నగల దుకాణంలో చోరీ
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:18 AM
మండలంలోని గొట్లాం గ్రామం జాతీయ రహదారి 26ని ఆనుకొని ఉన్న సిద్ధి వినాయక బంగారు నగల దుకాణంలో ఆదివారం వేకువజామున చోరీ జరిగింది.
- రెండు తులాల బంగారం, 33 తులాల వెండి ఆభరణాలు అపహరణ
- అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు
బొండపల్లి, సెప్టెంబరు 15: మండలంలోని గొట్లాం గ్రామం జాతీయ రహదారి 26ని ఆనుకొని ఉన్న సిద్ధి వినాయక బంగారు నగల దుకాణంలో ఆదివారం వేకువజామున చోరీ జరిగింది. రెండు తులాల బంగారు, 33 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.72వేలను దొంగలు అపహరించారు. దీనిపై దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు, పోలీసుల వివరాల మేరకు.. గొట్లాం గ్రామానికి చెందిన తాళ్లపూడి సత్తిబాబు జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం దుకాణం తెరిచేందుకు వెళ్లగా షట్టరు విరగ్గొట్టి సగం వరకు లేచి ఉండడాన్ని గుర్తించాడు. చోరీ జరిగిందని తెలుసుకుని బొండపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి గజపతినగరం సీఐ ఎస్‌వీ రమణ, ఎస్‌ఐ యు.మహేష్ చేరుకున్నారు. దుకాణాన్ని పూర్తిగా పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ని విజయనగరం నుంచి తెప్పించి దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దుకాణం షట్టర్ తాళాలను పగలగొట్టి రెండు గునపాలతో షట్టర్‌ను సగానికిపైగా ఎత్తినట్లు గుర్తించారు. అనంతరం లోపలకు వెళ్లి బంగారు, వెండి ఆభరణాలను అపహరించి దగ్గరలో ఉన్న తుప్పల్లో తాళాలు, గునపాలను వేర్వేరుగా పడివేసినట్టు ఆనవాలు ఉన్నాయి. దుకాణంలో సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసినట్లు గుర్తించారు. దుకాణం యజమానిని విచారించగా రూ.70 వేల నగదు, 33 తులాల వెండి, 2 తులాల బంగారం అపహరించుకుపోయినట్టు పోలీసులకు తెలిపాడు. స్థానికులను కూడా విచారించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.