Share News

పోలీసుల పేరుతో కిడ్నాప్‌

ABN , Publish Date - Oct 31 , 2024 | 12:06 AM

పోలీసుల పేరుతో ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి, కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసి ఆపై దొరికిపోయిన ఘటన ఎస్‌.కోటలో వెలుగుచూసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే ముందు మీడియాకు వివరాలు తెలిపారు. ఎస్పీ వకుల్‌జిందాల్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పోలీసుల పేరుతో కిడ్నాప్‌
శృంగవరపుకోట పోలీస్‌ స్టేషన్‌లో విలేకర్లతో మాట్లాడుతున్న ఎప్పీ వకూల్‌ జిందాల్‌

పోలీసుల పేరుతో కిడ్నాప్‌

రూ.3లక్షలు ఇవ్వకుంటే చంపుతామని బెదిరింపు

నలుగురి అరెస్టు.. ఒకరు పరారీ

శృంగవరపుకోట, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): పోలీసుల పేరుతో ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి, కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసి ఆపై దొరికిపోయిన ఘటన ఎస్‌.కోటలో వెలుగుచూసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించే ముందు మీడియాకు వివరాలు తెలిపారు. ఎస్పీ వకుల్‌జిందాల్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఎస్‌.కోట మండలం కొట్టాం గ్రామానికి చెందిన దంతులూరి వెంకట సూర్యనారాయణ రాజు వద్దకు ఈనెల 28 ఉదయం 5.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి పోలీసులమని చెప్పి విచారణకు రావాలని కారులో తీసుకెళ్లారు. ఆపై కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి రూ.3లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. దీనిపై ఈనెల 29న బాధితుడి అల్లుడు కాకర్లపూడి శివప్రసాద్‌ శృంగవరపుకోట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ భాస్కరరావు దర్యాప్తు చేపట్టారు. వెంకట సూర్యనారాయణ రాజుతో సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తులపై లోతుగా ఆరా తీశారు. ఆ క్రమంలో విశాఖ జిల్లా మధురవాడకు చెందిన కసిరెడ్డి రాజు పేరు తెరపైకి వచ్చింది. ఈయనతో బాధితుడు సూర్యనారాయణరాజుకు 20 సంవత్సరాలుగా పరిచయం ఉంది. బాగా ఆస్తి ఉండడంతో ఆర్థిక అవసరాలు తీర్చుకొనేందుకు కసిరెడ్డి రాజు తన ఇద్దరు కుమారులు ప్రవీణ్‌కుమార్‌, సాయి, వారి స్నేహితులు దల్లి వెంకటేష్‌, గాబు కిషోర్‌లతో కలిసి కిడ్నాప్‌ ప్రణాళిక రచించారు. ఈ నెల 28న పోలీస్‌లమని చెప్పి ఇద్దరు వ్యక్తులు సూర్యనారాయణ రాజును కారులో ఎక్కుంచుకున్నారు. ముగ్గురు మరో కారులో అనుసరించారు. కిడ్నాప్‌ చేసిన తరువాత రెండు కార్లను విశాఖ జిల్లా పద్మనాభం చుట్టుపక్కల ప్రాంతాల్లో తిప్పారు. ఈనెల 30న శృంగవరపుకోట వైపు వచ్చారు. వారి అడుగులపై పక్కాగా నిఘా పెట్టిన ఎస్‌ఐ భాస్కరరావు 30న ఉదయం 5గంటల సమయంలో ఉసిరి కూడలిలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటుగా వచ్చిన వారి వాహనం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండడంతో సిబ్బందితో కలిసి వెంబడించారు. కసిరెడ్డిరాజు, ప్రవీణ్‌, వెంకటేష్‌, కిషోర్‌లను పట్టుకున్నారు. సాయి తప్పించుకు పారిపోయాడు. ఇతనిపై బాపట్ల జిల్లాలో గంజాయి కేసున్నట్లు పోలీస్‌లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజుపైనా వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో మూడు కేసులు ఉన్నాయి. విలేకరుల సమావేశంలో డీఎస్సీ శ్రీనివాసరావు, సీఐ వి.నారాయణమూర్తి, ఎస్‌ఐలు భాస్కరరావు, గంగరాజులు ఉన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 12:06 AM