పోస్టులు 52.. దరఖాస్తులు 1,959..
ABN , Publish Date - Oct 20 , 2024 | 12:21 AM
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది.
- ఒక్కొక్క పోస్టుకు 38 మంది పోటీ
- ఇదీ కేజీబీవీల్లోని పోస్టుల పరిస్థితి
- నేడు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కొక్క పోస్టుకు 38 మంది పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఆదివారం జరగనుంది. దీంతో పోస్టులు ఎవరికి దక్కుతాయోనని అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కేజీబీవీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గత నెలలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈనెల 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి పట్టణంలోని దాసన్నపేట బాలికోన్నత పాఠశాలలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రుపత్రాలతో పాటు జెరాక్స్ కాపీలు, ఆన్‌లైన్‌లో చేసిన అప్లికేషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంది. 50 బృందాలు అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నాయి. కాగా, జిల్లాలోని కేజీబీవీల్లో 52 పోస్టులు ఖాళీ ఉండగా 1,959 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్క పోస్టుకు 38 మంది పోటీ పడుతున్నారు. ప్రధానంగా వార్డెన్, సీఆర్‌టీ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. ఔట్ సోర్సింగ్ పద్ధతిపై ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీలో వచ్చిన మెరిట్ ప్రకారం పోస్టులకు ఎంపిక చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కలెక్టర్ అంబేద్కర్ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ పోస్టుల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వకూదని, అంతా పారదర్శంగా నిర్వహిస్తామని తెలిపారు.