‘దీపం’తో వెలుగులు
ABN , Publish Date - Oct 30 , 2024 | 11:57 PM
కూటమి ప్రభుత్వం జిల్లా ప్రజలకు దీపావళి కానుక అందించింది. గురువారం నుంచి దీపం-2 పథకంతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. ఇకపై ప్రతి కుటుంబానికి ఏటా మూడు వంట గ్యాస్ సిలిండర్లు అందనుండగా.. జిల్లాలో లక్షలాది మంది లబ్ధిపొందనున్నారు.
దీపం-2 పథకం కింద నేటి నుంచే పంపిణీ
కూటమి ప్రభుత్వం దీపావళి కానుక
ఇప్పటికే బుకింగ్ ప్రారంభం
జిల్లాలో లక్షలాది మందికి లబ్ధి
పార్వతీపురం, అక్టోబరు30 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం జిల్లా ప్రజలకు దీపావళి కానుక అందించింది. గురువారం నుంచి దీపం-2 పథకంతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. ఇకపై ప్రతి కుటుంబానికి ఏటా మూడు వంట గ్యాస్ సిలిండర్లు అందనుండగా.. జిల్లాలో లక్షలాది మంది లబ్ధిపొందనున్నారు. ఈ పథకానికి అర్హులైన వారు ఇప్పటికే బుకింగ్ ప్రారంభించారు. సూపర్ సిక్స్‌లో భాగంగా తొలుత పింఛన్లను పెంచిన కూటమి ప్రభుత్వం తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని 15 మండలాల్లో 17 గ్యాస్ ఏజెన్సీల ద్వారా ప్రజలకు వంట గ్యాస్ సిలిండర్ సరఫరా అవుతుంది. పార్వతీపురం, సాలూరు, పాచిపెంట, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి, కొమరాడ, జియ్యమ్మవలస, మక్కువ, బలిజిపేట, వీరఘట్టం, పాలకొండ, సీతానగరం, భామిని, పాలకొండలో రెండు, సాలూరులో రెండు, గుమ్మలక్ష్మీపురంలో రెండేసి చొప్పున ఏజెన్సీలున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఒక్కో ఏజెన్సీ ద్వారా సిలిండర్ల పంపిణీ జరుగుతుంది. కాగా జిల్లాలో 2,57,604 మంది లబ్ధిదారులున్నారు. ఇందులో సింగిల్ కనెక్షన్ ఉన్నవారు 1,05,569 మంది, డబుల్ కనెక్షన్ 44,610 మంది, దీపం లబ్ధిదారులు 75,481 , సీఎస్‌ఆర్ ద్వారా సిలిండర్ పొందుతున్న వారు 18798 మంది, ఉజ్వల కనెక్షన్‌దారులు 13146 మంది ఉన్నారు. వారంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందడానికి అర్హులు.
- ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున వారు పొందొచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో ముందుగా లబ్ధిదారులు నగదు చెల్లించాల్సి ఉంటుంది. 24 నుంచి 48 గంటల్లో తిరిగి వారి ఖాతాల్లోకి ఆ నగదు జమవుతుంది. కాగా నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31లోపు మొదటి సిలిండర్ బుక్‌చేసుకోవచ్చు.
- ఏటా ఏప్రిల్-జూలై , ఆగస్టు-నవంబరు, డిసెంబరు-మార్చి లోపు సిలిండర్లను ఉచితంగా పొందొచ్చు.
- నవంబరు ఒకటో తేదీన సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పార్వతీపురం, పాలకొండ, కురుపాంలో ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
-‘ వచ్చేనెల నుంచి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో దీపం-2 పథకం ప్రారంభమవుతుంది. ప్రజాప్రతినిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం. అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తాం. అయితే వినియోగదారులు విధిగా ఈకేవైసీ చేయించుకోవాలి.’ అని ఇన్‌చార్జి డీఎస్‌వో శ్రీనివాసరావు తెలిపారు.
ఇవి తప్పనిసరి..
- దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే లబ్ధిదారుని గ్యాస్ కనెక్షన్ కచ్చితంగా వినియోగంలో ఉండాలి.
- బియ్యం కార్డు, ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వ డేటా బేస్‌తో వారి వివరాలు అనుసంధానమై ఉండాలి.
- గ్యాస్ కనెక్షన్‌కు రిజిస్టర్ అయిన సెల్‌ఫోన్ నెంబర్ లేదా సంబంధిత ఆయిల్ కంపెనీ ద్వారా ఈకేవైసీ ప్రక్రియ పూర్తవ్వాలి.