తుపాన్‌ కారణంగా గాలులకు కంకికి ఉన్న ధాన్యం నేలరాలుతోంది. ఇప్పుడు చినుకులు పడితే ధాన్యం పాడుతుంది. తడిస్తే నష్టపోక తప్పదని రైతులు భయపడుతున్నారు.

విజయనగరం/బొబ్బిలి/భోగాపురం/ఎస్‌.కోట, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం జిల్లాలో రైతులకు వణుకు పుట్టిస్తోంది. శుక్రవారం పలు మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. చేతికందివచ్చిన పంటను కాపాడుకోవాటానికి తీవ్రంగా శ్రమించారు. కొన్ని మండలాల్లో పంట కోత చివరిదశలో ఉంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో ఖరీఫ్‌ సీజన్‌లో 2.40 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. గత 15 రోజులుగా రైతన్నలు పంట కోతలు, తరలింపు, నూర్పిళ్లలో నిమగ్నమయ్యారు. అయితే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వారిలో ఆందోళన మొదలైంది. కొన్నిచోట్ల పంట కోత నిలిపివేయగా, కొన్నిచోట్ల కోసిన పంటను పొలాల్లోనే కుప్పలు పెట్టారు. నూర్పిడి చేసిన ధాన్యం సురక్షిత ప్రాంతానికి చేర్చి టార్పాన్లు కప్పారు. జిల్లాలో 63 శాతం మాత్రమే వరికోతలు అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీటీ రామారావు తెలిపారు. బొబ్బిలి డివిజన్‌లో వ్యవసాయశాఖ అధికారులు ఊరూరా దండోరాలు వేయించి హెచ్చరించిన నేపథ్యంలో చాలామంది రైతులు వరి కోతలు ఆపేసుకున్నారు. మరికొందరు పొలాల్లోనే ధాన్యం కుప్పలుగా పోసి టార్పాలిన్లు కప్పారు. వారం ముందే రైతులను అప్రమత్తం చేశామని ఇన్‌చార్జి ఏడీఏ మజ్జి శ్యామ్‌సుందర్‌ తెలిపారు.

తీరంలో అలజడి

భోగాపురం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా అలజడిగా మారింది. శుక్రవారం ఉదయం నుంచి అడపాదడపా జల్లులు పడడం సాయంకాలం నుంచి ఏకధాటిగా క కురవడం మొదలైంది. సముద్రం ఉధృతంగా మారడంతో పాటు కెరటాలు భీకరమైన శబ్దం, వేగంతో తీరాన్ని తాకుతున్నాయి. అలాగే ముక్కాం తీరంలో 70నుంచి 80అడుగుల వరకు సముద్రం ముందుకు వచ్చింది. చల్లని గాలులు వీయడం.. దీనికితోడు శీతాకాలం కావడంతో ప్రజలు చలితో వణికి పోతున్నారు. మత్స్యశాఖ అధికారులు తీరంలో హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకి వెళ్లరాదని, వేట సామగ్రి సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించారు.

వంగర: మండలంలోని వంగర, సీతారాంపురం, బంగారువలస, కొప్పర, మడ్డూరు తదితర గ్రామాల్లో ఇప్పటికే కోసిన పంటలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంకా కోతలు కోయాల్సిన రైతులు తుఫాన్‌ తగ్గేవరకు వాయిదా వేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారుల సూచనలతో మిన్నకుండి పోయారు.

Updated Date - Nov 30 , 2024 | 12:16 AM