Share News

జై పైడిమాంబ

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:03 PM

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడిమాంబకు భక్తులు మంగళవారం ముర్రాటలు సమర్పించారు.

జై పైడిమాంబ
ముర్రాటలతో ఆలయానికి వెళ్తున్న భక్తులు

-ముర్రాటలు సమర్పించిన భక్తులు

- నగరంలో పండగ శోభ

విజయనగరం రూరల్‌, అక్టోబరు 1: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడిమాంబకు భక్తులు మంగళవారం ముర్రాటలు సమర్పించారు. ప్రతి ఏటా సిరిమానోత్సవానికి ముందు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ముర్రాటలతో ఆలయానికి వెళ్లి పైడిమాంబకు చల్లదనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా భక్తులు పసుపు, కుంకుమ, ఇతర సుగంధ ద్రవ్యాలతో కూడిన ముర్రాటలను తలపై పెట్టుకొని జై పైడిమాంబ అంటూ ముందుకు సాగారు. కొత్తపేట, యాదవవీధి, ఇప్పిలివీధి, కొత్తగవరవీధి, గాజులవీధి, లంకాపట్టణం, జొన్నగుడ్డి తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు ముర్రాటలతో వెళ్లి అమ్మవారికి చల్లదనం చేశారు. థాసా డప్పులు, సాము, గరిడీలు, పులివేషాలు, శక్తివేషాలు అలరించాయి. దీంతో నగరంలో పండగ శోభ నెలకొంది. మూడులాంతర్లు వద్ద ఉన్న చదురుగుడి, రైల్వే స్టేషన్‌ వద్ద ఉన్న వనంగుడి వద్ద పైడిమాంబకు పుష్పాలంకరణ, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:03 PM