Share News

మద్యం దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:49 PM

జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు దరఖాస్తులను కోరుతున్నట్లుగా మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

 మద్యం దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌

పార్వతీపురం, అక్టోబరు1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు దరఖాస్తులను కోరుతున్నట్లుగా మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రభుత్వ గెజిట్‌ ప్రకారం జిల్లాలో పార్వతీపురం, పాలకొండ, కురుపాం, సాలూరు, సీతానగరం ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో 52 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించనున్నాం. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు ఎక్సైజ్‌ స్టేషన్‌ వారీగా ప్రత్యేక అధికారులను నియమించాం. ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు పనిదినాల్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. 11న ఎంఏ నాయుడు కన్వెన్షన్‌ హాల్‌లో మద్యం షాపుల కేటాయింపుల ప్రక్రియ చేపట్టనున్నాం. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్‌టీటీపీః// హెచ్‌పీఎస్‌పీఆర్‌వోజేఈసీటీ.కామ్‌లో రూ.2 లక్షల దరఖాస్తు రుసుంతో నమోదు చేసుకోవచ్చు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పేరున గుర్తింపు పొందిన బ్యాంకుల్లో తీసుకున్న రూ.2 లక్షల డిమాండ్‌ డ్రాఫ్ట్‌, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో రావాల్సి ఉంది.వారికి వెంటనే ఎంట్రీ పాసు అందిస్తాం. షాపులు కేటాయింపు పొందిన వారు నిర్ణయించిన ధరల్లో ఆరో వంతు వెంటనే చెల్లించాలి.’ అని ఆయన తెలిపారు. ప్రైవేట్‌ మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి బి.శ్రీనాథుడును కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - Oct 01 , 2024 | 11:49 PM