మహాత్ముడు వచ్చే.. విజయనగరం పులకించే..
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:04 PM
అది 1921 మార్చి 30. స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న వేళ. సరిగ్గా అప్పుడే బరంపురం నుంచి విజయవాడ వెళ్తున్న రైలు విజయనగరం స్టేషన్‌లో వచ్చి ఆగింది. అప్పటికే ఆ ప్రాంతం జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాది మంది ప్రజలతో కిక్కిరిసిపోయి ఉంది.
- జిల్లాకు మూడుసార్లు రాక
- అశోక్ బంగ్లాలో బస
- నేడు బాపూజీ జయంతి
విజయనగరం (ఆంధ్రజ్యోతి) అక్టోబరు 1:
అది 1921 మార్చి 30. స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న వేళ. సరిగ్గా అప్పుడే బరంపురం నుంచి విజయవాడ వెళ్తున్న రైలు విజయనగరం స్టేషన్‌లో వచ్చి ఆగింది. అప్పటికే ఆ ప్రాంతం జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాది మంది ప్రజలతో కిక్కిరిసిపోయి ఉంది. అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి రైలు నుంచి దిగారు. అంతే నేల తల్లి పులకించింది. ఆ ప్రాంతం ప్రజల ఈలలు, చప్పట్లతో మార్మోగింది. ఆ రైలు నుంచి దిగింది మరేవరో కాదు. మహాత్మా గాంధీ. స్వాతంత్రోద్యమంలో భాగంగా భరత జాతిని జాగ్రతం చేసేందుకు తొలిసారి ఆయన విజయనగరం గడ్డపై అడుగుపెట్టారు. ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాల్లో జిల్లా ప్రజలను భాగస్వామ్యం చేసి సముచిత స్థానం కల్పించారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
మహాత్మా గాంధీకి జిల్లా కేంద్రం విజయనగరంతో ఎంతో అనుబంధం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ప్రజలను చైతన్య పరిచేందుకు ఆయన ఇక్కడకు మూడుసార్లు విచ్చేశారు. 1920 నాటికి సాత్వంత్ర్యోద్యమం ఉధృతం అయింది. భరత జాతిని జాగ్రతం చేసేందుకు గాంధీ దేశ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా 1921 మార్చి 30న గాంధీజి మొదటసారి విజయనగరంలో అడుగుపెట్టారు. బరంపురం నుంచి విజయవాడకు రైలులో వెళ్తూ మార్గమధ్యలోని విజయనగరం స్టేషన్‌లో దిగారు. ఆయనను చూసేందుకు మహిళలు, దేశ భక్తులు పోటీ పడ్డారు. ఆ రోజుల్లోనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 10వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. - రెండో పర్యాయం 1929 ఏప్రిల్ 30న గాంధీజి నగరానికి వచ్చారు. విశాఖపట్నం నుంచి దేశభక్తుడు వెంకటప్పయ్య పంతులు ఆయన్ను జిల్లా కేంద్రానికి తీసుకొ చ్చారు. స్థానిక బ్యాంక్ మైదానంలో స్వాతంత్య్ర పోరాటంపై సమావేశం నిర్వహించారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించా లని, నూలు వస్త్రాలు వినియోగించాలని ప్రజలకు గాంధీజి పిలుపునిచ్చారు. ఖద్దర్ వస్త్రాల తయారీ ద్వారా స్థానికంగా లభించే ఉపాధి గురించి తెలియజేశారు. - మూడోసారి 1933 డిసెంబరు 28, 29 తేదీల్లో రెండురోజుల పాటు విజయనగరంలో పర్యటించారు. అప్పట్లో 5వ నెంబరు బంగ్లాగా పిలవబడే ప్రస్తుత అశోక్ బంగ్లాలో ఆయన బస చేశారు. గంటస్తంభం మీదుగా వెళ్లి ప్రకాశం పార్కులో జరిగిన భారీ బహిరంగా సభలో పాల్గొన్నారు. ముందుగా దళితవాడలో పర్యటించారు. అంటరానితనం రూపు మాపేందుకు ఆలయాల్లో వారికి ప్రవేశం కల్పిస్తున్నట్లు స్థానికులు గాంఽధీజికి వివరించారు. నగరంలో ఉప్పు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నట్లు దేశభక్తులు చెప్పారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ‘నేను మీకు సుపరిచితుడినే. ఇక్కడకు ఇది మూడో పర్యాయం వచ్చాను. హరిజనోద్యమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. నూలు వస్త్రాలు ధరించాలని’ ఆయన కోరారు.
పోరాటానికి విరాళాల వెల్లువ
స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న గాంధీజికి జిల్లా ప్రజలు మద్దతు పలికారు. అంతేకాకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు భారీగా విరాళాలను అందచేశారు. మహారాజులు, జమీందార్‌లే కాకుండా మధ్యతరగతి ప్రజానీకం విరివిగా విరాళాలు అందించారు. అదే గోపాలమ్మ అనే బాలిక తన వంటిపై ఉన్న బంగారు ఆభరణాలను సైతం గాంధీజికి అందచేసింది ఆయన పేరుతో నగరంలో పార్కు కూడా నిర్మించారు. అదే విధంగా ఆశోక్ బంగ్లాలో ఆయన జ్ఞాపకాల నిమిత్తం గాంధీజీ రాట్నాం తిప్పుతున్న ఫొటోను గుర్తుగా ఉంచారు.